కేజీ ప్లాస్టిక్‌ ఇవ్వండి.. నచ్చింది తినండి!

2 Feb, 2021 00:02 IST|Sakshi

కరోనా వైరస్‌ ప్రపంచ మానవాళిని ఒక కుదుపు కుదిపేసింది. దీనివల్ల ఆర్థిక నష్టంతోపాటు, ప్రాణ నష్టం భారీగానే జరిగిందని.. నెనోరు కొట్టుకుని మరీ చెబుతున్నాం. కానీ మనం నిత్యం ప్లాస్టిక్‌ వస్తువులను వాడుతూ.. ప్రకృతిని ప్రమాదం లో పడేస్తున్నామన్న బాధ ఏమాత్రం కనిపించడం లేదు. ప్లాస్టిక్‌ వాడొద్దని, ఒకవేళ వాడితే జరిమానాలు విధిస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా.. వాడకం మాత్రం ఆపడంలేదు. పర్యావరణానికి ప్లాస్టిక్‌ పెను ముప్పుగా పరిణమిస్తోందని పర్యావరణవేత్తలు మొత్తుకుంటున్నారు. ఈ క్రమంలోనే సౌత్‌ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ‘ప్లాస్టిక్‌ లావో ఖానా ఖిలావో’ అనే వినూత్న కార్యక్రమాన్ని జనవరి 23న ప్రారంభించారు.

నజాఫ్‌గర్‌ జోన్‌లో తొలి ‘గార్బేజ్‌ కేఫ్‌’ను ప్రారంభించారు. అయితే.. తాజాగా మరో 23 గార్బేజ్‌ కేఫ్‌లను మున్సిపల్‌ కార్పొరేషన్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. రోడ్లమీద తినడానికి తిండిలేక ఎంతోమంది చెత్తా చెదారం ఏరుకుని అది అమ్మి పొట్టనింపుకుంటుంటారు. ఇటువంటివారు ఈ గార్బేజ్‌ కేఫ్స్‌కు ఒక కేజీ ప్లాస్టిక్‌ ఇస్తే వారికి ఇష్టమైన భోజనాన్ని ఆరగించవచ్చు. ఎవరైనా సరే ప్లాస్టిక్‌ బాటిల్స్, ప్లాస్టిక్‌ క్యాన్స్, కూల్‌డ్రింక్‌ బాటిల్స్‌ వంటివి ఏవైనా ఒక కేజీ తీసుకు వచ్చి గార్బేజ్‌ కేఫ్స్‌ వద్ద ఇస్తే.. మున్సిపల్‌ కార్పొరేషన్‌ భాగస్వామ్యంలోని ఏ రెస్టారెంట్‌లోనైనా వారికి ఇష్టమైన ఫుడ్‌ను ఆర్డర్‌ చేసుకుని తినవచ్చు.

ప్లాస్టిక్‌ ఇచ్చి బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌లలో ఏదైనా ఒక దానికోసం కూపన్‌లను తీసుకుని నచ్చిన ఆహారాన్ని ఆరగించవచ్చు. ఒకవేళ కేజీ ప్లాస్టిక్‌ తీసుకొచ్చిన వారికి ఫుడ్‌ తీసుకోవడం ఇష్టం లేకపోతే అరకేజీ స్వీట్స్‌ తీసుకోవచ్చు. ప్రస్తుతం దేశరాజధాని ఢిల్లీ వ్యాప్తంగా ఈ తరహా కేఫ్‌లు 23 ప్రారంభించారు. సౌత్‌జోన్‌–12,సెంట్రల్‌ జోన్‌–10,వెస్ట్‌జోన్‌–1 చొప్పున ఉన్నాయని మేయర్‌ అనామిక  వెల్లడించారు. కాగా 2019లో ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో దేశంలోనే తొలి గార్బేజ్‌ కేఫ్‌ ప్రారంభమైంది. అక్కడ చెత్త సేకరించి అందిస్తే మీల్స్‌తోపాటు పేదలకు షెల్టర్‌కూడా ఇస్తారు. ఇలా సేకరించిన 8 లక్షల ప్లాస్టిక్‌ బ్యాగ్స్‌తో ఒక రోడ్డు కూడా వేశారు. ఈ రోడ్లు సాధారణ రోడ్లకంటే కూడా మన్నిక కలిగి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు