దీపావళికి ఈసారి టపాసులు పేలతాయా? కాలుష్యం "కామ్‌" అంటోందా?

7 Nov, 2023 12:00 IST|Sakshi

దీపావళి అనగానే పిల్లలు, పెద్దలు తారతమ్యం లేకుండా ఉత్సాహంగా టపాసులు పేల్చుతూ ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఎక్కడలేని సరదా ఈ పండుగలోనే ఉంటుంది. అందువల్లే ఈ పండుగంటే అందరికి ఎంతో ఇష్టం. కానీ ఇప్పుడూ ఆ పండుగ వెలవెలబోక తప్పదన్నట్లుంది. ఓపక్క కాలుష్యం కన్నెర్రజేస్తుంది. 'కామ్‌'గా ఉంటే బెటర్‌ లేదంటే అంతే సంగతులంటూ తనదైన శైలిలో హెచ్చరిస్తోంది మనిషిని. ఏదైతే అదైంది అని టపాసులు కాల్చుదామన్నా..కళ్లముందు కనిపిస్తున్న వాతావరణం సైతం మానవుడా వద్దు..! అని మూగగా చెబుతోంది. ఇంకోవైపు పండుగ జరుపుకునేవాళ్లు, చేసుకోని వాళ్లు ఎంతమంది అంటూ సర్వేలు మొదలైపోయాయి. ఇలాంటి సందిగ్ధానికి దారితీసిన పరిస్థితులు? ప్రస్తుతం మన దేశ రాజధాని పరిస్థితి తదితరాల గురించే ఈ కథనం!.

దీప కాంతుల మిరమిట్లుతో ఆనందహేలిని నింపే పండుగను కాస్తా.జరుపుకుందామా? వద్దా..! అనే స్థితికి వచ్చేశాం. ఎంతలా పర్యావరణ ప్రేమికులు భూమి, గాలి, నీరు కలుషితమవుతున్నాయి అని నెత్తి, నోరు కొట్టుకుని చెబుతున్నా వినిపించుకోలేదు. అందుకు మూల్యం చెల్లించుకునే స్థితికి మనకు తెలియకుండానే వచ్చేశాం. చేతులు కాలక ముందే ఆకులు పట్టుకుందాం, ప్రకృతి సంరక్షణను గుర్తిందాం అన్నా.. వినలేదు. ఇప్పుడు ఏ పండుగైన, సంబరమైన జరుపుకుంటున్నాం అని సంకేతం ఇచ్చేలా.. కాల్చే టపాసులు కూడా కాల్చలేని విధంగా గాలిని కలుషితం చేశాం.

ఇప్పటి వరకు ప్రకృతి సిద్ధంగా లభించే నీటిని సైతం కొనుక్కునేంత స్థాయికి దిగజారిపోయాం. మళ్లీ పీల్చుకునే గాలి విషయంలో కూడా ఆ పరిస్థితి అంటే..వామ్మో ఊహించుకుంటేనే ఏంటోలా ఉంది. అంతెందుకు కరోనా మహమ్మారి టైంలో మాస్క్‌ ముక్కుకి పెట్టుకోమంటేనే..ఊపిరి సలపక అల్లాడిపోయాం. అలాంటిది ఆక్సిజన్‌ బాటిల్‌ వీపుకు పెట్టుకుని తిరగడమంటే.. అమ్మ బాబోయ్‌! ఆ ఆలోచనే వెన్నులో వణుకు పుట్టిస్తోంది కదూ!. కానీ ప్రస్తుతం అంతలా మన దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోయింది. శీతకాలం వచ్చినా.. కాస్త పొగమంచు ఏర్పడినా.. అక్కడ పాఠశాలలకు సెలవులు ఇచ్చేస్తున్నారు అధికారులు.

ఇంకా విచిత్ర ఏంటంటే.. కరోనా రాక మునుపు నుంచే గాలి కాలుష్యం కారణంగా అక్కడ విద్యార్థులు ముక్కులకు మాస్క్‌లు పెట్టుకుని తిరిగారంటే అక్కడ పరిస్థితి ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల్లో రానున్న దీపావళి పండుగకై కొందరు సర్వేలు మొదలు పెట్టారు. సుమారు 32% మంది దీపావళి పండుగ జరుకుంటామని చెప్పాగా, దాదాపు 43% మంది టపాసులు కాల్చమని చెప్పడం విశేషం. అంతేగాదు వాయు కాలుష్యం దృష్ట్యా ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్‌, గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌ తదితర ప్రాంతాల్లో టపాసుల అమ్మకం, వినియోగాన్ని కూడా అక్కడి ప్రభుత్వాలు నిషేధించడం గమనార్హం.

వైద్యులు ఏమంటున్నారంటే..
వాయు కాలుష్యం కారణంగా గుండెజబ్బులతో మరణించే వారి సంఖ్య పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ దీపక్‌ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ఈ గాలి కాలుష్యం కారణంగా గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో సంభవించే మరణాలే ఎక్కువ అవుతయాన్నారు. అంతేగాక ధూమపానం, మద్యం, ఎయిడ్స్‌, క్యాన్సర్‌ తదితర భయానక రోగాల కంటే ఈ గాలి కాలుష్యం కారణంగా పెరిగే మరణాల సంఖ్యే అధికమవుతుందంటూ..గ్రాఫ్‌ ఆధారంగా సవివరంగా తెలియజేశారు. ఈ కాలుష్యం కారణంగా గుండె, శ్వాశకోశానికి సంబంధించిన కొత్త జబ్బులు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందన్నారు. అలాగే బ్రెయిన్‌ స్ట్రోక్‌, వివిధ రకాల క్యాన్సర్‌లు, ఆర్థరైటిస్‌ తదితర వ్యాధులకు కారణం గాలి కాలుష్యం అని పరిశోధనల్లో తేలిదన్నారు.

ఇప్పడు ప్రభుత్వం సత్వరమే దీనిపై చర్యలు తీసుకోక తప్పదని నొక్కి చెప్పారు. ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో గాలి నాణ్యత దారుణం పడిపోయిన దృష్యా బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేటప్పుడూ మాస్క్‌ ధరించాల్సిందేనని అన్నారు. అలాగే ఇంట్లో ఎయిర్‌ ఫ్యూర్‌ ఫెయిర్‌లను ఉపయోగించాల్సిదేనని చెప్పారు. ఇక ఏ ఆరోగ్యవంతమైన వ్యక్తికి అయినా ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌(ఏక్యూఐ) 50 కంటే తక్కువుగానే ఉండాలి. కానీ ఇవాళ గాలి ఏక్యూఐ ఏకంగా 400కి పైనే ఉండటమే తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తోంది. ఈ పరిస్థితి ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే వారికి అత్యంత ప్రాణాంతకం. పైగా ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్‌లు అధికమయ్యే ప్రమాదం కూడా పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు దీపక్‌ కృష్ణమూర్తి.

(చదవండి:  మార్క్‌ జుకర్‌బర్గ్‌ మోకాలికి శస్త్ర చికిత్స..అసలేంటి చికిత్స? ఎందుకు?)

మరిన్ని వార్తలు