జీరో నుంచి మొదలుపెట్టి.. సక్సెస్‌ఫుల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌గా దీపాలీ..

7 Jul, 2023 06:20 IST|Sakshi

‘జీరో’ నుంచి ప్రయాణం ప్రారంభించి ఒక్కో పాఠం నేర్చుకుంటూ తమ కంపెనీ ‘వెల్‌స్పన్‌’ను ప్రపంచంలోని అతి పెద్ద టెక్ట్స్‌టెల్‌  కంపెనీల పక్కన నిలబెట్టింది దీపాలీ గోయెంకా...

రాజస్థాన్‌లోని జైపుర్‌కు చెందిన దీపాలీకి పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే వివాహం జరిగింది. ఇంటికే పరిమితం కాకుండా, ఏదైనా చేయాలనిపించేది. ముప్ఫైసంవత్సరాల వయసులో భర్త చేసే టెక్ట్స్‌టైల్‌ వ్యాపారంలోకి అడుగు పెట్టింది.‘నా భార్యగా ఇక్కడ నీకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం అంటూ ఏవీ ఉండవు’ అని చెప్పాడు ఆమె భర్త ‘వెల్‌స్పన్‌’ చైర్మన్‌ బీకే గోయెంకా. (సోషల్ మీడియా స్టార్, అన్‌స్టాపబుల్‌ టైకూన్‌ దిపాలీ: రతన్‌టాటా కంటే ఖరీదైన ఇల్లు)

తొలిరోజుల్లో ‘బాస్‌ భార్య’గానే గుర్తింపు పొందిన దీపాలీ ఆ తరువాత కాలంలో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. నిరుపమానమైన నాయకత్వానికి ప్రతీకగా ప్రత్యేక ప్రశంసలు అందుకుంది. సైకాలజీ చదువుకున్న దీపాలీకి వ్యాపార వ్యవహారాలలో ఎలాంటి అనుభవం లేదు. ఏమీ తెలియని శూన్యం నుంచి అన్ని తెలుసుకోవాలనే తపన వరకు ఆమె ప్రయాణం కొనసాగింది.

నష్టాలు ఎక్కడా జరుగుతున్నాయి? వాటిని నివారించడం ఎలా? ఇలా ఎన్నో విషయాలను త్వరగా తెలుసుకుంది. ఆఫీసుకు వెళ్లామా, వచ్చామా...అనే తీరులో కాకుండా ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన పెంచుకుంది. ఒకానొక కాలంలో విదేశీ ఒప్పందాలు రద్దు అయిపోయి కంపెనీ సంక్షోభపుటంచుల్లోకి వెళ్లింది. ఇలాంటి పరిస్థితులలో దీపాలీ ట్రబుల్‌ షూటర్‌గా మారి కంపెనీని మళ్లీ విజయపథంలోకి తీసుకువచ్చింది. (వరల్డ్‌లోనే రిచెస్ట్ బిచ్చగాడు ఎవరో తెలుసా? ఎన్ని కోట్ల ఆస్థి తెలిస్తే..?)

ఇంతలోనే కోవిడ్‌ రూపంలో మరో సంక్షోభం ఎదురైంది. దాన్ని కూడా తన నాయకత్వ లక్షణాలతో విజయవంతంగా అధిగమించింది.‘ఏ సంక్షోభాన్నీ వృథాగా పోనివ్వకూడదు. దానినుంచి నేర్చుకునే విలువైన పాఠాలు ఎన్నో ఉంటాయి. మనల్ని మనం పునఃపరిశీలన చేసుకోవడానికి, మెరుగు పెట్టుకోవడానికి సంక్షోభాలు ఉపయోగపడతాయి’ అంటుంది దీపాలీ. ప్రస్తుతం కంపెనీకి సంబంధించిన ఉత్పత్తుల్లో 94 శాతం బయటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇంటర్నేషనల్‌ మార్కెట్‌తో పాటు ఇండియన్‌ మార్కెట్‌పై కూడా దీపాలీ దృష్టి సారించింది.


‘వ్యాపారవేత్త నిలువ నీరులా ఒకచోట ఉండిపోకూడదు. ప్రవాహమైపోవాలి. ప్రతి అడుగులో కొత్త విషయాలు తెలుసుకోవాలి. కొత్తగా ఆలోచించడం అనేది వ్యాపారానికి ప్రాణవాయువులాంటిది’ అనేది తాను నమ్మిన సిద్ధాంతం. ఇప్పుడు కంపెనీ చేతిలో సరికొత్త ఆవిష్కరణలకు సంబంధించి 35 పేటెంట్స్‌ ఉన్నాయి.‘అందరికీ అన్నీ తెలియాలి అని ఏమీ లేదు. తెలుసుకోవడానికి మన దగ్గర ఉన్న శక్తి... ప్రశ్న. ఒక్క ప్రశ్నతో ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. మన అజ్ఞానం బయటపడుతుందేమో అని సంశయిస్తే అక్కడే ఉండిపోతాం. నాకు ఈ విషయం గురించి పెద్దగా తెలియదు. దయచేసి చెబుతారా? అని అడిగేదాన్ని. మనం తెలివి ఉన్న వ్యక్తి అయినంత మాత్రాన సరిపోదు. ఆ తెలివితో కంపెనీ ఎంత ముందుకు వెళ్లిందనేది ముఖ్యం. నేర్చుకోవడం అనే ప్రక్రియకు కాలపరిధి లేదు. అది నిత్యం జరుగుతూనే ఉండాలి’ అంటుంది దీపాలీ.

ఈఎస్‌జీ–ఎన్విరాన్‌మెంటల్, సోషల్‌ అండ్‌ గవర్నెన్స్‌ తమ వ్యాపారానికి కీలకం అనేది దీపాలీ చెప్పేమాట. కంపెనీ ప్రాడక్ట్స్‌కు సంబంధించి తయారీ ప్రక్రియలో రీసైకిల్‌ వాటర్‌ను ఉపయోగించడం కూడా ఇందులో భాగమే. మరోవైపు రైతులతో కలిసి పర్యావరణానికి సంబంధించిన విషయాలపై పనిచేస్తోంది.దీపాలీ ‘వెల్‌స్పన్‌’లోకి అడుగు పెట్టినప్పుడు కేవలం ఏడు శాతం మంది మహిళలే ఉండేవారు.

ఇప్పుడు వారి ప్రాతినిధ్యం ముప్ఫై శాతానికి పెరిగింది.ఈతరం వ్యాపారవేత్తలకు దీపాలీ ఇచ్చే సలహా ఇది...‘వ్యాపారికి తన వ్యాపారం మాత్రమే ప్రపంచం కాకూడదు. తన మానసిక ఆరోగ్యం, తినే తిండి, వ్యాయామాలపై కూడా దృష్టి పెట్టాలి. మనం మానసికంగా చురుగ్గా ఉంటేనే ఉత్తమమైన ఆలోచనలు వస్తాయి’సక్సెస్‌ఫుల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నిరూపించుకున్న దీపాలీ గోయెంకాలో మరో కోణం దాతృత్వం.

మరిన్ని వార్తలు