పంజగుట్ట ఫ్లై ఓవర్‌ పదిలమేనా? | Sakshi
Sakshi News home page

పంజగుట్ట ఫ్లై ఓవర్‌ పదిలమేనా?

Published Fri, Jul 7 2023 7:12 AM

- - Sakshi

హైదరాబాద్: గ్రేటర్‌ నగరంలోని పలు ఫ్లైఓవర్లను నిర్మించి దశాబ్దాలు దాటినా వాటి స్ట్రక్చరల్‌ స్టెబిలిటీ గురించి పట్టించుకోవడం లేదు. దీంతో ఎప్పుడు ముప్పు వాటిల్లుతుందోనంటూ నగర పౌరులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా పంజగుట్ట ఫ్లై ఓవర్‌ పిల్లర్లకు పగుళ్లు ఏర్పడ్డాయంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పరిశీలించిన అధికారులు ప్రమాదమేమీ లేదన్నప్పటికీ, మిగతా వాటి పరిస్థితేమిటన్నది అంతుపట్టడం లేదు. సిగ్న ల్‌ ఫ్రీ ప్రయాణం కోసం కొత్త ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చిన ప్రభుత్వం.. పాత ఫ్లై ఓవర్ల స్టెబిలిటీని కూడా పట్టించుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నిర్మించి వదిలేశారు..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలు నిర్మించిన ఫ్లై ఓవర్లు 30కి పైగా ఉన్నాయి. నిర్మించిన వారే వాటి నిర్వహణను పట్టించుకోవాల్సి ఉన్నప్పటికీ ఆ పని జరగడం లేదు. నగరంలోని ఫ్లై ఓవర్లలో దాదాపు పది ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వచ్చి ఇరవయ్యేళ్లు అవుతోంది. అలాంటి వాటిలో బేగంపేట, బషీర్‌బాగ్‌, తార్నాక, హరిహర కళాభవన్‌, సీటీఓ, మాసాబ్‌ట్యాంక్‌ తదితరమైనవి ఉన్నాయి.

వీటన్నింటిని కూడా పరిశీలించి మరమ్మతులు చేయాల్సి ఉంది. వీటిలో ఫ్లై ఓవర్లపై పడే గుంతల్ని పూడ్చేందుకు పైపొరలుగా కోటింగ్స్‌ వేస్తూ పోతుండటంతో కొన్ని ఫ్లై ఓవర్ల మందం ఎంతో ఎత్తు పెరిగిపోయింది. దీంతోనూ ఫ్లైఓవర్లు ప్రమాదకరంగా మారే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. ప్రమాదాలు జరగక ముందే మరమ్మతులు చేయాల్సిన అవసరముంది. లేని పక్షంలో ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది..?

రాలిపడిన కాంక్రీటు పెళ్లలు..
పంజగుట్ట ఫ్లైఓవర్‌లోని కొన్ని పిల్లర్ల కాంక్రీటు పెళ్లలు రాలిపోవడాన్ని చూపుతూ సోషల్‌ మీడియాలో వెల్లువెత్తిన ఫిర్యాదులతో పరిశీలించిన జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రమాదమేమీ లేదని ప్రాథమికంగా గుర్తించారు. పిల్లర్ల అందం కోసం వాటికి అమర్చిన ఫైబర్‌ బొమ్మల్ని శీతాకాలంలో చలిమంటల కోసం ఫ్లై ఓవర్‌ కింద నిద్రించే యాచకులు కాల్చడం వల్ల బొమ్మలు దెబ్బతినడంతో పాటు పిల్లర్ల పైభాగం వరకు మసిబారినట్లు చెప్పారు. అంతే తప్ప పిల్లర్లకు ప్రమాదం లేదని తేల్చారు.

ఎందుకై నా మంచిదనే తలంపుతో ఫ్లైఓవర్‌ స్ట్రక్చరల్‌ స్టెబిలిటీ పరీక్షలు నిర్వహించాల్సిందిగా జేఎన్‌టీయూ నిపుణులను కోరినట్లు తెలిపారు. నివేదిక అందాక అవసరాన్నిబట్టి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ట్విట్టర్‌లో ఇది వైరల్‌గా మారడంతో పాటు ఫ్లై ఓవర్‌ను మూసివేసి మరమ్మతులు చేయాలని కూడా కొందరు సూచించారు. రెండేళ్ల క్రితం ఫ్లై ఓవర్‌కు అగ్నిప్రమాదాలు జరిగినా ఆధునికీకరించలేదని ఫిర్యాదు చేశారు.

రిహాబిలిటేషన్‌ అవసరం..
ఫ్లై ఓవర్లు దెబ్బతినడమంటూ ఉండదని, దీర్ఘకాలంలో సాధారణంగా ఫ్లై ఓవర్లలోని గర్డర్స్‌ ప్రాంతాల్లో కాంక్రీట్‌ దెబ్బతింటుందని, బేరింగులు అరిగిపోతాయని, ఎక్స్‌పాన్షన్‌ జాయింట్స్‌ వదులై బలహీనంగా మారతాయని ఇంజినీరింగ్‌ నిపుణులు తెలిపారు. ఇంకా స్తంభాల పైభాగాలు (పయర్‌ క్యాప్స్‌) తుప్పుపడతాయి. బాక్స్‌గర్డర్స్‌ ఏటవాలు గోడల్లో పగుళ్లు ఏర్పడతాయి. వాటి బలోపేతానికి మరమ్మతులు అవసరం దాన్నే రిహాబిలిటేషన్‌ అంటారన్నారు. నిర్మాణం జరిగి ఇరవయ్యేళ్లయ్యాక రిహాబిలిటేషన్‌ అవసరముంటుందన్నారు.

మిగతా వాటికి మరమ్మతులేవీ?
నగరంలో ఇప్పటి వరకు డబీర్‌పురా, లాలాపేట ఫ్లై ఓవర్లకు మాత్రం మరమ్మతులు చేశారు. మిగతా వాటి గురించి పట్టించుకోలేదు. ప్రస్తుతం అడిక్‌మెట్‌కు రిహాబిలిటేషన్‌ జరుగుతోందని, బేగంపేట ఫ్లై ఓవర్‌కు కూడా చేయాల్సి ఉందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, నిర్ణీత వ్యవధుల్లో వీటికి మరమ్మతులు చేయాల్సి ఉన్నప్పటికీ ఆ పని జరగడం లేదు.

ఒక్కో ఫ్లై ఓవర్‌కు దాదాపు 15–20 స్పాన్‌లుంటాయి. వాటిల్లో ఉండే బేరింగ్‌లను జాకీలు ఏర్పాటు చేసి మార్చాల్సి ఉంటుంది. వాస్తవానికి వీటి నిర్వహణ బాధ్యతలు చూడటంతోపాటు నిర్ణీత వ్యవధుల్లో తగిన మరమ్మతులు చేపట్టేందుకు స్పెషల్‌ డివిజన్‌ ఉండాలి. కానీ నగరంలో అది లేదు. జీహెచ్‌ఎంసీ ప్రాజెక్ట్‌ విభాగం వీటిపై దృష్టి సారించే పరిస్థితి లేకుండాపోయింది.

Advertisement
Advertisement