మేడమ్‌ నా వయసు 45 ఏళ్లు.. ఆ ట్యాబ్లెట్లు వాడొచ్చా?

25 Apr, 2021 08:41 IST|Sakshi

మేడమ్‌ నా వయసు 45 సంవత్సరాలు. నాకు 4 నెలల కింద ఆపరేషన్‌ చేసి గర్భసంచి,అండశయాలు తీసేశారు. కారణం గర్భసంచిని ఆనుకొని 9 అంగుళాల గడ్డ ఉందని చెప్పారు. పీసీఓడీ ఉండటం వల్ల ఎప్పటికైనా ప్రమాదం కావచ్చని అండశయాలు తీసేశారు. దానివల్ల ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ఉండదని, ఈస్ట్రోజెన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ అని, 0.625 ఎంజీ డోసు ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ టాబ్లెట్లు ఇచ్చారు. ఇవి నేను ఎన్ని సంవత్సరాలు వాడొచ్చు. ఇవి వాడటం వల్ల నష్టాలేవైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే అవేమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి చెప్పండి. ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ టాబ్లెట్లు వాడటం వల్ల బ్రెస్ట్‌ కేన్సర్, హార్ట్‌ఎటాక్‌ వస్తాయని భయపెడుతున్నారు. ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ టాబ్లెట్లకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటే చెప్పండి. మీ సలహాలు మాలాంటి వాళ్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. చాలా థాంక్స్‌ మేడమ్‌.
– జ్యోతి, హైదరాబాద్‌. 
సాధారణంగా ఆడవారిలో గర్భాశయానికి ఇరువైపులా ఉండే అండాశయాల ద్వారా ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ విడుదలవుతుంది. ఒక్కొక్కసారి శరీర తత్వాన్ని బట్టి 45 సంవత్సరాలు దాటిన తర్వాత అండాశయాల పరిమాణం తగ్గుతూ వచ్చి, ఈస్ట్రోజెన్‌ ఉత్పత్తి మెల్లగా తగ్గిపోయి, 48–52 సంవత్సరాల వయసులోపు పీరియడ్స్‌ ఆగిపోయి, మెనోపాజ్‌ దశకు చేరుకుంటారు. కొందరిలో కాస్త ముందు వెనుకలుగా కూడా ఈ పరిస్థితి తలెత్తవచ్చు. ఆడవారు మానసికంగా, శారీరకంగా దృఢంగా, ఆరోగ్యంగా ఉండటానికి ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ దోహదపడుతుంది. ఆపరేషన్‌ ద్వారా రెండు అండాశయాలను తొలగించినప్పుడు ఉన్నట్లుండి ఒకేసారి ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ఉత్పత్తి ఆగిపోతుంది. చాలామందికి చిన్న వయసులోనే– అంటే మెనోపాజ్‌ దశకు చేరుకోవడానికి ముందే అండాశయాలను తొలగించడం వల్ల ఈస్ట్రోజెన్‌ ఉత్పత్తి నిలిచిపోయి, నిద్ర పట్టకపోవడం, చెమటలు పట్టడం, జ్వరం వచ్చినట్లు ఒంట్లోంచి వేడి ఆవిర్లు వచ్చినట్లు అనిపించడం, గుండెదడ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కొందరిలో కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల వరకు ఉంటాయి. తర్వాత కొన్ని సంవత్సరాలకు దీర్ఘకాలిక సమస్యలు మొదలవుతాయి. అంటే, డిప్రెషన్, మతి మరపు, చర్మం పొడిగా మారి, చర్మంపై ముడతలు ఏర్పడటం, యోనిలో మ్యూకస్‌ స్రావాలు సక్రమంగా విడుదల కాకపోవడం వల్ల యోనిలో మంట, మూత్రంలో ఇన్ఫెక్షన్లు, మూత్ర సమస్యలు, కలయికలో నొప్పి, మంట, సెక్స్‌పై ఆసక్తి లేకపోవడం, ఎముకలలో క్యాల్షియం తగ్గిపోయి, అవి బలహీనంగా మారడం, నడుం నొప్పి, ఒంటి నొప్పులు, కీళ్లనొప్పులు, ఆస్టియోపొరోసిస్‌ సమస్య ఏర్పడి చిన్న దెబ్బకే ఎముకలు విరగడం, గుండె సమస్యలు, త్వరగా అలసిపోవడం వంటి ఎన్నో దీర్ఘకాలిక సమస్యలు ఏర్పడవచ్చు. ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ అడ్రినల్‌ గ్రంథిలో కొవ్వు నుంచి విడుదలవుతుంది. బరువు ఎక్కువగా ఉన్నవారిలో ఈస్ట్రోజెన్‌ కొద్దిగా ఎక్కువగా విడుదలవుతుంది. ఇలా విడుదలయ్యే ఈస్ట్రోజెన్‌ మోతాదును బట్టి ఒక్కొక్కరిలో లక్షణాల తీవ్రతలో హెచ్చుతగ్గులు ఉంటాయి. కొందరిలో పెద్దగా ఇబ్బందేమీ ఉండకపోవచ్చు.

మెనోపాజ్‌ తర్వాత అండాశయాలను తొలగిస్తే, తాత్కాలిక సమస్యలు పెద్దగా ఉండవు. ఎందుకంటే ఈస్ట్రోజెన్‌ ఉత్పత్తి అప్పటికే నెమ్మదిగా తగ్గుతూ రావడం వల్ల శరీరం దానికి అలవాటై సర్దుకుంటుంది. శరీర తత్వాన్ని బట్టి దీర్ఘకాలిక సమస్యలు కొన్ని సంవత్సరాల తర్వాత మొదలు కావచ్చు. సాధారణంగా గర్భాశయంలో సమస్య ఎక్కువగా ఉండి, అండాశయాల్లో ఎలాంటి సమస్య లేకపోతే అప్పుడు కేవలం గర్భాశయాన్ని మాత్రమే తొలగించి, అండాశయాలను అలాగే ఉంచేయడం జరుగుతుంది. అలాంటప్పుడు అండాశయాల నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ వల్ల పైన చెప్పిన సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ అండాశయాలలో ఒక్కొక్కరిలో వారి శరీర తత్వాన్ని బట్టి నీటికంతులు, వేరే గడ్డలు రావచ్చు, కొందరిలో రాకపోవచ్చు. అండాశయాలలో గడ్డలు వంటి సమస్యలు ఏవైనా వస్తే, మళ్లీ ఇబ్బంది ఏర్పడవచ్చు అని భయపడి మీకు మాదిరిగానే చిన్న వయసులోనే గర్భాశయంతో పాటు అండాశయాలను కూడా తొలగించుకుంటూ ఉంటారు. దీనివల్ల ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ తగ్గిపోయి, ముందు చెప్పిన సమస్యలు వస్తాయి. ఈ సమస్యలకు చికిత్సగా ఈస్ట్రోజెన్‌ టాబ్లెట్లు, ప్యాచెస్, క్రీముల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దీనినే హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ (హెచ్‌ఆర్‌టీ) అంటారు.

మన శరీరానికి ఏ హార్మోన్‌ ఎక్కువైనా సమస్యే, తక్కువైనా సమస్యే. ఒక్కొక్కరి శరీర తత్వం, వయసు, బరువు, వారి మెడికల్‌ సమస్యలు– గుండెజబ్బులు, రక్తం గడ్డకట్టడంలో సమస్యలు, క్యాన్సర్లు, కుటుంబంలో మెడికల్‌ సమస్యలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, వారి వారి లక్షణాలను బట్టి వారికి తగిన మోతాదులో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ఇవ్వడం జరుగుతుంది. గైనకాలజిస్ట్‌ లేదా ఎండోక్రైనాలజిస్ట్‌ పర్యవేక్షణలో క్రమం తప్పకుండా చెకప్‌లకు వెళుతూ, తగిన మోతాదులో ఈస్ట్రోజెన్‌ తీసుకుంటూ ఉంటే జీవితాంతం ఆరోగ్యంగా గడపవచ్చు. మెడికల్‌ సమస్యలు లేకుండా ఉండి, డాక్టర్‌ పర్యవేక్షణ లేకుండా దీర్ఘకాలం– అంటే పదేళ్లకు పైబడి ఈస్ట్రోజెన్‌ ఎక్కువ మోతాదులో తీసుకునేవారిలో శరీరతత్వాన్ని బట్టి కొందరిలో దుష్పరిణామాలు తలెత్తవచ్చు. బీపీ, స్ట్రోక్, గుండెజబ్బులు, లివర్, గాల్‌బ్లాడర్‌ సమస్యలు, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ చరిత్ర ఉన్నవారికి ఈస్ట్రోజెన్‌ ఇవ్వడం జరగదు.

ఇలాంటి వారికి ఈస్ట్రోజెన్‌ ఇస్తే, దాని వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం, స్ట్రోక్‌ రావడం, లివర్‌ సమస్యలు, గుండెసమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువవుతాయి. ఎలాంటి సమస్యలు లేకున్నా, పదేళ్లకు పైబడి ఈస్ట్రోజెన్‌ వాడితే కొందరిలో అరుదుగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే, ఎప్పుడో వచ్చే సమస్యలకు భయపడి మెనోపాజ్‌ లక్షణాలతో ఎప్పటికీ బాధపడే కంటే డాక్టర్ల పర్యవేక్షణలో హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ తీసుకోవచ్చు. ఇక మీ విషయానికొస్తే, మీ చికిత్సకి మీ హార్మోన్‌ మోతాదును ఇంకా సగానికి తీసుకోవచ్చు. లక్షణాలు పెద్దగా ఏమీ లేకపోతే ప్రత్యామ్నాయంగా ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు, సోయాబీన్స్‌ వంటివి తీసుకోవడం మంచిది. కాల్షియం కోసం పాలు, పెరుగువంటి పాల పదార్థాలు తీసుకోవాలి. సోయాబీన్స్, వాటి ఉత్పత్తుల్లో ఐసోఫ్లావోన్స్‌ అనే ఫైటో ఈస్ట్రోజెన్స్‌ ఉంటాయి. ఇవి కొద్దిగా ఈస్ట్రోజెన్‌ ప్రభావాన్ని తీసుకొస్తాయి. కాబట్టి వీటిని ఎక్కువగా ఆహారంలో తీసుకోవచ్చు. లేదా ఇవి ఐసోఫ్లావోన్స్‌ రూపంలో మాత్రలుగా కూడా దొరుకుతాయి. ఆరోగ్యకరమైన పౌష్టిక మితాహారంతో పాటు నడక, వ్యాయామం, యోగా వంటివి చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే వ్యాయామం వల్ల ఎముకలు గట్టిపడతాయి. కొందరిలో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ బదులు టిబొలాన్, రాలోక్సిఫిన్‌ వంటి ఇతర మందులు డాక్టర్ల పర్యవేక్షణలో కొంతకాలం వాడాల్సి ఉంటుంది. 
- డా‘‘ వేనాటి శోభ, గైనకాలజిస్ట్‌, హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు