''43 ఏళ్లకు ప్రెగ్నెన్సీ వచ్చింది.. పిల్లలు ఆరోగ్యంగా పుడతారా''?

30 Sep, 2023 16:11 IST|Sakshi

నాకిప్పుడు 43 ఏళ్లు. అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈ వయసులో పిల్లల్ని కంటే ఆరోగ్యంగా  పుడతారా? ఇది నాకు తొలి కాన్పు. పిల్లల కోసం మందులు వాడీవాడీ విసిగిపోయి ఆపేశాక వచ్చిన ప్రెగ్నెన్సీ అండీ...!

– ఎన్‌. చంద్రప్రభ, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌

నలభై ఏళ్లు దాటిన ప్రెగ్నెన్సీలో చాలా రిస్క్స్‌ ఉంటాయి అనేది చాలామంది భయం. కానీ సింగిల్టన్‌ ప్రెగ్నెన్సీ సాఫీగా సాగే అవకాశం లేకపోలేదు.  25– 35 ఏళ్ల మధ్య ఉండే కాంప్లికేషన్స్‌ కన్నా కొంచెం ఎక్కువ రిస్క్‌ ఉండొచ్చు. వాటిలో ఆపరేషన్‌ ద్వారా డెలివరీ అవటం, నెలలు నిండక ముందే కాన్పు అయ్యే రిస్క్‌ వంటివి ఎక్కువ. ఐవీఎఫ్, కవలల ప్రెగ్నెన్సీలో ఈ రిస్క్‌ ఇంకాస్త పెరుగుతుంది.

మొదటి మూడునెలల్లో పుట్టుక లోపాలు ..డౌన్‌సిండ్రోమ్‌ లాంటివి, గర్భస్రావం, ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ వంటి ప్రమాదాలు ఎక్కువుంటాయి. బాడీ పెయిన్స్, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులూ ఎక్కువుండొచ్చు. డాక్టర్‌ని సంప్రదించినప్పుడు వాటికి తగిన ట్రీట్‌మెంట్‌ను ఇస్తారు. తొలి మూడునెలల్లో తప్పనిసరిగా జెనెటిక్‌ స్క్రీనింగ్‌ టెస్ట్స్‌ చేయించుకోవాలి.

ప్రతినెల బీపీ, సుగర్, థైరాయిడ్‌ పరీక్షలూ చేయించుకోవాలి. ప్రతినెల తప్పకుండా గైనకాలజిస్ట్‌ను సంప్రదిస్తూ టైమ్‌కి చేయవలసిన స్కానింగ్‌లు, పరీక్షలు చేయించుకుంటూండాలి. సరైన చికిత్సతో నలభై ఏళ్లు దాటిన తర్వాత కూడా సురక్షితమైన, ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ, కాన్పూ సాధ్యమే.  

- డా భావన కాసు
గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌
హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు