7 యేళ్లలో 17 లక్షలు సంపాదించిన రైతు.. ఏం పండించాడో తెలుసా?

28 Sep, 2021 13:41 IST|Sakshi

ఎకరం భూమిలో సాగు

7 యేళ్లలో రూ.17 లక్షలు

అంతర పంటలుగా కూడా లాభమే!

షేర్‌ మార్కెట్లో లేదా ఫైనాన్స్‌లో పెట్టుబడులు పెడితే డబ్బులే డబ్బులని హుషారుగా పరుగెడతారు కొందరు. కానీ ఒక్కోసారి ఆశించిన స్థాయిలో లాభం ముట్టదు. ఇప్పుడిది పాత పద్ధతంటున్నాడు ఈ రైతు. నిజమండి..!! తాను పెట్టిన పెట్టుబడికి 7 సంవత్సరాల్లో అక్షరాల 4 రెట్ల లాభం అర్జించనున్నాడు. కేవలం వ్యవసాయం ద్వారా అంత మొత్తం ఎలా సంపాదిస్తున్నాడో? అంత వింతగా ఏం పండించాడో? అదెలా సాధ్యమైందో మీరూ తెలుసుకోండి..

ఎల్‌ఎల్‌బీ చదివినప్పటికీ..
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరికి చెందిన సాకేతు గ్రామంలో నివసిస్తున్న 65 యేళ్ల సురేశ్‌ చంద్ర వర్మ బీఏ, ఎల్‌ఎల్‌బీ చదువుకున్నాడు. ఐతే వ్యవసాయం పట్ల మక్కువ కలిగిన వర్మ తన పూర్వికుల ద్వారా సంక్రమించిన భూమిలో రకరకాల పంటలను పండించడం ప్రారంభించాడు. చెరకు, వరి, గోధుమ వంటి పంటలు పండించడంలో ఆరితేరాడు. అంతేకాకుండా మామిడి, ఉసిరి, లీచీ, నిమ్మ వంటి ఉద్యాన పంటల సాగులోనూ నిష్ణాతుడే. అంతర పంటల ద్వారా కూడా అధిక లాభాలను ఆర్జించాడు.

కేవలం రూ. 25 లకే..
నాలుగేళ్ల క్రితం పంత్‌నగర్‌ వ్యవసాయ యూనివర్సిటీ నుంచి 234 వెదురు మొక్కలను కేవలం రూ. 25 ల చొప్పున కొని ఎకరం భూమిలో నాటాడు. ఐతే ఈ నాలుగేళ్లలో ఒక మొక్క 20 నుంచి 25  వెదురు బొంగులను ఉత్పత్తి చేసింది. అంతేకాకుండా మూడేళ్లపాటు సహపంటగా చెరకును కూడా దీనితో పాటుగా పండించాడు. నాలుగో యేట నుంచి మాత్రం కేవలం వెదురును మాత్రమే కొనసాగించాడు. ప్రస్తుతం దున్నే పనుల్లో ఉంది.

ఏడు సంవత్సరాలకు రూ. 17 లక్షలు ఇలా..
ఈవిధంగా ప్రతి మొక్కకు 40 నుంచి 50 వరకు వెదురు వచ్చే అవకాశం ఉంది. పల్లెటూరులో ఒక వెదురు బొంగు రూ.150లు పలుకుతుంది. ఈ విధంగా ప్రతి మొక్కకు 50 వెదుర్లు ఉత్పత్తి అయితే 234 మొక్కలకు 11 వేల 7 వందల వెదుర్లు వస్తాయి. ఒక వెదురును రూ.150లకు అమ్మితే మొత్తంగా రూ. 17 లక్షల 55 వేలు లాభం చేతికొస్తుంది. రేటు కొంచెం ఎక్కువ పలికితే లాభం మరింత పెరగొచ్చు. ఇప్పుడర్థమైందా.. ఈ చదువుకున్న రైతు చేసిన అద్భుతం. 

చదవండి: మెదడు చురుకుగ్గా ఉండాలంటే.. ఈ ఐదింటికీ పని చెప్పాలట!!

మరిన్ని వార్తలు