మీ ఆహారపు అలవాట్లు సరియైనవేనా...!

7 Apr, 2021 23:40 IST|Sakshi

గుడ్‌ఫుడ్‌ హ్యాబిట్స్‌

మంచి ఆరోగ్యానికి మంచి అలవాట్లు ఎంతగానో దోహదపడతాయి. ఈ మంచి–చెడ్ల అలవాట్లు ఆహారం విషయంలోనూ ఉంటాయి. మంచి ఆహారపు అలవాట్లతో మంచి వ్యాధి నిరోధకత సమకూరడం మనకు పైకి వెంటనే కనిపించకపోవచ్చేమో గానీ.. మంచి ఇమ్యూనిటీ రావడం తప్పక జరుగుతుంది. అయితే ఒకవేళ మన ఆహారపు అలవాట్లు అంతగా బాగా లేవనుకోండి. వాటి ప్రతికూల ప్రభావాలు తక్షణం కనిపిస్తాయి. ఇటీవల మనలో చాలామందిలో పొట్ట ఉబ్బరంగా ఉందనో, రాయిలా మారిందనో, తినగానే ఉబ్బుగా మారి, తేన్పులు వస్తూ, ఛాతీ మీద చాలా బరువుందనో అంటూ ఉండటం చూస్తుంటాం. అది ఆహారపు అలవాట్లలో తేడా వల్ల చాలామందిలో కనిపించే తొలి లక్షణం. మంచి ఆహారపు అలవాట్లతో కలిగే మంచితో పాటు  చెడు ఆహారపు అలవాట్లతో కలిగే దుష్ప్రభావాలను తెలుసుకుని, ఆ మేరకు మంచి ఆహారపు అలవాట్లును అనుసరించడం ఎందుకు అవసరమో తెలిపే కథనం ఇది.  

మనకు చాలా రకాల అలవాట్లు ఉంటాయి. కొందరు పొద్దున్నే లేచీ లేవగానే కాఫీ తాగేస్తారు. అదీ పరగడుపున. అలా చేస్తేగానీ వాళ్లల్లో కొన్ని జీవక్రియలు మొదలుకావు. అలా కాఫీ తాగందే పొద్దున్నే టాయెలెట్‌ వెళ్లాల్సిన ప్రక్రియ సజావుగా జరగదని చాలామంది అంటుంటారు. ఇదే సూత్రాన్ని కొందరు సిగరెట్‌ విషయంలో వల్లిస్తుంటారు. నిజానికి పొద్దున్నే పరగడుపున కాఫీ తాగడమే ఒక ఆహారపరమైన దురలవాటు అనుకుంటే.. సిగరెట్‌ అంతకంటే చెడు అలవాటు. కానీ ఈ రెండింటినీ అనుసరించేవారి సంఖ్య తక్కువేమీ కాదు. సిగరెట్‌ను డైట్‌ (ఆహారపు) అలవాటుగా పరిగణించకపోయినా... అలవాట్ల గురించి చెప్పేందుకు అదో ఉదాహరణ. నిజానికి పొద్దున్న లేవగానే కాఫీ తాగడానికి బదులుగా మంచినీళ్లు తాగడం ఓ మంచి అలవాటు. దీనివల్ల హైడ్రేటెడ్‌గా ఉండటం సాధ్యమవుతుంది. ఇప్పుడు మనకు మేలు చేసే కొన్ని మంచి ఆహారపు అలవాట్లును చూద్దాం. 

మంచి ఆహారపు అలవాట్లు ఇవి... 
పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌ మిస్‌ చేయకపోవడం : పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌ మిస్‌ చేయకపోవడం మంచి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాటు. పగటివేళ మనం పొద్దున్న లేచాక... కనీసం ఐదు లేదా ఆరు గంటలు వ్యవధిలో ఆహారం తీసుకుంటూ ఉంటాం. కాబట్టి జీవక్రియలకు అవసరమైన ఇంధనం అందుతూ ఉంటుంది. కానీ... మనమందరం సగటున దాదాపు ఎనిమిది గంటల పాటు నిద్రపోతుంటాం. నిద్రకు ఉపక్రమించే ముందర కనీసం గంట ముందుగా భోజనం చేస్తామనుకుంటే.. అలాగే నిద్రలేచాక మరో గంట తర్వాత తింటామనుకుంటే... దాదాపు 10 గంటల పాటు జీర్ణవ్యవస్థకు ఆహారం అందదు.

అందుకే మన దేహ అవసరాలకూ, జీవక్రియలకూ భోజనం అందించాల్సినందున ‘బ్రేక్‌ఫాస్ట్‌’ తప్పనిసరి. పైగా ఉదయం మన రోజుమొదలు కాగానే ఆరోజంతా కావాల్సిన శక్తి (ఎనర్జీ)కి ప్రధాన వనరు ‘బ్రేక్‌ఫాస్ట్‌’. కాబట్టి ఇతర ఏ పూట భోజనంతో పోల్చినప్పటికీ ‘బ్రేక్‌ఫాస్ట్‌’ మాత్రం తప్పక తీసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్‌ విషయంలో ఓ సామెత కూడా ఉంది. ‘‘బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకునే భోజనం రాజభోజనంలా, మధ్యాహ్న భోజనం సామాన్యుడి భోజనంలా, రాత్రిభోజనం పేదవాడి భోజనంలా ఉండటం ఆరోగ్యకరమైన అలవాటు’’ అని నానుడి. 

పోషకాలన్నీ లభ్యమయ్యే సమతుల ఆహారం :  మన భోజనంలో ప్రధానంగా అన్ని రకాల పోషకాలు ఉండాలి. అంటే... తక్షణ శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు, కణాలూ కణజాలాలలను రిపేర్‌ చేసి, వాటిని నిర్మించే ప్రోటీన్లు, దేహానికి అవసరమైన కొవ్వులతోపాటు, విటమిన్లు, మినరల్స్‌ (ఖనిజ లవణాలు... మళ్లీ ఇందులోనూ ఎక్కువ మోతాదుల్లో అవసరమయ్యే మ్యాక్రో న్యూట్రియెంట్లు, తక్కువ మోతాదుల్లోనైనా తప్పనిసరిగా కావాల్సిన మైక్రో న్యూట్రియెంట్లు)... ఇవన్నీ ఉండేలా మన భోజనం ఉండాలి. ఇలా అన్నీ సమపాళ్లలో కలిగి ఉండే భోజనాన్ని ‘సమతులాహారం’ (బాలెన్స్‌డ్‌) అంటారు. ఇవన్నీ ఉండాలంటే మన భోజనంలో పిండిపదార్థాలనిచ్చే బియ్యం, గోధుమలు, ప్రోటీన్లకోసం పప్పులు, మాంసాహారం, కొవ్వుల కోసం నూనెలతో పాటు  ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు; విటమిన్లను సమకూర్చే తాజాపండ్లు తీసుకోవాలి.


 
చిన్న మోతాదుల్లో ఎక్కువ సార్లు తినడం : మనం తినే ఆహారాన్ని ఏ రెండు పూటలకో పరిమితం చేయకుండా... తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తీసుకోవాలి. అంటే ఉదయపు ఉపాహారం(బ్రేక్‌ ఫాస్ట్‌), మధ్యాహ్న భోజనం (లంచ్‌), సాయంత్రపు పలహారం (ఈవినింగ్‌ శ్నాక్స్‌), రాత్రి భోజనం (సప్పర్‌/డిన్నర్‌) అంటూ ఇలా విభజించుకొని కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు తినడం అన్నది జీర్ణవ్యవస్థపై భారం పడనివ్వదు. ఎప్పుడూ శరీరానికి అవసరమైన శక్తి క్రమబద్ధమైన రీతిలో అందుతుంది. కొందరు చాలా తక్కువసార్లు... ఎక్కువ పరిమాణంలో ఆహారం తీసుకుంటుంటారు.

చాలా బిజీగా ఉండేవారు సమయం లేదనో లేదా తినే సమయంలో మరో పని చేయవచ్చునని అనుకోవడం వల్లనో కొందరు రెండు పూటలే తింటుంటారు. ఇలా తక్కువసార్లు ఎక్కువ పరిమాణంలో తినేవారిలో  పొట్ట ఉబ్బరంగా ఉండటం, పొట్ట రాయిలా గట్టిగా అనిపించడం, తినగానే ఎంతో అసౌకర్యమైన రీతిలో పొట్ట ఉబ్బిపోవడం, తిన్నవెంటనే భోజనం ఛాతీకి అంటుకునే ఉందన్న భావన, ఛాతీలో మంట, కడుపులో అసౌకర్యమైన రీతిలో నొప్పి, పుల్లటి తేన్పులు వంటి లక్షణాలు కనిపించడం చాలా సాధారణం. దీనితో పాటు ఏయే వేళకు తినాల్సిన భోజనాన్ని ఆయా వేళల్లో తినడం కూడా మంచి ఆహారపు అలవాట్లలో ఒకటి.
 
నీళ్లు ఎక్కువగా తాగడం: మన శరీరంలోని 75 శాతం కేవలం నీటినే కలిగి ఉంటుంది. మనలోని ద్రవాలను కోల్పోవడం అన్నది ఒక్కోసారి ప్రాణానికే అపాయం. ఇలా జరగడాన్ని ‘డీ–హైడ్రేషన్‌’గా చెప్పవచ్చు. వేసవికాలంలో ఈ పరిణామం వల్ల ఒక్కోసారి ప్రాణాపాయం కూడా కలగవచ్చు. అందుకే మనం ప్రతిరోజూ కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగడం అవసరం. పైగా మెదడు నుంచి నరాల ద్వారా ఆయా దేహభాగాలకు అందాల్సిన ఆదేశాలు చేరడం అన్నది నీళ్లలో ఉండే లవణాల ద్వారానే సాధ్యం. ఇందుకోసమైన పుష్కలంగా నీళ్లు తాగుతుండటం అవసరం. 

చెడు ఆహారపు అలవాట్లివి... 
మంచి ఆహారపు అలవాట్లుగా పైన పేర్కొన్న వాటిని అనుసరించకపోవడాన్ని చెడు ఆహారపు అలవాట్లుగా చెప్పవచ్చు. అంటే సమతులాహారం తీసుకోకపోవడం, వేళకు తినకపోవడం, ఎక్కువ పరిమాణంలో తక్కువ తినడం, తాజాపండ్లు తీసుకోకపోవడం, తగినన్ని నీళ్లు తాగకపోవడం ఇవన్నీ ఆహారపరమైన చెడు అలవాట్లు. అయితే దీనికి తోడు మరికొన్ని అంశాలు కూడా ఇటీవలి ఆధునిక జీవనశైలిలో మనకు అలవాడుతున్నాయి. ఉదాహరణకు... 

జంక్‌ఫుడ్‌ తినడం : మార్కెట్‌లో తేలికగా దొరకే జంక్‌ఫుడ్, బేకరీ ఫుడ్‌ తీసుకోవడం అన్నది చెడు అలవాట్లలో ముఖ్యమైనది. వాటిల్లో ఉండే రిఫైన్‌డ్‌ పిండిపదార్థాల వల్ల డయాబెటిస్‌ వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాదు... షెల్ఫ్‌లైఫ్‌ను పెంచడానికి వాడే కొన్ని అనారోగ్యకరమైన నూనెలు, ఆహారపదార్థాలను ఆకర్షణీయంగా కనిపించడం కోసం వాడే కొన్ని రంగుల వల్ల ఇలాంటి జంక్‌ఫుడ్‌ కారణంగా అనేక క్యాన్సర్‌లు కూడా వస్తున్నట్లు అనేక అధ్యయనాల్లో తేలింది.
 

మితిమీరి తీపిపదార్థాలు తినడం : మనం తీసుకునే పదార్థాలలో తీపిని అందరూ ఇష్టపడతారు. ఐతే వీటిని మరీ మితిమీరి తినడం వల్ల నోటిలో నుంచే నష్టాలు మొదలవుతాయి. పళ్లు పాడైపోవడం, నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే సూక్ష్మజీవులు పెరగడం వంటి నష్టాలు సంభవిస్తాయి. అంతేకాదు... క్యాన్సర్‌ కణాలకు తీపి పదార్థాలంటే చాలా మక్కువ. అందుకే మితిమీరి తీపిపదార్థాలు తినడం కూడా క్యాన్సర్‌కు కారణమవుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అందుకే ఆహారాల్లో తీపి పదార్థాలను చాలా ఎక్కువగానూ / మరీ మితిమీరి గానీ తినడం సరికాదు. ఇక కొంతమంది తమ ఆహారపు అలవాట్లలో టీ, కాఫీలు మితిమీరి తాగుతుంటారు.

ఇలా రెండు లేదా మూడు కప్పుల పరిమితికి మించి,  మితిమీరి కాఫీ, టీలు తాగడం తాగడం ఒక అనర్థమైతే... అందులో ఉండే తీపి వల్ల కూడా మన ఆరోగ్యానికి మరింత చేటు జరుగుతుంది. ఇక తినడానికి కనీసం అరగంట ముందు గానీ లేదా తిన్న తర్వాత అరగంట పాటు గానీ టీ తాగకూడదు. ఎందుకంటే దీనివల్ల మనం తిన్న ఆహారంలో ఉన్న ఐరన్‌ ఒంటికి పట్టదు. 

కూల్‌ బీవరేజెస్‌ : మనలో చాలామంది కోలా డ్రింకులు, శీతల పానియాలను తాగుతూ ఉంటారు. ఇవి ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. వీటిని తీసుకోవాల్సి వచ్చినా చాలా చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. ఇక రాత్రి నిద్రకు ఉపక్రమించేందుకు అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే ఇందులోని కెఫిన్‌ నిద్రాభంగం కలిగిస్తుంది. దీనివల్ల మళ్లీ అసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇక వీటిలోని చక్కెరల వల్ల... ముందుగా పేర్కొన్నట్లు మితిమీరిన తీపిపదార్థాల వల్ల కలిగే అనర్థాలన్నీ కలుగుతాయి. పైన పేర్కొన్న అలవాట్లలో మంచి ఆహారపు అలవాట్లను అలవరచుకుని, చెడ్డవాటిని దూరం చేసుకుంటే చాలా కాలం ఆరోగ్యంగా ఉండటం సాధ్యమవుతుంది. 

ఆల్కహాలిజమ్‌ అతి పెద్ద చెడు అలవాటు 
ఆల్కహాల్‌ ఎలాగూ చాలా చాలా ప్రమాదకరమైన ఆహారపు అలవాటు. దీనికి తోడు కొంతమంది ఆల్కహాల్‌తో పాటు కోలా డ్రింకులు కలుపుకోవడం చేస్తుంటారు.  ఈ రెండింటి దుష్ఫలితాలు కలిసి రెట్టింపుగా పరిణమిస్తాయి. ఆల్కహాల్‌ తాగిన సమయంలో వేపుడు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటుంటారు. వేపుళ్లు ఎలాగూ మంచి ఆహారపు అలవాటు కాదు. పైగా ఆల్కహాల్‌ వల్ల కడుపులోని లైనింగ్స్‌ దెబ్బతినడం మరో ప్రమాదం. దాంతో మళ్లీ అసిడిటీ, అల్సర్లు వస్తాయి. ఆల్కహాల్‌ లివర్‌ను దెబ్బతీసి, మొత్తం జీర్ణవ్యవస్థ పనితీరునే అస్తవ్యస్తం చేస్తుంది. అందుకే ఆల్కహాల్‌ అలవాటును పూర్తిగా వదిలేయాలి. 


డా. సుధీంద్ర ఊటూరి
లైఫ్‌స్టైల్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌ 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు