Friendship Day 2021: అరుదైన స్నేహబంధాలు

1 Aug, 2021 10:53 IST|Sakshi

ప్రపంచంలో ఎన్నో భాషలున్నాయి. అలాగే స్నేహానికీ ఒక భాష ఉంది. ఆ భాష పదాలతో కాక భావాలతో ఏర్పడుతుంది. ఎటు చూసినా విభజన రేఖలే కనిపిస్తున్న నేటి పరిస్థితుల్లో ప్రపంచమంతటినీ కలిపి ఉంచగల శక్తి ఆ ఒక్క స్నేహ భావానికే ఉంది. ఉంటుంది. కాబట్టి అందరం స్నేహ భావంతో ఉందాం.  ఒకరికొకరం  హ్యాపీ ఫ్రెండ్‌షిప్‌ డే చెప్పుకుందాం. 

ఈ ప్రపంచంలో నా అన్నవారే లేని వాళ్లుండవచ్చు గాని స్నేహితులు లేని వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎవ్వరూ లేకున్నా ఒక్క స్నేహితుడు చాలు... అన్ని విధాలా మన జీవితాన్ని ప్రభావితం చేయగల బంధం స్నేహం. అన్ని బంధాలనూ పుట్టుకతోనే ఇచ్చే దేవుడు, స్నేహ బంధాన్ని ఎంచుకునే అవకాశం మాత్రం మనిషికే వదిలేశాడు. కన్నవారితో, కట్టుకున్నవారితో, తోడబుట్టిన వారితో, ఆఖరుకు కడుపున పుట్టినవారితో చెప్పుకోలేని విషయాలను సైతం మిత్రులతో పంచుకోవడమే స్నేహం గొప్పతనం. స్నేహమనేది ఓ మధురమైన అనుభూతి, దీనికి వర్ణ, వర్గ, లింగ, జాతి, వయసు, స్థాయి, కులాలతో నిమిత్తంలేదు. బాల్యం నుంచి వృద్ధాప్యం దాకా ప్రతి మనిషి జీవితంలోనూ స్నేహం అందమైన లతలా అల్లుకుపోతుంది. అంతటి ఉన్నతమైన స్నేహానికున్న ప్రాధాన్యాన్ని తెలియజెప్పేందుకు ఏర్పాటు చేసుకున్న రోజే ‘స్నేహితుల రోజు... నేడు ‘ఫ్రెండ్‌షిప్‌ డే’ సందర్భంగా ప్రత్యేక కథనం.

ప్రతి ఏటా ఆగస్టు నెల మొదటి ఆదివారం జరుపుకునే ‘స్నేహితుల దినోత్సవం’ పుట్టింది అమెరికాలో. స్నేహం పుట్టుక మాత్రం మనిషి పుట్టుకంత ప్రాచీనమైనది. కుల, మత, ప్రాంత, లింగ భేదాలు లేని స్నేహాన్ని ఒక ఉత్సవంగా జరుపుకోవడంలో స్వదేశీ, విదేశీ భేదం లేకుండా ప్రపంచమంతా ఒక్కటయిందంటే, జీవితంలో ప్రతి ఒకరికీ స్నేహం ఎంత అపురూపమయినదో అర్థమవుతుంది.

ఎప్పుడు, ఎక్కడ, ఎలా?
పెద్ద ఎత్తున స్నేహితులకోసం ఒక రోజు కేటాయించి పండుగ గా జరుపుకోవడమనేది అమెరికాలో 1935 లో ప్రారంభమై, కాలక్రమేణా అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొంది ‘ఇంటర్నేషనల్‌ ఫ్రెండ్‌ షిప్‌ డే’ గా రూపాంతరం జరిగింది. వివిధ దేశాల్లో వేర్వేరు తేదీల్లో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నా, 2011లో ఐక్య రాజ్య సమితి సా«ర్వత్రిక సభ జూలై 30వ తేదీని అంతర్జాతీయ మైత్రీ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. అయినా మనదేశం సహా మరికొన్ని దేశాలూ మాత్రం ఆగస్టు నెలలోని మొదటి ఆదివారాన్ని ‘ఫ్రెండ్షిప్‌ డే’ గా జరుపుకుంటున్నాయి. ఈ ఫ్రెండ్షిప్‌ డే ఇటీవలి కాలంలో ముందెన్నడూ లేనంత ప్రాముఖ్యతని సంతరించుకోవడం వెనక, సామాజిక మాధ్యమాలు విరివిగా ఉపయోగంలోకి రావడం, కానీ ఖర్చులేకుండా ఒకే స్నేహ సందేశాన్ని వందల మంది నేస్తాలకి ఏక కాలంలో సులువుగా పంపగలిగే సదుపాయం దొరకడం కారణాలుగా చెప్పుకోవచ్చు.

మన ముందు నడుస్తూ ఎవరైనా మార్గ నిర్దేశనం చేస్తానంటే మనకు నచ్చవచ్చు, నచ్చక పోవచ్చు. మన వెనుక నడిచేవాడికి ఎప్పుడూ దారి చూపిస్తూ పోవాలంటే మనకి వీలు కాకపోవచ్చు. మనతో నడిచే వ్యక్తినే మనం మిత్రుడిగా భావించి మంచీ చెడూ పంచుకోగలుగుతాం. అలా మన కష్ట సుఖాల్లో చేదోడు వాదోడుగా ఉన్నవారినే మనం స్నేహితులుగా ఎంచి అభిమానిస్తాం, గౌరవిస్తాం. సాటివాడి కష్టానికి సానుభూతి అందించడం ఎవరైనా చేస్తారు గాని గొప్ప హృదయం ఉన్న మిత్రుడు మాత్రమే స్నేహితుని విజయాన్ని మనసారా అభినందించగలుగుతాడు. నిజమైన స్నేహం జీవితంలోని మంచిని ద్విగుణీకృతం చేస్తుంది. 

పాటల్లో స్నేహానికి బాటలు
‘నీవుంటే వేరే కనులెందుకు నీకంటే వేరే బతుకెందుకు, నీ బాట లోని అడుగులు నావి, నాపాట లోని మాటలు నీవి’ అంటూ స్నేహ బంధపు సౌందర్యాన్ని పాటలో పొదిగారు సినారె. అలాగే స్నేహ మాధుర్యాన్ని చవి చూసి ఆ బంధం కోసం, తను బతుకు తెరువు కోసం ఎన్నుకున్న మార్గాన్నే వదిలి మంచివాడైన ప్రతినాయకుడు ‘స్నేహమే నాకున్నది, స్నేహమేరా పెన్నిధి’ అంటూ తన మిత్రుడి కోసం ప్రాణాన్నే అర్పించడానికి సిద్ధపడతాడు. అలాగే ‘మంచి మిత్రులు’గా విడిపోయి చాలా కాలం తర్వాత కలుసుకోబోతున్న ఇద్దరు స్నేహితులు తమ తమ అనుభవాలను, తాము నేర్చుకున్న జీవిత పాఠాలను ఒకరితో ఒకరు చెప్పుకోవాలని వేగిరపడుతూ ‘ఇంకా తెలవారదేమి? ఈ చీకటి విడిపోదేమి?’ అంటూ పాడిన పాట, ఆ సినిమా విడుదలై అర్ధ శతాబ్దమైనా ఇంకా సినీ గీతాభిమానుల పెదవులపై నర్తిస్తూనే ఉంది. 

నాలుగు దశాబ్దాల క్రితం ‘ఛోడేంగే దమ్‌ అగర్, తేరా సాథ్‌ నా ఛోడేంగే’ అంటూ ఇద్దరు మిత్రులు చేసిన విన్యాసాలను అభిమానులు మళ్ళీ మళ్ళీ చూసి మెచ్చుకున్నారంటే ఆ పాటలో ధ్వనించిన స్నేహమాధుర్యమే కారణం. ప్రపంచ ప్రసిద్ధ కథలైన పంచతంత్రంలోని మిత్రలాభం, మిత్రభేదం అనే రెండు భాగాల్లోనూ సన్మిత్రులంటే ఎవరు, స్నేహపు గొప్పదనమేమిటి , మైత్రి ఎలాంటి వారితో చెయ్యాలి, ఆత్మీయ స్నేహితుల మధ్య చిచ్చు పెట్టేవాళ్లని ఎలా గుర్తించాలి మొదలైన ఎన్నో తెలుసుకోవలసిన విషయాలని సరళంగా అర్ధమయ్యే రీతిలో పిల్లల కథలుగా మలచి వివరించాడు విష్ణుశర్మ. 

పౌరాణిక స్నేహాలు
స్నేహం పురాణ కాలం నుంచే ఉంది. దశరథుడు– జటాయువు; రాముడు– సుగ్రీవుడు; రాముడు– గుహుడు; కృష్ణుడు– అర్జునుడు; కృష్ణుడు–కుచేలుడు, దుర్యోధనుడు–కర్ణుడు అద్భుతమైన, అజరామరమైన స్నేహానికి నిదర్శనంగా నిలిచారు. అగ్నిసాక్షిగా శ్రీరామ సుగ్రీవుల మధ్య హనుమ కుదిరించిన స్నేహ బంధమే అందుకు ఉదాహరణ. శ్రీరాముడు క్షత్రియుడు. అయోధ్యానగర రాజైన దశరథ మహారాజుకు తనయుడు. భావి చక్రవర్తి. సుగ్రీవుడు వానర రాజు. అయితేనేం, వారి స్నేహానికి జాతులు కానీ, కులాలు కానీ అడ్డు రాలేదు. ఇద్దరూ కష్టకాలంలోనే స్నేహితులయ్యారు. ఇద్దరూ రాజ్యాన్ని విడిచి, అడవులలో ఉంటున్నారు. పితృవాక్య పరిపాలనకై వచ్చిన రామునికి వనవాసం కష్టంగా అనిపిం^è కపోవచ్చు కానీ సీతావియోగం కష్టమే కదా! ఇక సుగ్రీవుడు రాజ్యాన్నీ, భార్యనీ వదలి కొండమీద తలదాచుకున్నాడు. ఆ ఇద్దరూ స్నేహితులై, ఒకరికొకరు సహాయం చేసుకుని ఇద్దరి కష్టాలనూ తొలగించుకున్నారు. ‘‘అనేక సద్గుణాలు, విశేషమైన ప్రేమ కలిగిన నువ్వు స్నేహితుడుగా లభించడం నా అదృష్టం. ఇలాంటి వ్యక్తి స్నేహితుడుగా ఉంటే ప్రపంచంలో దేన్నైనా సాధించవచ్చు. నీతో స్నేహం కలవడం అనేది నాకు దైవమిచ్చిన వరం అనుకుంటాను’’ అంటాడు సుగ్రీవుడు శ్రీరామచంద్రునితో. 

శ్రీకృష్ణుడు, కుచేలుడు గురుకులంలో స్నేహితులు. చదువులు పూర్తయ్యాక ఇద్దరూ తమ తమ నెలవులకు వెళ్లారు. కుచేలుడు గృహస్థాశ్రమంలో దారిద్య్రాన్నను భవిస్తూ, భార్య సలహాపై తన చిన్ననాటి స్నేహితుడైన శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్లాడు. బాల్య మిత్రునికి ఇవ్వడం కోసం కాసిని అటుకులు మూట కట్టుకుని వెళ్లాడు. శ్రీకృష్ణుడు తన చిన్ననాటి మిత్రుని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి, కుశలమడుగుతూనే స్నేహితుడు తన చిరిగిన ఉత్తరీయంలో మూటకట్టుకుని తెచ్చిన అటుకులలో గుప్పెడు  తీసుకుని ఎంతో ఆప్యాయంగా తిన్నాడు. చిన్ననాటి విషయాలు ముచ్చటించుకున్నారు. మిత్రునికి షడ్రసోపేతమైన భోజనంతో విందు చేశాడు. కుచేలుడు ఆ విందును ఆరగించి, పట్టుపరుపుల మీద నిద్రపోయాడు. కృష్ణునికి తన దారిద్య్రాన్ని గురించి చెప్పి, సహాయ మడుగుదామనుకున్నా, ఆ విషయం ప్రస్తావించకుండానే ఇంటిదారి పట్టాడు కుచేలుడు. కానీ కుచేలుడు అడగకపోయినా అషై్టశ్వర్యాలనూ అనుగ్రహించాడు శ్రీకృష్ణుడు. ఇక్కడ ఒక స్నేహితుడు కష్టంలో ఉన్న తన స్నేహితుని ఇబ్బందులను అతడు అడగకుండానే తొలగించాడు. అదీ అసలైన మైత్రి. నన్ను ఒక్క మాట అడిగి ఉంటే బాగుండేది కదా అనలేదు. పెదవి విప్పి చెప్పనక్కర లేకుండానే అతని కష్టాలన్నింటినీ తీర్చాడు. 

అదేవిధంగా దుర్యోధన, కర్ణుల మైత్రి కూడా గాఢమైనది. మిత్రుడైన కర్ణుడి కోసం దుర్యోధనుడు ఎవరు ఎన్ని రకాలుగా హెచ్చరించినా పెడచెవిన పెట్టి మరీ అతడికి అంగరాజ్యాన్నిస్తే, దుర్యోధనుడి కోసం కర్ణుడు తన ప్రాణాలనే పణంగా పెట్టి పాండవులతో యుద్ధం చేశాడు. చివరికి పాండవులు తన తోడబుట్టిన వారేనని తెలిసినా, సోదర బంధం కన్నా స్నేహ బంధాన్నే మిన్నగా భావించి, తన ప్రాణాలను త్యాగం చేశాడు. భర్తృహరి మంచి మిత్రుని లక్షణాలను ఇలా చెబుతాడు –ఎవరైనా చెడు పనులు చేస్తూంటే మంచి మిత్రుడు నివారించాలి. అలాగే మంచిపనులు చేయటంలో ప్రోత్సహించాలి. మిత్రునికి సంబంధించిన రహస్యాలను çతనలోనే దాచుకోవాలి. మిత్రునిలోని మంచి లక్షణాలను నలుగురిలో తెలియజేయాలి. మిత్రునికి ఆపద కలిగినప్పుడు మొహం చాటేయకుండా, చేతనైన సహాయం చేయాలి. అవసర సమయాలలో తగిన రీతిలో ఆదుకోవాలి.

నాటి మేటి స్నేహితులు
స్నేహితులతో కలసి ఉంటే కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. అయితే ఆ స్నేహం, స్వచ్ఛంగా  ఉండాలి. అలాంటి స్నేహంలోనే ఆనందం దాగి ఉంటుంది. అలాంటి స్నేహమే కలకాలం నిలిచి ఉంటుంది. అలాంటి కొన్ని అపురూపమైన, అరుదైన స్నేహబంధాల గురించి తెలుసుకుందాం...

అబ్బూరి రామకృష్ణారావు – కోడి రామమూర్తి
సుప్రసిద్ధ సాహితీవేత్త, ఆంధ్ర విశ్వవిద్యాలయం గ్రంథాలయ అధికారి అబ్బూరి రామకృష్ణారావు. మల్లయోధుడిగా దేశాదేశాల్లో ప్రదర్శనలిస్తూ విజయపరంపరలో దూసుకుపోయే కోడి రామమూర్తిపై ఆనాటి పత్రికల్లో తరచు కథనాలు వచ్చేవి. కోడి రామమూర్తి ప్రతిభాపాటవాలకు అబ్బురపడిన అబ్బూరి రామకృష్ణా రావు ‘ఆంధ్ర కంఠీరవ’ అనే పద్యమాలికను రచించారు. ఆ పద్యాలను చదివిన కోడి రామమూర్తి వెదుక్కుంటూ మరీ అబ్బూరివారి ఇంటికి వచ్చారు. అబ్బూరివారి పద్యాలు కోడి రామమూర్తిని ఎంతగా ఆకట్టుకున్నాయంటే, ఆయన ఆ పద్యాలను సిల్కు రుమాళ్లపై అచ్చువేయించి, వాటిని తన ప్రదర్శనలను తిలకించే ప్రేక్షకులకు పంచిపెట్టేంతగా. 

అబ్బూరివారితో మైత్రి ఏర్పడినప్పటి నుంచి కోడి రామమూర్తి తన ప్రదర్శనల్లో అబ్బూరి దంపతుల కోసం ముందువరుసలో ప్రత్యేకంగా రెండు కుర్చీలు వేయించేవారు. ఆయన ప్రదర్శనకు ఒకసారి గవర్నర్‌ సకుటుంబంగా విచ్చేశారు. అబ్బూరి వారికి కేటాయించిన రెండు కుర్చీలను తీసుకుంటామని అన్నారట. ఇది తెలుసుకున్న కోడి రామమూర్తి, ‘కుదరదు. ఆ కుర్చీలు అలా ఉండవలసిందే. లేకుంటే ప్రదర్శనకు అంతరాయం కలుగుతుంది’ అని గవర్నర్‌ కార్యదర్శికి నిక్కచ్చిగా చెప్పేశారట. అబ్బూరివారంటే అంత అభిమానం చూపేవారు కోడి రామమూర్తి. అరుదైన వారి మైత్రి జీవితాంతం కొనసాగింది. 

సి.ఎఫ్‌ ఆండ్రూస్‌– మహాత్మా గాంధీ
మహాత్మా గాంధీ ‘జాతిపిత’గా మనందరికీ తెలుసు. జాతీయోద్యమంలో ఆయనకు బాసటగా నిలిచిన సన్నిహిత జాతీయ నాయకుల గురించి కూడా తెలుసు. మరి ఈ చార్లెస్‌ ఫ్రీర్‌ ఆండ్రూస్‌ ఎవరనుకుంటున్నారా? ఆండ్రూస్‌ ఇంగ్లాండ్‌కు చెందిన క్రైస్తవ మత గురువు. తొలిసారిగా 1914లో దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో ఆయన గాంధీజీని కలుసుకున్నారు. దక్షిణాఫ్రికాలో భారతీయ కార్మికులపై బ్రిటిష్‌ పాలకులు సాగించే దమనకాండకు వ్యతిరేకంగా గాంధీజీ సాగించిన ఉద్యమంలో ఆండ్రూస్‌ కూడా పాల్గొన్నారు. గాంధీజీ అహింసా సిద్ధాంతానికి ప్రభావితుడై, భారతీయుల స్వాతంత్య్రోద్యమానికి మద్దతుగా నిలిచారు. దక్షిణాఫ్రికాతో పాటు భారత్‌లోనూ ఆండ్రూస్‌ మతబోధకుడిగా పనిచేశారు. ఆయనకు గోపాలకృష్ణ గోఖలే, రవీంద్రనాథ్‌ టాగోర్‌ వంటి వారితో కూడా సాన్నిహిత్యం ఏర్పడింది. 

అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌– చార్లీ చాప్లిన్‌
అల్బర్ట్‌ ఐన్‌స్టీన్, చార్లీ చాప్లిన్‌– ఇద్దరివీ ఏమాత్రం పొంతనలేని వేర్వేరు రంగాలు. అయినా ఇద్దరూ చక్కని స్నేహితులయ్యారు. లాస్‌ ఏంజెలెస్‌లోని ఒక థియేటర్‌లో 1931లో చాప్లిన్‌ చిత్రం ‘సిటీ లైట్స్‌’ ప్రీమియర్‌ షో ఏర్పాటు చేసినప్పుడు దానిని తిలకించేందుకు ఐన్‌స్టీన్‌ కూడా వచ్చారు. అప్పుడే ఆయన చాప్లిన్‌ను తొలిసారి కలుసుకున్నారు. ‘నీ కళలోని విశ్వజనీనతను నేను ప్రశంసించకుండా ఉండలేను. నువ్వొక్క మాట మాట్లాడకపోయినా ప్రపంచం నిన్ను ఇట్టే అర్థం చేసుకుంటుంది’ అంటూ ఐన్‌స్టీన్‌ పొగడ్తలు కురిపించే సరికి చాప్లిన్‌ తబ్బిబ్బయ్యాడు. కొద్దిక్షణాల్లోనే తేరుకుని, ‘మీ ఖ్యాతి మరింత గొప్పది. మీరు చెప్పిన సిద్ధాంతాల్లో ఒక్క మాటైనా అర్థం కాకపోయినా యావత్‌ ప్రపంచమే మిమ్మల్ని కీర్తిస్తోంది’ అని బదులివ్వడంతో చాప్లిన్‌ చమత్కారానికి ఐన్‌స్టీన్‌ మనసారా నవ్వేశారు. అప్పటి నుంచి ఇద్దరూ మంచి మిత్రులుగా మారారు. హాలీవుడ్‌లో ఐన్‌స్టీన్‌ కోరుకుని మరీ కలుసుకున్నది చాప్లిన్‌ ఒక్కరినే. అప్పటికింకా జర్మనీ పౌరుడిగానే ఉన్న ఐన్‌స్టీన్‌ కేవలం చాప్లిన్‌ను కలుసుకోవడానికి అమెరికాలోని యూనివర్సల్‌ స్టూడియోకి రావడం ఒక అరుదైన సంఘటన.

బాలగంగాధర్‌ తిలక్‌– మహమ్మదాలీ జిన్నా
భారత స్వాతంత్య్ర పోరాటకాలంలో బాలగంగాధర్‌ తిలక్, మహమ్మదాలీ జిన్నా భిన్నధ్రువాల వంటి నాయకులు. గాంధీజీకి ముందు జాతీయ కాంగ్రెస్‌ను ముందుకు నడిపిన నాయకుడు తిలక్‌. అదేకాలంలో ముస్లింలీగ్‌కు అధినాయకుడు మహమ్మదాలీ జిన్నా. స్వాతంత్య్ర సాధనే ఉమ్మడి లక్ష్యంగా 1916లో కాంగ్రెస్‌–ముస్లింలీగ్‌ల నడుమ కుదిరిన ఒడంబడికలో తిలక్, జిన్నాలే కీలక పాత్ర పోషించారు. ఆనాటి నుంచి వారి మధ్య గాఢమైన మైత్రి ఏర్పడింది. తిలక్‌పై బ్రిటిష్‌ ప్రభుత్వం 1916లో దేశద్రోహం కేసు మోపినప్పుడు జిన్నా ఆయన తరఫున కోర్టులో వాదించడం వారి స్నేహానికి ఒక చారిత్రక నిదర్శనం. జిన్నా ఎంత వాదించినా, తిలక్‌కు ఆ కేసులో ఏడాదిన్నర జైలుశిక్ష విధిస్తూ బాంబే హైకోర్టులోని బ్రిటిష్‌ జడ్జి తీర్పునిచ్చారు. సింగిల్‌జడ్జి తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఫుల్‌బెంచ్‌ నిరాకరించింది. తిలక్‌కు వ్యతిరేకంగా తీర్పునిచ్చిన జడ్జికి బార్‌ అసోసియేషన్‌ విందు ఏర్పాటు చేసింది. దీనికి బార్‌ అసోసియేషన్‌ సిగ్గుతో తలదించుకోవాలంటూ జిన్నా తీవ్రంగా ఖండించారు. తిలక్‌ పట్ల ఆయన స్నేహం అలా ఉండేది.  

మార్క్‌ట్వైన్‌– హెలెన్‌ కెల్లర్‌
మార్క్‌ ట్వైన్‌ జగమెరిగిన ఇంగ్లిష్‌ రచయిత. హెలెన్‌ కెల్లర్‌ చిన్నతనంలోనే వ్యాధికి లోనై చూపును, వినికిడిని కోల్పోయినా, మొక్కవోని దీక్షతో వికలాంగుల హక్కుల కార్యకర్తగా ఉద్యమించిన ధీర. మార్క్‌ ట్వైన్‌కు, హెలెన్‌ కెల్లర్‌కు నడుమ తరాల అంతరం ఉన్నా, వారి మధ్య గాఢమైన స్నేహం కొనసాగింది. హెలెన్‌ కెల్లర్‌ పద్నాలుగేళ్ల బాలికగా ఉన్నప్పుడు మార్క్‌ ట్వైన్‌ను ఒక పార్టీలో తొలిసారి కలుసుకుంది. మార్క్‌ ట్వైన్‌ అప్పటికే యాభయ్యేళ్ల పైబడ్డవాడు. తొలి పరిచయంతోనే ఇద్దరికీ గాఢమైన స్నేహం ఏర్పడింది. ఇద్దరూ తరచు ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగించుకునేవారు. ‘ఆ రోజు నుంచి అతని మరణించే రోజు వరకు మా స్నేహం కొనసాగింది’ అని హెలెన్‌ కెల్లర్‌ ఒక సందర్భంలో రాసుకుంది. ఆమె తన ఇరవైరెండో ఏట రాసిన ఆత్మకథను చదివిన మార్క్‌ ట్వైన్‌ ఆమె రచనా నైపుణ్యాన్ని ఎంతగానో ప్రశంసిస్తూ సుదీర్ఘమైన లేఖ రాశాడు. ఇద్దరూ కలుసుకున్నప్పుడల్లా విప్లవాత్మక రాజకీయాల గురించి, సామాజిక సంస్కరణల ఆవశ్యకత గురించి చర్చించుకునేవారు. మార్క్‌ ట్వైన్‌ ఇచ్చిన నైతిక మద్దతుతో హెలెన్‌ కెల్లర్‌ హక్కుల కార్యకర్తగానే కాకుండా, రచయిత్రిగా కూడా రాణించగలిగింది.

టీఎస్‌ ఇలియట్‌–గ్రూషో మార్క్స్‌
ప్రపంచ ప్రఖ్యాత ఇంగ్లిష్‌ కవి, రచయిత టీఎస్‌ ఇలియట్‌ పేరు ప్రఖ్యాతుల ముందు హాస్యనటుడు గ్రూషో మార్క్స్‌ దాదాపు అనామకుడు. అలాంటి గ్రూషోకు 1961లో ఒకరోజు ఫ్యాన్‌మెయిల్‌లో వచ్చిన ఉత్తరం అతణ్ణి సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. ఆ ఉత్తరం రాసినది టీఎస్‌ ఇలియట్‌. ‘నేను మీ అభిమానిని. మీ ఆటోగ్రాఫ్‌ చేసిన ఫొటోను పంపగలరు’ అని ఆ ఉత్తరంలో రాశాడు. గ్రూషో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఇలియట్‌ కోరినట్లే తన ఫొటో పంపుతూ ఆయన కవిత్వాన్ని తాను ఎంతగా ఇష్టపడేదీ వివరిస్తూ ఉత్తరం రాశాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం మరింత బలపడింది. ఇలియట్‌ 1966లో మరణించేంత వరకు వారి మధ్య ఆ మైత్రీబంధం కొనసాగింది.

కోట్లలో స్నేహం
నా వెనక నడవకు, నేను నీకు తోవ చూపించలేకపోవచ్చు.నా ముందు నడవకు, నేను నిన్ను అనుసరించకపోవచ్చు. నా జతగా నడువు, నా స్నేహితుడిగా ఉండిపో... 
– ఆల్బర్ట్‌  కాము, రచయిత, తత్త్వవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత. 
నేను నా శత్రువులందరినీ నాశనం చేసినట్టే కదా, వాళ్ళని గనక నా స్నేహితులుగా మార్చుకోగలిగితే.
– అబ్రహాం లింకన్‌ 
► ఇద్దరిమధ్య మౌనం కూడా హాయిగా ఉన్నపుడే వారి మధ్య స్నేహం ఉన్నట్టు.
– డేవిడ్‌ టైసన్‌ జెంట్రీ, గీత రచయిత 
సంపదలతో తులతూగుతున్నపుడు మన గురించి మన స్నేహితులకి తెలుస్తుంది. మనం ఆపదల్లో ఉన్నపుడు మన స్నేహితుల గురించి మనకి తెలుస్తుంది!’
– జాన్‌ కొల్లిన్స్, ఆంగ్ల విమర్శకుడు
► మిత్రుల పట్ల నీకు గల అభిప్రాయాలను వారి మరణానంతరం ఇచ్చే ఉపన్యాసాల కోసమో, వారి సమాధి మీద లిఖించడం కోసమో అట్టి పెట్టుకోకు, 
ఆ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచడం నేర్చుకో.
– ఏనా కమ్మిన్స్‌
► నేను మారినపుడు మారిపోతూ, నేను తలూపినపుడు తానూ తలూపుతూ ఉండే స్నేహితుడు నాకక్కరలేదు. నా నీడ ఆ పని ఇంకా మెరుగ్గా చేస్తుంది.
– ప్లుటార్క్, గ్రీకు చరిత్రకారుడు

‘నెవర్‌ ఎక్స్‌ప్లెయిన్‌ యువర్‌ సెల్ఫ్, యువర్‌ ఫ్రెండ్స్‌ డు నాట్‌ నీడిట్‌. యువర్‌ ఎనిమీస్‌ డోంట్‌ బిలీవిట్‌’ ఆనే ఆంగ్ల సూక్తి స్నేహ బాంధవ్యం ఎంతటిదో వివరిస్తుంది. మన గురించి నిక్కచ్చిగా మన ముందు చెప్పగల వ్యక్తిని మనమెప్పుడూ కోల్పోకూడని మిత్రుడని తెలుసుకోగలిగితే స్నేహితుల్ని సంపాదించుకోవడం, నిలబెట్టుకోవడం తెలిసినట్టే!


 

మరిన్ని వార్తలు