ఉద్యోగం వదిలి.. ‘ప్రకృతి’లోకి కదిలి

14 Dec, 2020 08:55 IST|Sakshi
ద్రవ జీవామృతం తయారు చేస్తున్న రైతుæ విజయ్‌కుమార్‌

గారపాటి విజయ్‌కుమార్‌ మూడేళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి ఆయన స్వగ్రామం. గడచిన రెండేళ్లూ హైబ్రిడ్‌ విత్తనాలను సాగు చేశారు. ఈ ఖరీఫ్‌లో పోషకాలతో పాటు ఔషధ విలువలు గల సాంప్రదాయ వరి రకాల సాగు వైపు దృష్టి సారించారు. తొమ్మిది రకాల దేశవాళీ విత్తనాలను సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం మూడు నెలల వయస్సు ఉన్న వరి పైరు సుమారు ఆరు అడుగులు ఎత్తు పెరగడంతో తోటి రైతులు అబ్బురపడుతున్నారు. 

విజయ్‌కుమార్‌ తండ్రి గారపాటి శ్రీనివాస్‌రావు స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగి. ఆరు నెలల వయస్సులోనే తల్లి మృతి చెందడంతో విజయ్‌కుమార్‌ అమ్మమ్మ ఇంటి వద్దే పెరిగారు. సివిల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లమో చేసిన అనంతరం వైజాగ్‌లో ఓ కన్‌స్ట్రక్షన్‌ సంస్థలో ఉద్యోగం వచ్చింది. ఎనిమిదేళ్ల పాటు ఉద్యోగం చేశారు. 27 సంవత్సరాల వయసులో సహచరæ ఉద్యోగి గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. ఈ ఘటన విజయ్‌కుమార్‌ను తీవ్రంగా బాధించింది. అనారోగ్యానికి గల కారణాలను అన్వేషించి రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవశేషాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్లనే అన్న అభిప్రాయానికి వచ్చారు. అంతే.. ఉద్యోగాన్ని విడిచి పెట్టి అమ్మమ్మ గారి ఊరు చేరుకున్నాడు. ఇది నాలుగేళ్ల నాటి ముచ్చట. 

దేశీ వంగడాలపై దృష్టి
హైబ్రిడ్‌ విత్తనంతో కూడా విటమిన్‌ లోపాలు వచ్చి అనారోగ్య సమస్యలు వస్తాయని తెలుసుకున్న విజయ్‌కుమార్‌ ఈ ఏడాది ప్రారంభంలో హైదరాబాద్‌లోని దేశవాళీ వరి విత్తనాలను వృద్ధి చేస్తున్న సేవ్‌ సంస్థ వ్యవస్థాపకులు విజయ్‌రామ్‌ను కలుసుకున్నారు. సుమారు 50 ఎకరాల్లో దేశవాళీ విత్తనం అభివృద్ధి చేయడాన్ని ప్రత్యక్షంగా చూసి, వాటిలో ఔషధ గుణాలు, ఉపయోగాలను తెలుసుకున్నారు. ఆయన సూచనల మేరకు సుమారు తొమ్మిది రకాల దేశవాళీ విత్తనాలను తీసుకువచ్చి ఈ ఖరీఫ్‌లో మూడు ఎకరాల్లో తొమ్మిది మడుల్లో సాగు చేపట్టారు.

నవార, కాలాబట్టీ, సుగంధ సాంబ, రధాతిలక్, రక్తసాలి, తులసీబసొ, నారాయణ కామిని, బహురూపి, రత్నచోడి రకాలను ప్రస్తుతం సాగు చేస్తున్నారు.   రాధా తిలక్‌ రకం పంట సుమారు ఆరున్నర అడుగుల ఎత్తు పెరిగింది. వెన్ను సుమారు రెండు అడుగుల పొడవు ఉంది. మిగిలిన 8 దేశవాళీ వరి రకాలను సాగు చేస్తున్న మడుల్లో పైరు ఐదున్నర అడుగులు ఎత్తు పెరిగింది. మూడు రకాలను వెదజల్లే పద్ధతిలో, మిగిలిన ఆరు రకాలను ఊడ్పు పద్ధతిలో సాగు చేస్తున్నట్టు విజయ్‌కుమార్‌ తెలిపారు. ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన దేశవాళీ రకాలు క్వింటాల్‌ రూ. 3,500 నుంచి రూ.7,500 ధర పలుకుతోందని తెలిపారు. 
– లక్కింశెట్టి శ్రీనివాసరావు, 
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం 

ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తే లక్ష్యం 
ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆహార ఉత్పత్తులను తింటే క్యాన్సర్, గుండె జబ్బులు, బీపి, షుగర్‌ వంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. అందుకే ఆరోగ్యదాయకమైన తొమ్మిది రకాల దేశవాళీ వరి రకాలను సాగు చేస్తున్నాను. వీటిని సాగు చేయడం వలన రైతులకు కూడా మంచి లాభం వస్తుంది. సాగు చేసిన పంటను నేరుగా వినియోగదారులకే విక్రయిస్తున్నా. రబీలో నీటి ఎద్దడి సమస్య ఉండటంతో కొర్రలు, సామలు, అండుకొర్రలు సాగు చేయాలని నిర్ణయించుకున్నాను. వచ్చే ఖరీఫ్‌లో సుమారు పదెకరాల్లో దేశవాళీ వరి రకాలను సాగు చేద్దామనుకుంటున్నాను. ఈ విధానంలో మిత్రపురుగులు వృద్ధి చెందుతాయి. శత్రు పురుగులు అదుపులో ఉంటాయి. ఏటేటా భూసారం పెరుగుతుంది. పంచభూతాలకు,  పశుపక్ష్యాదులకు మొత్తంగా మానవాళికి మంచి జరుగుతుంది. ఈ సాగు ద్వారా విత్తనాన్ని సొంతంగా తయారు చేసుకొని రైతులకు అందిస్తున్నాను. ప్రకృతి సాగులో ఎకరాకు కేవలం నాలుగు కేజీల విత్తనం అవసరం. అదే రసాయనిక సాగులో ఎకరానికి 25 కేజీల విత్తనం పడుతుంది. దీని వల్ల విత్తన ఖర్చు బాగా తగ్గి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది.
– గారపాటి విజయ్‌ కుమార్‌ 
(98665 11419), 
గండేపల్లి, తూ.గో. జిల్లా

 

మరిన్ని వార్తలు