లేత మనసులో బొమ్మల కొలువు

13 Dec, 2020 08:44 IST|Sakshi

ఔదార్యం

పిల్లల లేత మనసులను అర్థం చేసుకోవడం, తగు రీతిగా స్పందించడం కొందరికే సాధ్యమవుతుంది. ఈ యేడాది కరోనాతోపాటు దేశ విదేశాల్లోనూ ఎన్నో ఆందోళనలు కలిగించే అంశాల గురించి విన్నాం. మొన్న ఆగస్టులో లెబనాన్‌లో జరిగిన బీరుట్‌ పేలుడులో 200 మందికి పైగా మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. ఎన్నో కుటుంబాలు నిలువ నీడలేకుండా రోడ్డున పడ్డాయి. ప్రాణనష్టం, వస్తు నష్టం జరిగింది. ఆ పేలుడుకు ప్రభావితమైనవారిలో పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. వారికి ఎంతో ఇష్టమైన బొమ్మలు పేలుడులో కాలిపోవడం, మసిబారడం.. వంటివి జరిగిపోయాయి. లెబనీస్‌ కళాకారిణి, బామ్మ ఆ పిల్లల స్థితికి తల్లడిల్లిపోయింది.

ఆ చిన్నారి మనసులకు ఉపశమనం ఇవ్వాలనే ఆలోచనతో బొమ్మలు తయారు చేయడం మొదలుపెట్టింది. సొంతంగా తన చేతులతో రంగు రంగుల బొమ్మలను తయారు చేసింది. ఒక్కో బొమ్మకు ఒక్కో అమ్మాయి పేరు పెట్టింది. అలా ఇప్పటి వరకు తాను రూపొందించిన 100 బొమ్మలను అమ్మాయిలకు అందించింది. రోజూ ఉదయాన్నే నిద్రలేచింది మొదలు పడుకునేవరకు శ్రద్ధగా బొమ్మలను తయారు చేస్తూ కూర్చుంటుంది. బొమ్మలను తయారుచేసిన బామ్మ ఫొటో సోషల్‌ మీడియాలో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది. బామ్మ చేస్తున్న పనికి ఎంతోమంది ప్రశంసలు తెలియజేస్తున్నారు.

మరిన్ని వార్తలు