Guru Purnima: ఆదియోగి తనను ఆదిగురువుగా మార్చుకున్నారు

24 Jul, 2021 06:28 IST|Sakshi

గురువు అనే పార్శ్వాన్ని గ్రహించగలిగే అవకాశమున్న ప్రత్యేకమైన రోజు గురుపూర్ణిమ. గురువు అంటే ఒక వ్యక్తికాదు, గురువు అంటే ఒక ప్రత్యేకమైన స్ధానం, స్థితి, ఒక ప్రత్యేకమైన శక్తి. నిండు పున్నమి రోజు ఉండే స్పందన, ప్రకంపనాలు, ఆ రోజు ఉండే అనుభూతి, మిగతా రోజులలో కన్నా చాలా వేరుగా ఉంటుంది. ఆధ్యాత్మిక పధంలో ఉండేవారికి ఈ రోజు ప్రకృతి నుండి లభించిన ఒక వరం లాంటిది. సుమారు అరవై, డెబ్భై ఏళ్ళ క్రితం వరకూ కూడా, మన దేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో గురు పూర్ణిమ ఒకటి. 

యోగ సాంప్రదాయంలో శివుడిని దేవుడిగా చూడం. ఆయనను ఆదియోగి లేదా మొదటి యోగిగా చూస్తాం. మొట్ట మొదటి గురువు జన్మించిన రోజుని గురుపూర్ణిమ అంటాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం, శివుడు సిద్ధి పొంది, హిమాలయాల్లో పారవశ్య నృత్యం చేశారు. అనంతరం నిశ్చలుడయ్యాడు. తాము అర్ధం చేసుకోలేని గాఢ అనుభూతినేదో ఆయన పొందుతున్నారని ఆయన్ని  చూసినవారు అనుకున్నారు. తమతో సంభాషిస్తాడేమో అని శివుడి కోసం జనాలు ఎదురు చూడడం మోదలుపెట్టారు. కాని  అక్కడ జనాలు ఉన్నారన్న  స్పృహ శివుడికి లేదు. దీంతో కొంతకాలం ఎదురు చూసి అంతా వెళ్లిపోయారు. కేవలం ఏడుగురు మాత్రం అలాగే వేచి ఉన్నారు. ఈ ఏడుగురు ఆయన వద్ద నేర్చుకోవాలని ఎంతో పట్టుదలతో అక్కడే ఉన్నారు. 

చివరకు  “మీకు తెలిసింది మేము తెలుసుకోవాలనుకుంటున్నాం” అని వారు ఆయనను బతిమిలాడారు. శివుడు వారిని పట్టించుకోలేదు, “ అజ్ఞానులారా! మీరున్న స్ధితిలో కోట్ల సంవత్సరాలైనా మీకేమీ తెలియదు. ముందు మీరు అందుకు కావాలిసిన యోగ్యత పొందాలి. ఇందుకోసం ఎంతో సాధన చేయవలిసి ఉంటుంది. ఇది వినోదం కాదు” అంటూ తోసిపుచ్చాడు. శివుడి సూచనలకు తగ్గట్టు వారు యోగ్యత పొందేందుకు సిద్ధమయ్యారు. దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాల తరబడి సంసిద్ధమవుతూనే ఉన్నారు. 84 ఏళ్ల సాధన తరువాత, ఒక పున్నమి రోజున, సూర్యుడు ఉత్తర దిశ నుండి దక్షిణ దిశలోకి మారుతున్నప్పుడు, మన సంప్రదాయంలో దక్షిణాయనం ఆరంభమవుతుందనే కాలంలో ఆదియోగి ఈ ఏడుగురిని చూశారు.

84 ఏళ్లుగా సాధన చేస్తున్న వారిని శివుడు పట్టించుకోకుండా ఉండలేకపోయారు.  28 రోజుల పాటు  వారిని నిశితంగా గమనించారు. మళ్ళీ పూర్ణ చంద్రోదయమైన రోజున, ఆయన గురువుగా మారాలని నిర్ణయించుకున్నారు. ఆదియోగి తనను తాను ఆదిగురువుగా మార్చుకున్నారు. దక్షిణ దిశవైపుకి తిరిగి, యోగ శాస్త్రం వారికి చెప్పడం ప్రారంభించారు. ఆయన దక్షిణ దిశవైపుకి తిరిగి, ఆది గురువుగా కూర్చున్నారు కాబట్టి, మనం ఆయనని దక్షిణామూర్తి అంటాం. ఆ రోజున మొదటి గురువు జన్మించారు. అందుకని ఆ రోజుని గురుపూర్ణిమ అంటారు. మన మనసులో తెలుసుకోవాలి అనే ఒక గాఢమైన కోరిక ఏర్పడ్డప్పుడు .... మనకు గురువు లభిస్తారు.  ఉత్తమమైన గురువు కోసం వెతుక్కుంటూ వెళ్లక్కర్లేదు. మనలో తీవ్రమైన తపన ఉంటే  గురువు తనంతట తానుగా సంభవిస్తాడు,

మరిన్ని వార్తలు