Gynecologist Suggestions: ఇంకా రజస్వల కాలేదు... ఎలాంటి చికిత్స తీసుకోవాలి?

5 Dec, 2021 19:08 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఇంకా కాలేదు

Gynecologist Venati Sobha Counselling Suggestions Irregular Periods: మా అమ్మాయి వయసు 17 సంవత్సరాలు. ఇంకా రజస్వల కాలేదు. పరీక్షలు జరిపిన డాక్టర్లు ‘టర్నర్‌ సిండ్రోమ్‌’ అని చెబుతున్నారు. దీనికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో దయచేసి వివరించగలరు.
– సుగుణ, మధిర

ఆడపిల్లల్లో 23 జతల క్రోమోజోమ్స్‌ ఉంటాయి. అంటే 46 క్రోమోజోమ్స్‌. వీటిలో 22 జతల ఆటోసోమ్స్, ఒక జత ‘ఎక్స్‌ఎక్స్‌’ క్రోమోజోమ్స్‌ ఉంటాయి. దానిని 46 ఎక్స్‌ఎక్స్‌గా పరిగణించడం జరుగుతుంది. ఈ ‘ఎక్స్‌ఎక్స్‌’ క్రోమోజోమ్స్‌ జతలో ఒక ‘ఎక్స్‌’ తల్లి నుంచి, ఒక ‘ఎక్స్‌’ తండ్రి నుంచి పిండం ఏర్పడినప్పుడే బిడ్డకు సంక్రమించి, ఆడపిల్లగా పుట్టడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యల వల్ల ఒక ‘ఎక్స్‌’ క్రోమోజోమ్‌ మాత్రమే బిడ్డకు సంక్రమిస్తుంది. దీనినే ‘45ఎక్స్‌జీరో’ అంటారు.

దీనినే ‘టర్నర్స్‌ సిండ్రోమ్‌’ అంటారు. ఇలా పుట్టిన పిల్లలు పొట్టిగా ఉండటం, వారిలో మానసిక ఎదుగుదల కొద్దిగా తక్కువగా ఉండటం, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, రజస్వల కాకపోవడం, రొమ్ములు సరిగా పెరగకపోవడం, అండాశయాలు చాలా చిన్నగా ఉండి, అవి పనిచేయకపోవడం వల్ల పీరియడ్స్‌ రాకపోవడం, ఎముకల సమస్యలు వంటి ఇతర సమస్యలు ఉంటాయి.

కొందరిలో అండాశయాలు కొన్నిరోజులు హార్మోన్లు విడుదల చేసి, తర్వాత అవి చిన్నగా అయిపోయి అండాలు తగ్గిపోవడం వల్ల కొంతకాలం పీరియడ్స్‌ వచ్చి తొందరగా ఆగిపోతాయి. ఇది జన్యుపరంగా ఏర్పడింది కాబట్టి, మీరు చెయ్యగలిగింది ఏమీ లేదు. మీరు ఎండోక్రైనాలజిస్టును సంప్రదిస్తే, అవసరమైన పరీక్షలు చేయించి, స్కానింగ్‌లో గర్భాశయం, అండాశయాల పరిమాణం బట్టి, పీరియడ్స్‌ కోసం ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్లు కొంతకాలం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇతర సమస్యలను బట్టి చికిత్స సూచించడం జరుగుతుంది.

నా వయసు 23 ఏళ్లు. ఎత్తు 5.4, బరువు 48 కిలోలు. రెండేళ్లుగా నాకు పీరియడ్స్‌ సక్రమంగా రావడం లేదు. ఒక్కోసారి పదిహేను రోజులకే అయిపోతే, ఒక్కోసారి నెల్లాళ్లు గడిచాక అవుతోంది. పీరియడ్స్‌ సమయంలో పొత్తికడుపు నొప్పితో పాటు విపరీతమైన తలనొప్పి ఉంటోంది. ఆ సమయంలో ఏ పనీ చేయలేకపోతున్నాను. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు.
– రమ్య, తగరపువలస

మీ ఎత్తుకి మీరు కనీసం 54 కిలోల బరువు ఉండాలి. కాని, 48 కిలోలే ఉన్నారు. కొందరిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల, థైరాయిడ్, పీసీఓడీ వంటి అనేక సమస్యల వల్ల పీరియడ్స్‌ సక్రమంగా రాకపోవచ్చు. పీరియడ్స్‌ సమయంలో కొందరిలో ప్రోస్టాగ్లాండిన్‌ హార్మోన్లు ఎక్కువగా విడుదలవడం వల్ల పొత్తికడుపులో నొప్పి, తలనొప్పి ఉండే అవకాశాలు ఉంటాయి. కొందరిలో రక్తహీనత వల్ల, మానసిక ఒత్తిడి వల్ల కూడా తలనొప్పి రావచ్చు.

ఒకసారి గైనకాలజిస్టును సంప్రదించి, సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి సీబీపీ, ఎస్‌ఆర్‌. టీఎస్‌హెచ్, అల్ట్రాసౌండ్‌ పెల్విస్‌ వంటి పరీక్షలు చేయించుకుని, కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవడం మంచిది. ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, పండ్లు, పాలు, పెరుగుతో కూడిన మితమైన పౌష్టికాహారం తీసుకుంటూ, నడక, యోగా, ధ్యానం వంటివి కూడా చెయ్యడం వల్ల చాలావరకు హార్మోన్ల అసమతుల్యత తగ్గే అవకాశాలు ఉంటాయి. సమస్య ఏమీ లేకున్నా, పీరియడ్స్‌ సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటే, డాక్టర్‌ సలహా మేరకు రెండురోజులు నొప్పి నివారణ మాత్రలు వాడుకోవచ్చు.

నా వయసు 46 ఏళ్లు. నాకు రుతుక్రమం రెండు మూడు నెలలకోసారి వస్తోంది. వచ్చినప్పుడు కూడా రుతుస్రావం రెండు రోజులే ఉంటోంది. ఇటీవల పరీక్షలు జరిపిస్తే, గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్‌ పెరిగినట్లు రిపోర్టు వచ్చింది. ఈ పరిస్థితిలో గర్భసంచి తీసేస్తేనే మంచిదని డాక్టర్లు అంటున్నారు. నాకైతే ఆపరేషన్‌ అంటే భయంగా ఉంది. దీనికి ప్రత్యామ్నాయ చికిత్స ఏమైనా ఉందా?
– లక్ష్మి, రేణిగుంట

మీకు 46 ఏళ్లు. పీరియడ్స్‌ రెండు మూడు నెలలకోసారి వచ్చి, బ్లీడింగ్‌ రెండురోజులే ఉంటుంది. అంటే మీకు ఫైబ్రాయిడ్స్‌ కారణంగా ప్రస్తుతానికి పెద్దగా లక్షణాలేమీ లేనట్లే! సాధారణంగా ఫైబ్రాయిడ్స్‌ అనేవి గర్భాశయంలో పెరిగే కంతులు. ఇవి 99.9 శాతం క్యాన్సర్‌ గడ్డలు కావు. వాటి పరిమాణం, గర్భాశయంలో ఎక్కడ ఉన్నాయి అనేదాని బట్టి లక్షణాలు ఉంటాయి. ఫైబ్రాయిడ్స్‌ గర్భాశయం లోపలి పొరలో (సబ్‌ మ్యూకస్‌ ఫైబ్రాయిడ్స్‌) ఉంటే, బ్లీడింగ్‌ ఎక్కువ కావడం, మధ్య మధ్యలో స్పాటింగ్‌ కనిపించడం వంటివి ఉంటాయి. మయోమెట్రియమ్‌ పొరలో (ఇంట్రామ్యూరల్‌ ఫైబ్రాయిడ్స్‌) ఉంటే, వాటి పరిమాణం బట్టి బ్లీడింగ్‌ ఎక్కువ కావడం, చిన్నగా ఉంటే కొందరిలో ఏ సమస్యా లేకపోవడం జరగవచ్చు.

గర్భాశయం బయటి పొరలో (సబ్‌ సిరీస్‌ ఫైబ్రాయిడ్స్‌) ఉంటే పెద్దగా సమస్య ఉండకపోవచ్చు. మరీ పెద్దగా ఉంటే చుట్టు పక్కల అవయవాల మీద ఒత్తిడి పడటం వల్ల నడుంనొప్పి, మూత్ర సమస్యలు, జీర్ణ సమస్యలు ఉండవచ్చు. మీరు చెప్పినదాని బట్టి చూస్తే, ప్రస్తుతానికి ఫైబ్రాయిడ్స్‌ వల్ల మీకు ఎటువంటి లక్షణాలూ కనిపించడం లేదు. బ్లీడింగ్‌ కూడా రెండు మూడు నెలలకోసారి రెండురోజులే అవుతుంది కాబట్టి మీకు త్వరలోనే పీరియడ్స్‌ ఆగిపోయి మెనోపాజ్‌ దశ రావచ్చు. పీరియడ్స్‌ ఆగిపోతే ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ప్రభావం అంతగా ఉండదు కాబట్టి ఫైబ్రాయిడ్స్‌ ఇంకా పెరగకుండా ఉంటాయి.

అంతేకాకుండా, వాటి పరిమాణం మెల్లగా తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు లక్షణాలు లేనంత వరకు ఫైబ్రాయిడ్స్‌ గురించి కంగారు పడకుండా కొంతకాలం ఆగి చూడవచ్చు. ఆరునెలలకోసారి స్కానింగ్‌ చేయించుకుంటూ, వాటి పరిమాణం పెరుగుతోందా లేదా తెలుసుకోవచ్చు. వాటి పరిమాణం మరీ పెద్దగా అవుతూ, మీకు లక్షణాలు కనిపిస్తున్నట్లయితే, అప్పుడు ఆపరేషన్‌ గురించి నిర్ణయం తీసుకోవచ్చు. ఆపరేషన్‌ బదులు ఫైబ్రాయిడ్స్‌ పరిమాణం తగ్గడానికి యుటెరైన్‌ ఆర్టరీ ఎంబోలైజేషన్, ఎంఆర్‌ఐ గైడెడ్‌ హైఫ్రీక్వెన్సీ అల్ట్రాసౌండ్‌ వేవ్స్‌ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను పాటించవచ్చు.
డా‘‘ వేనాటి శోభ, గైనకాలజిస్ట్‌, హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు