ఆదిభట్ల అంటే 'హరికథ'..'హరికథ' అంటే..

31 Aug, 2023 14:00 IST|Sakshi

తెలుగు వారిని ఊరించి ఊగించి ఉప్పొంగించిన కళాస్వరూపాలలో అపురూపమైనది 'హరికథ'. ఈ కళాకేళికి అపూర్వమైన కీర్తిని కట్టబెట్టినవాడు ఆదిభట్ల నారాయణదాసు. ఆదిభట్ల అంటే హరికథ - హరికథ అంటే ఆదిభట్ల. వీరికి పూర్వం కూడా హరికథ ఉంది,హరికథకులు ఉన్నారు. ఈ ప్రక్రియకు కొత్తరూపును, సరికొత్త ప్రాపును తెచ్చినవాడు కేవలం నారాయణదాసు. సంగీత సాహిత్య సార్వభౌముడుగా, లయబ్రహ్మగా ప్రసిద్ధుడు. 'హరికథా పితామహుడు'గా సుప్రసిద్ధుడు.'ఆటపాటల మేటి'గా అనంత వైభవశ్రీమంతుడు. ఆధునిక కాలంలో,తెలుగునేలపై ఇంతటి బహుముఖ ప్రతిభామూర్తి మరొకరు లేరనడం అతిశయోక్తికాదు. సామాన్యులను, అసామాన్యులను అనుపమానంగా మెప్పించి 'హరికథ'కు పట్టం కట్టిన ప్రతిభాశాలి.కేవలం తెలుగువారే కాదు,యావత్తు భారతీయులు,ఆంగ్లేయులు సైతం ఆయన ప్రజ్ఞకు మోకరిల్లారు.

బహుకళా ప్రావీణ్యం,బహుభాషా ఆధిక్యం ఆదిభట్ల సొమ్ము."ఆధునిక కాలంలో నా దృష్టిలో దైవాంశ సంభూతులు ముగ్గురే ముగ్గురు. ఒకరు అసమాన దేహబల సంపన్నుడైన కోడి రామ్మూర్తి, ఇంకొకరు మారుత వేగ కవితా స్వరూపులైన కొప్పరపు కవులు, మరొకరు పంచముఖీ పరమేశ్వరుడైన ఆదిభట్ల నారాయణదాసు"..... అని 'కవి సమ్రాట్ ' విశ్వనాథ సత్యనారాయణ ఒక సమావేశంలో నారాయణదాసు శక్తి స్వరూపానికి అక్షరార్చన చేశారు. నారాయణదాసుపై అద్భుతమైన పరిశోధన చేసి డాక్టరేట్,గోల్డ్ మెడల్ తీసుకున్న డాక్టర్ గుండవరపు లక్ష్మీనారాయణ (గుంటూరు) ఈ విషయాన్ని ఆత్మీయుల దగ్గర చెబుతుండేవారు. కథాగానం చేస్తూ..ఏకకాలంలో శరీరంలోని ఐదు భాగాలతో ఐదు తాళలను మేళవించడం అతిమానుష శక్తిగా (సూపర్ హ్యూమన్ ) నాటి మహాకవి పండిత,క ళామూర్తులు నిలువెల్లా భజించారు. 

రెండు చేతులు,రెండు కాళ్ళు, తలతో అయుదు తాళాలకు దరువు వేసి చూపించే ఆ ప్రజ్ఞ ప్రపంచంలోనే ఎవ్వరికీ లేదు. అది అనితర సాధ్యం. ఇంతటి శక్తి కేవలం నారాయణదాసుకే వశమైంది. ఇది నభూతో ! న భవిష్యతి! గా పెద్దలందరూ నిర్ణయించారు. మహారాష్ట్రలో 'అభంగులు', తమిళనాడులో 'కాలక్షేపం', కర్ణాటకలో 'హరికథా కాలక్షేపం', మనకంటే కాస్త ముందుగా రూపుదిద్దుకున్నాయి. మనకు 'యక్షగానం ఉంది. ఉన్నప్పటికీ, హరికథకు - యక్షగానానికి కొన్ని పోలికలతో పాటు, కొన్ని భేదాలు కూడా ఉన్నాయి. నారాయణదాసు చేతిలో 'తెలుగు హరికథ' సర్వాంగ సుందరంగా కొత్త రూపును దిద్దుకుంది, తీరు మార్చుకుంది, కొంగ్రొత్త వన్నెలు, వయ్యారాలు పోయింది. మరాఠా, తమిళ, కన్నడుల ప్రభావంతో, మన తెలుగుదేశంలో నారాయణదాసు కంటే ముందు కొందరు హరికథా ప్రదర్శనలు చేశారు.' కథాగానం' మూలంగా రూపుదిద్దుకున్న ఈ కళ అత్యంత ప్రాచీనమైంది.

మిగిలిన రాష్ట్రాలలో సంగీతం, సాహిత్యానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ కథాగానాలు సాగేవి. అందులో నృత్యం, అభినయం అనేవి ఉండేవి కావు. సంగీతం,కవిత్వం, నృత్యం, అభినయం, నాటకం పెనవేసుకున్న అపూర్వ సర్వ కళాస్వరూపం మన ఆదిభట్ల చేతుల్లో అవతారమెత్తిన 'హరికథా రూపం. హాస్య ప్రసంగాలు, పిట్టకథలు, విసుర్లు,చెణుకులు, చమత్కార భరితమైన చాటుపద్య మణిమంజరులతో,గజ్జెకట్టి, చిరు తాళాలు మోగిస్తూ... నారాయణదాసు హరికథా ప్రదర్శన చేస్తూంటే... కొన్ని వేలమంది ఒళ్ళు మరచి,ఆ రససముద్రంలో మునిగితేలేవారు. తెల్లవార్లూ సాగే ఆ ఆటపాటలతో అలిసిసొలసి పోయేవారు. ఆదిభట్ల వారి 'బేహాగ్' రాగ ప్రస్థానానికి 'విశ్వకవి' రవీంద్రనాథ్ ఠాగూర్ మంత్రముగ్ధుడైపోయారు. సర్వేపల్లి రాధాకృష్ణ, సరోజనీదేవి వంటి విజ్ఞులు,ప్రాజ్ఞులు ఎందరో ఆదిభట్లవారి ప్రజ్ఞకు నీరాజనాలు పట్టారు. విజయనగరంలో ఐదుతాళాలతో కథాగానం చేసి, దక్షిణాది పండితులను ఓడించి 'పంచముఖీ పరమేశ్వర' బిరుదును గెలుచున్న ఘనుడు ఆదిభట్ల.

హరికథలే కాక, అష్టావధానాలు చేశారు. తెలుగు,సంస్కృతం, తమిళం, హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఇంగ్లిష్, అరబ్బీ, పార్శీ మొదలైన అనేక భాషల్లో ప్రావీణ్యం ఆయన ఐశ్వర్యం. శతాధిక గ్రంథాలు రాశారు. సంగీతాన్ని - సాహిత్యాన్ని సమ ప్రతిభతో ప్రదర్శన చేశారు. అనేక అంశాలపై అపురూపమైన పరిశోధనలు చేశారు. సంగీతంపై లాక్షణిక గ్రంథాలు రాశారు. తాత్వికత సిద్ధాంతాల శాస్త్ర గ్రంథాలు రాశారు. హరికథలు, ప్రబంధాలు,శతకాలు, నాటకాలు,అనువాదాలు ఇలా అనంతముఖంగా ఆ రచనా విన్యాసం విజృంభించింది. ఉమర్ ఖయ్యామ్ రుబాయీలను అనువాదం చేసిన తీరు అనన్య సామాన్యం.నాలుగు విధాలుగా ఆ అనువాదం సాగింది. పారశీలో నుంచి సంస్కృతంలోకి, అచ్చ తెలుగులోకి అనువాదం చేశారు. పీట్స్ జెరల్డ్ ఇంగ్లిష్ లో రాసిన దానిని కూడా అచ్చతెలుగు,సంస్కృతంలో భిన్న ఛందస్సుల్లో అనుసృజన చేసిన తీరు ఆదిభట్లకే చెల్లింది.

'నవరస తరంగిణి' అద్భుతమైన రచన.కాళిదాసు సంస్కృత కవిత్వం,షేక్స్ పియర్ ఇంగ్లిష్ సాహిత్యంలోని నవరసాలను తెలుగులో అనువదించిన వైనం అనితర సాధ్యం.'దశవిధ రాగ సవతి కుసుమ మంజరి' మరో మాణిక్యం. మంజరీ వృత్తంలో 90 రాగాలతో ఈ రచన సాగింది.ఋగ్వేదంలోని ఋక్కులను స్వరపరచి వీణపై వినిపించడమే కాక,ఎందరికో నేర్పించారు.ఆ ఋక్కులను తెలుగుగీతాలు గానూ సృష్టించాడు.ఆయన 'శంభో..' అంటూ నినాదం చేస్తూంటే.. విజయనగరం మొత్తం వినపడేది. కేవలం,ఆయన గురించే విజయనగరంలో సంగీత విద్యాలయాన్ని స్థాపించారు.దానికి ఆయనే మొట్టమొదటి ప్రిన్సిపాల్. నోబెల్ ప్రైజ్ కు నామినేట్ చేయడానికి బ్రిటిష్ వారు ఉత్సాహం చూపించినా, ఆయన సున్నితంగా తిరస్కరించారు.ఎన్నో రచనలు చేశారు.ఎన్నో వేషాలు వేశారు.

'అచ్చతెలుగు'పై మక్కువ ఎక్కువ పెంచుకొని విశిష్టమైన కృషి చేశారు, రచనలు అందించారు. నూరుగంట, మొక్కుబడి,వేల్పువంద,తల్లి విన్కి (లలితా సహస్ర నామం), వెన్నుని వేయిపేర్ల వినికరి (విష్ణు సహస్ర నామ కీర్తనం) మొదలైనవి ఎన్నో ఉన్నాయి. అనేక అచ్చతెలుగు పదాలను సృష్టించారు. ఆయన ముట్టని కళ లేదు.ఆయనకు దక్కని బిరుదు సత్కారాలు లేవు.తెలుగునాట గజ్జెకట్టి కథ చెప్పే ప్రతి హరిదాసు మొట్టమొదటగా తలుచుకొనేది నారాయణదాసునే.సర్వ విద్యా పారంగతుడు,సర్వ కళాస్వరూపుడైన ఆయనకు గురువంటూ ప్రత్యేకంగా ఎవ్వరూ లేరు.ఆన్నీ స్వయంగా సిద్ధించినవే.రససిద్ధిని చేకూర్చినవే.చెన్నపట్టణానికి చెందిన భాగవతార్ కుప్పుస్వామి నాయుడు విజయనగరంలో చెప్పిన హరికథ విని,నారాయణదాసు 'ధ్రువ చరిత్రం' అనే హరికథను రాశారు.అదే ఆదిభట్ల రచించిన మొట్టమొదటి కథ. సొంత కీర్తనలు,భాగవత పద్యాలు, పంచతంత్రకథలు కలిపి రూపకల్పన చేశారు.

వేణుగోపాలస్వామి దేవాలయంలో 1883లో తొట్టతొలిగా ప్రదర్శన చేశారు. కాళ్ళకు గజ్జెకట్టి ఆడిన ఆ ఆటే తర్వాత ' ఆటపాటల మేటి'గా అనంతమైన కీర్తిశిఖరాలకు చేర్చింది. శ్రీకాకుళం జిల్లా ఉర్లాం సంస్థానంలో తొలిసారిగా సంగీత సాహిత్య సమలంకృతంగా 'అష్టావధానం' చేశారు. ఎవరో సవాల్ విసిరితే! రాత్రికి రాత్రి 'అంబరీషోపాఖ్యానం' హరికథను రూపొందించారు. అదంతా ధారణలో ఉంచుకొని, ఆ మర్నాడే అద్భుతంగా ప్రదర్శించి అందరినీ అమితాశ్చర్యపరచారు. అది కూడా ఉర్లాం సంస్థానంలోనే జరిగింది. ఇది ఆయన రూపొందించిన రెండో హరికథ. 20 ఏళ్ళ వయస్సు రాకముందే ప్రదర్శనలు ఇచ్చి, తెలుగు హరికథకు కొత్త రూపాన్ని ఇచ్చారు. ఆయన ఏకసంథాగ్రాహి. ఏదైనా కేవలం ఒక్కసారి వింటే,హృదయంలో నాటుకుపోయేది. చిన్నప్పటి నుంచీ అదే తీరు.

నాలుగేళ్ల వయస్సులోనే భాగవత పద్యాలు చదివేవాడు. పద్నాలుగేళ్ళ వయస్సు వరకూ స్కూల్ ముఖమే చూడలేదు. కొన్ని వందల పద్యాలు, శ్లోకాలు,కీర్తనలు కేవలం విని హృదయస్థం చేసుకున్నారు. ఆ తర్వాత ఎఫ్ ఏ పాసయ్యారు. పదేళ్ల ప్రాయంలోనే తాళపత్ర రచనలో ప్రావీణ్యం పొందారు. వీణావాదనా ప్రజ్ఞ కూడా సహజ ప్రతిభా సంస్కారాలతోనే అబ్బింది. బొబ్బిలి సంస్థాన విద్వాంసుడు వాసా సాంబయ్య దగ్గర కేవలం ఒక నెలరోజుల పాటు వీణలో శిష్యరికం చేశారు. తదనంతర జీవితంలో ఎందరో పెద్దలతో పరిచయ భాగ్యం ఏర్పడింది. వారి నుంచి అనేక విశేషాలు, మెళుకువలను తన సూక్ష్మగ్రాహ్య ప్రజ్ఞతో ఒంటపట్టించుకున్నారు.

ఆ గానం,ఆ గాత్రం,ఆ ప్రదర్శనం,ఆ వ్యక్తిత్వం,ఆ వైభవం ఆన్నీ ముగ్ధమనోహరమైనవే.ఆయన ఆత్మకథ ' నా ఎరుక' పెను సంచలనం.తన ముప్పైఏళ్ళ వరకూ జీవితంలో సాగిన విశేషాలన్నీ అందులో ఉంటాయి.తన విలాస పురుషత్వం,రసికత్వం ఆన్నీ అక్షరబద్ధం చేశారు. ఏ అనుభవాన్నీ దాచిపెట్టని తెగువ ఆయనకే చెల్లింది. ఆయన జీవితమే ఒక ప్రభంజనం. ఆగష్టు 31 ఆదిభట్లవారి జయంతి.యఎనిమిది పదుల సంపూర్ణ జీవితాన్ని అనుభవించిన పరిపూర్ణుడు (1864-1945). సూర్యనారాయణ నుంచి నారాయణదాసుగా మహా అవతారమూర్తిగా వాసికెక్కిన ప్రతిభామూర్తి. ఈ హరికథా పితామహుడు మన తెలుగువాడు. సర్వ కళలకు రేడు.
 


 

మాశర్మ, సీనియర్‌ జర్నలిస్ట్‌

(చదవండి: భాషోద్యమంలో పిడుగు గిడుగు!)

మరిన్ని వార్తలు