Happy Holi 2022: కామదహనం కథ తెలుసా?

18 Mar, 2022 15:30 IST|Sakshi

ఆమని అంటే ఆహ్లాదానికి మారుపేరు. శిశిరంలో ఆకులురాలి మోడువారిన కొమ్మలకు మారాకులు వేసే రుతువు వసంతం. వణికించే చలి తీవ్రత ఉండదు, ఉడుకెత్తించే ఎండల ధాటి ఉండదు, కుండపోత వర్షాల చిత్తడి చిరాకు ఉండదు. అత్యంత ఆహ్లాదభరితమైన రుతువు కాబట్టే వసంతానికి రుతురాజుగా గుర్తింపు వచ్చింది. అంతెందుకు, భగవద్గీతలోని విభూతియోగంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే ‘రుతూనాం కుసుమాకరః’– అంటే ‘రుతువుల్లో వసంతాన్ని నేనే’ అని స్వయంగా చెప్పుకున్నాడు.

వసంతాగమనంతోనే ప్రకృతి రాగరంజితమవుతుంది. వసంతానికి స్వాగతం పలుకుతూ దేశమంతటా.. డోలాపూర్ణిమ, హోలీ వేడుకలు జరుపుకుంటారు. మనదేశంలోనే కాకుండా చాలా వరకు ప్రాక్‌ పాశ్చాత్య దేశాలలో వసంతానికి స్వాగతం పలికే సంప్రదాయ వేడుకలు ఉన్నాయి. ఫాల్గుణ పూర్ణిమ రోజున ఒకరిపై ఒకరు రంగులు చల్లుకునే హోలీ పండుగ పురాతనకాలం నుంచే ఉంది.

ఈ పండుగ వసంత పౌర్ణమిగా, డోలా పూర్ణిమగా, డోలాయాత్రగా, కాముని పున్నమిగా, వసంతోత్సవంగా, రంగుల పండుగగా ప్రసిద్ధి పొందింది. ఫాల్గుణ పౌర్ణమికి సంబంధించి పలు పురాణగాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.  రాధాకృష్ణుల అజరామర ప్రణయానికి నీరాజనాలు పడుతూ పలుచోట్ల వైష్ణవాలయాల్లో డోలా పూర్ణిమ వేడుకలను ఘనంగా జరుపుకొంటారు.

హోలీ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో హోలికా దహనం, ఇంకొన్ని చోట్ల కామదహనం తతంగాలను కూడా నిర్వహిస్తారు. శ్రీకృష్ణుడు పెరిగిన మథుర, బృందావనం ప్రాంతాల్లో పదహారు రోజులపాటు వసంతోత్సవాలను అంగరంగ వైభవోపేతంగా జరుపుకొంటారు. హోలీ వెనుకనున్న పురాణగాథలు కొన్ని చెప్పుకుందాం.

హిరణ్యకశిపుడు ఘోరతపస్సు చేసి
రాక్షసరాజైన హిరణ్యకశిపుడు ఘోరతపస్సు చేసి, తనను చంపడం దాదాపు అసాధ్యమనే రీతిలో బ్రహ్మ నుంచి వరాలు పొందాడు. విష్ణుద్వేషి అయిన అతడు.. వరగర్వంతో దేవతలను ముప్పుతిప్పలు పెట్టేవాడు. హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు. ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిశిక్షలు విధించినా ప్రహ్లాదుడు తన విష్ణుభక్తిని మానుకోలేదు.

తండ్రి విధించిన శిక్షల నుంచి విష్ణునామ జపంతోనే అతడు సురక్షితంగా బయటపడ్డాడు. హిరణ్యకశిపుడు ఒకసారి చితినిపేర్చి, తన సోదరి హోలిక ఒడిలో ప్రహ్లాదుడిని కూర్చోబెట్టి నిప్పంటించాడు. హోలిక కప్పుకున్న శాలువను అగ్ని కాల్చలేదు. అందువల్ల ఆమె సురక్షితంగా ఉంటుందని తలచాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడు విష్ణువును ప్రార్థించడంతో హోలిక శాలువ ఎగిరిపోయి, ప్రహ్లాదుడిని చుట్టుకుంది. చితిమంటల్లో హోలిక హాహాకారాలు చేస్తూ దహనమైపోయింది.

అదేరోజు అసుర సంధ్యవేళ శ్రీమహా విష్ణువు నరసింహావతారంలో స్తంభాన్ని చీల్చుకుని వచ్చి, ఆరుబయట హిరణ్యకశిపుడిని తన ఒడిలో పెట్టుకుని, గోళ్లతో అతడి గుండెచీల్చి సంహరించాడు. ఫాల్గుణ పౌర్ణమినాడు హోలికా దహనం జరగడం వల్ల, కొన్నిప్రాంతాల్లో హోలీ ముందురోజు రాత్రి హోలిక దిష్టిబొమ్మలను దహించడం ఆనవాయతీగా వస్తోంది.

కామదహనం కథ
ఇదిలా ఉంటే, కామదహనం కథ సుప్రసిద్ధమైనదే. దేవతల కోరికపై మన్మథుడు శివుడికి తపోభంగం కలిగించాడు. కోపోద్రిక్తుడైన శివుడు మూడోకన్ను తెరవడంతో అతడు కాలి బూడిదయ్యాడు. మన్మథుడు దహనమైన రోజు గనుక ఫాల్గుణ పౌర్ణమినాడు కొన్నిచోట్ల దిష్టిబొమ్మలతో కామదహనం తతంగాన్ని నిర్వహిస్తారు. హోలీపండుగ రోజున రంగలు చల్లుకునే ఆచారం గురించి ఒక చిన్న గాథ ఉంది. రాధ తెల్లగా, తాను నల్లగా ఉండటంతో చిన్నారి కృష్ణుణ్ణి తోటి గోపబాలకులందరూ ఆటపట్టించేవారు. వారి వేళాకోళాలకు కృష్ణుడు చిన్నబోవడం చూసి, యశోదమ్మ రాధ మీద చల్లమని రంగు నీళ్లిచ్చింది.  

రాధ మీద రంగు చల్లి, కిలకిలా నవ్వాడు కృష్ణుడు. వెంటనే రాధ తాను కూడా చేతికందినంత రంగు తీసుకుని, కృష్ణుడి ముఖానికి రంగు పూసింది. వీరిద్దరినీ చూసి, రేపల్లె జనాలంతా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని సందడి చేశారట. మనుషుల మధ్య రంగుల తేడాలను రూపుమాపడానికి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకునే ఆచారం ఏర్పడిందని చెబుతారు. హోలీ రోజున బంధుమిత్రులు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని, రంగులు చల్లుకుంటూ వసంతాగమనాన్ని ఆస్వాదిస్తారు. 

చదవండి: World Sleep Day: నిద్ర లేకపోతే ఎంత డేంజరో తెలుసా? మీకు తెలియని షాకింగ్‌ విషయాలు

మరిన్ని వార్తలు