అట్ల త‌ద్ది ఎందుకు జరుపుకోవాలంటే.. తెలుగు పండుగ ఆరోగ్య సూత్రాలు!

23 Oct, 2021 11:24 IST|Sakshi

ఆటల నోము అట్లతద్ది.. ఆడపిల్లలు నోచే తద్ది అంటూ ప‌విత్ర‌బంధం సినిమాలో క‌థానాయికగా వేసిన వాణిశ్రీ‌ వేడుకగా పాడుతుంది. తెలుగు వారి జీవితాల‌లో అట్ల‌త‌ద్దికి అంత ప్రాధాన్య‌త ఉంది. ఆడ‌పిల్ల‌లు ఆడుతుంటే, మ‌గ పిల్ల‌లు ఆట ప‌ట్టిస్తారు. ఎవ్వ‌రూ ఎవ‌రితోనూ గొడ‌వ‌ప‌డ‌రు. ఆట ప‌ట్టించ‌టాన్ని కూడా ఆనందంగా స్వీక‌రిస్తారు. తెల్ల‌వారుజామునే పిల్ల‌లంతా పొర‌ప‌చ్చాలు, హెచ్చుత‌గ్గులు.. ఏ అభిప్రాయ భేదాలు లేకుండా ఆడుకుంటారు. ఐక‌మ‌త్యానికి ఈ పండుగ ప్ర‌తీక‌గా క‌నిపిస్తుంది.

ఇంకా ఈ పండుగ‌లో అనేక కోణాలున్నాయి...
ఆడపిల్లలకు శారీరక వ్యాయామం తప్పనిసరి. పూర్వం అందరూ ఇంటి దగ్గరే ఉండేవారు. ఇంట్లో చేసే ప్రతి పనిలోనే వ్యాయామమే. చెరువుకు వెళ్లి బిందెడు నీళ్లు తేవటం, పెరట్లో బావిలో నీళ్లు తోడటం, పప్పులు రుబ్బడం, రవ్వ విసరటం, అప్పడాలు ఒత్తడం... ఏ పని చేసినా పనితో పాటు శరీర ఆరోగ్యానికి కావలసిన వ్యాయామం ఉండేది. దానితో పాటు మనసును కూడా కుదుటపరుస్తుంది. నిరంతరం ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండేవారికి ఆటవిడుపు కూడా ఉండాలి. అట్లతద్ది ఆడపిల్లలకు ఆటవిడుపు. 

ముందు రోజే గోరింటారు పెట్టుకోవాలి. తెల్లవారు జామున సూర్యుని కంటె ముందే నిద్ర లేచి, ముందురోజు రాత్రి అమ్మ వండిన అన్నాన్ని చద్దన్నంగా తినటం ఎంతో సరదా. నువ్వులపొడి, ఉల్లిపాయ పులుసు, గోంగూర పచ్చడి, గడ్డ పెరుగు, తాంబూలం... అన్నీ కడుపు నిండా తిని, ఆహారం అరిగేవరకు ఉయ్యాల ఊగి, ఆటలు ఆడి, బారెడు పొద్దెక్కిన తరవాత ఇంటికి వచ్చి హాయిగా స్నానం చేయటం... ఇదీ ఈ పండుగ విధానం.

చదవండి: Wonder of Science: బాప్‌రే.. ఒక్క చెట్టుకే 40 రకాల పండ్లా..!!

ఇక్కడితో ఆగదు...
అమ్మ వేసే అట్లను కడుపు నిండా తినాలి. కొందరైతే వాయినాలు ఇవ్వాలి. ఇవన్నీ సంప్రదాయంలో భాగం. మరి తెల్లవారుజామున ఆడే ఆటల్లో ఒక కలివిడితనం ఉంటుంది. ఆడపిల్లలు ఆడుతుంటే, మగ పిల్లలు దురదగుంటాకుతో వచ్చి ఆడపిల్లల్ని సరదాగా ఆటపట్టించటం, ఈ ఆడపిల్లలు వారిని బెదిరించటం... ఇదీ ఆడమగ తేడా లేకుండా అందరం ఒకటే అనే భావనతో సరదాసరదాగా నడిచే పండుగ. ఎక్కడా శృతిమించని సరదాల వేడుక ఈ పండుగ. 

ఉయ్యాలో ఉయ్యాల... ఊరు చివర చెరువు గట్టున ఉన్న పెద్దపెద్ద చెట్లకు ఉయ్యాలలు వేసి, ఒకరిని ఒకరు ఊపుకుంటూ, పాటలు పాడుకుంటూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ చేసుకునే ప్రకృతి పండుగ. ఏ చెట్టు కొమ్మ ఎంత గట్టిగా ఉందో చూసుకోవటం ప్రధానం. జీవితం అనే ఉయ్యాల దృఢంగా ఉండాలంటే ఆధారం గట్టిగా ఉండాలనే అంతరార్థం చెబుతుంది ఈ పండుగ. నిత్యజీవితంలో ఆటుపోట్లు వస్తాయి. మనసు డోలాయమానంగా అయిపోతుంటుంది. ఎత్తుపల్లాలు చవిచూడాల్సి వస్తుంది. ఒకసారి అంత ఎత్తుకు వెళ్లిపోతాం, ఒకసారి నేల మీదకు పడిపోతాం. అదే ఉయ్యాల అంతరార్థం. పండుగల పరమార్థం వెనకపడిపోవటంతో, అందులోని సామాజిక కోణం మరుగున పడిపోయి, అనవసరమైన చాదస్తాలు మాత్రం మిగిలిపోతున్నాయి. 

చదవండి: ఈ ఫేస్‌ ప్యాక్‌ వేసుకున్నారో పార్లర్‌కి వెళ్లాల్సిన పనేలేదు!

వయసులో ఉన్న ఆడపిల్లలు ఆటలు ఆడాలి...
నలుగురితో కలిసిమెలిసి ఆడుతుంటే, ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించటం నేర్చుకోవాలి. యుక్త వయసు నుంచి ఆలోచనలలో మార్పు వస్తుంది. మంచి మార్గం వైపు కాని, చెడు తోవలోకి కాని వెళ్లే వయసు ఇదే. స్నేహితులతో ఆడుకుంటూ ఉండటం వల్ల, ఒకరిని చూసి ఒకరు మంచి నేర్చుకునే అవకాశం కలిగించే పండుగ. అంతేనా యుక్తవయసులో వచ్చే శారీరక మార్పులకు అనుగుణంగా అనారోగ్యాలు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటానికి అనువుగా ఏర్పడిన పండుగలు ఇవి. శరీరం బాగా అలసిపోయే వరకు ఆడుకుంటూ, తోటివారితో ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటూ రకరకాల మనస్తత్వాలను అర్థం చేసుకుంటూ వ్యక్తిత్వాన్ని అందంగా రూపుదిద్దుకోవటానికి అవసరమైన విధంగా పండుగలు మార్గం చూపుతాయి. 

అట్ల తద్దోయ్‌ ఆరట్లోయ్‌
ముద్ద పప్పోయ్‌ మూడట్లోయ్‌
పీట కింద పిడికెడు బియ్యం
పిల్లల్లారా జెల్లల్లార లేచి రండోయ్‌...

ఎంతో అందమైన పాట

ఆశ్వీయుజం వెనుకబడి, కార్తికం వస్తోందంటే చలి ముదురుతుంది. ఆ చలికి ముడుచుకుని పడుకుంటే కుదరదు. చలికి సవాలుగా నిద్ర లేచి చలిని పరుగులు పెట్టించాలి. అందుకే పిల్లలంతా తెల్లవారు జామునే లేచి ఆడుకోవాలని చెప్పే పండుగ ఇది. కడుపు నిండుగా అట్లు తినాలి. మినుములు, బియ్యంతో క‌లిపి చేసిన అట్లు తింటే ఒళ్లు ఇనుములా త‌యార‌వుతుంది. ప్ర‌కృతి సిద్ధంగా ఆడ‌పిల్ల‌ల శ‌రీరంలో క‌లిగే మార్పుల‌కి ఇది చాలా అవ‌స‌రం.

ముద్ద పప్పు తినాలి. పిడికెడు బియ్యాన్ని మాత్రమే అన్నంగా వండుకుని తినాలి. మనం ఈ పాటను ఎలా కావాలంటే అలా చెప్పుకోవచ్చు. అందుకే అట్ల‌త‌ద్దిని అంద‌రూ జరుపుకునేందుకు వీలుగా నోము కింద ఏర్పాటుచేశారు. నోముగా చేసుకునేవారు ఉద‌యాన్నే కార్య‌క్ర‌మం పూర్త‌య్యాక‌, సాయంత్రం వ‌ర‌కు ఉప‌వాసం ఉండి, చంద‌మామ‌ను చూశాకే భోజ‌నం చేస్తారు. నోము అంటే మొక్కుబ‌డిగా కాకుండా, త్రిక‌ర‌ణ‌శుద్ధిగా ఆచ‌రించాలి. చాద‌స్తాల‌కు దూరంగా, ఆరోగ్యానికి ద‌గ్గ‌ర‌గా ఉండేలా ఈ పండుగ‌ను జ‌రుపుకోవాల‌ని చెబుతుంది మ‌న సంప్ర‌దాయం. ఇదే అట్ల‌త‌ద్దిలోని అంత‌రార్థం.

- వైజ‌యంతి పురాణ‌పండ‌

చదవండి: Pollution In China: ఏటా 7 లక్షల 50 వేల మంది మృతి అందుకేనట! ప్రమాదం అంచున.. చైనా..!

మరిన్ని వార్తలు