తేనె స్వచ్ఛత తెలుసుకోండి

9 Feb, 2021 15:54 IST|Sakshi

వెనుకటి రోజుల్లో పెరట్లోనో, పోలాల్లోనో, పండ్ల తోటల్లోనో, అడవుల్లో తేనె తుట్టెలు విరివిగా కనిపించేవి. తేనె పక్వానికి వచ్చినప్పుడు తేనెటీగలు కుట్టకుండా జాగ్రత్తగా ఒడిసిపట్టి ఇంట్లో నిల్వచేసేవారు. మాటలు రాని చిన్నపిల్లలకు ఈ స్వచ్ఛమైన తేనెను నాకించేవారు. అయితే ప్రస్తుతం ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పుడంతా ఎటుచూసినా కాంక్రీట్‌ జంగిల్‌ మాత్రమే కనిపిస్తుంది. దీనితోడు మార్కెట్లలో పేరుమోసిన అనేక బ్రాండ్లు స్వచ్ఛమైన తేనె అని చెప్పి ఒక బాటిల్‌ కొంటే మరో బాటిల్‌ ఫ్రీ అని అమ్మెస్తున్నాయి. అయితే మార్కెట్లో దొరికే తేనె నాణ్యత ఎంత..? ఈ తేనెలో ఆరోగ్యానికి మంచి చేసే సుగుణాలు ఉన్నాయా..? తెలుసుకొని కొనాలని నిపుణులు సూచిస్తున్నారు. 

వీటిని గమనించండి..
► స్వచ్ఛమైన తేనె కాస్త నల్లగా ఉంటుంది. పసుపుగా అందంగా కనిపించదు. కల్తీలేని తేనెను గాజుసీసాలో పోస్తే సీసాకు అవతల ఉన్న వస్తువులేవీ కనిపించవు. కాలం గడిచేకొద్ది కల్తీ తేనెలు కూడా నల్లగా ముదురు రంగులోకి మారతాయి. అలా అని అది స్వచ్ఛమైన నిఖార్సైన తేనె అనుకోలేము. తయారీ తేదీని బట్టి రంగును గుర్తించాలి.

► తేనెలో 18 శాతం కంటే తక్కువ వాటర్‌ ఉంటే అది స్వచ్ఛమైన తేనెగా గుర్తించాలి. 

► ఒక స్పూన్‌తో కొద్దిగా తేనె తీసి దానిని ప్లేటుపై ఒక చుక్క వేయాలి. అప్పుడు ఆ తేనె చుక్కలు ముద్దగా లేదా ధారలా జారాలి. అప్పుడు అది మంచి తేనె అని నిర్ధారించుకోవాలి. అలా కాకుండా చుక్కలు చుక్కలుగా విడిపోతూ ఉంటే అది కల్తీకలిసిన తేనెగా గుర్తించాలి.

► నాణ్యమైన తేనె అంటే ఆర్గానిక్‌ మాత్రమే. తేనెలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్‌లు ఉండడం వల్ల అది పంచదార కంటే తియ్యగా ఉంటుంది. 

► తేనెను ప్రాసెస్‌ చేసే క్రమంలో వేడిచేస్తారు. ఇలా వేడిచేసేటప్పుడు తేనెలోని ఎంజైమ్‌లు, ప్రోబయోటిక్స్‌ తోపాటు ఇతర పోషకాలు దెబ్బతింటాయి.

► తీపిదనంతో పాటు తేనెలో 20 శాతం కంటే తక్కువగా నీరు కూడా ఉంటుంది. అందువల్ల తేనెలో సూక్ష్మజీవులు పెరగలేవు. 

► ఎక్కువ కాలం తేనె తాజాగా ఉండాలని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. అలా చేస్తే అది చక్కెరలా మారిపోతుంది. శుభ్రమైన పొడి గాజుసీసాలో పోసీ గాలిపోకుండా టైట్‌గా మూతపెట్టి భద్రపరిస్తే ఎన్నేళ్లైనా తేనెకు శల్యం ఉండదు. 

మరిన్ని వార్తలు