కమ్మని కార్తీకం.. కొర్రలతో లడ్డూ, రోజుకి ఒకటి తింటే చాలు

24 Nov, 2023 15:36 IST|Sakshi

కార్తీక మాసం కావడంతో... కోవెళ్లు, లోగిళ్లు దీపాలతో కళకళలాడిపోతున్నాయి. మరో రెండురోజుల్లో కార్తీకపౌర్ణమి. పగలంతా ఉపవాసం ఉన్నవారికి సాయంత్రం చంద్రోదయం కాగానే రుచిగా... శుచిగా కమ్మని వంటలతో ఉపవాస విరమణ చేయమని చెబుతోంది ఈ వారం వంటిల్లు. 

తినాయ్‌(కొర్ర) లడ్డు తయారీకి కావల్సినవి:

కొర్రలు – కప్పు; పల్లీలు – కప్పు; బెల్లం తరుగు – కప్పు; యాలకులు – మూడు. 

తయారీ విధానమిలా:
కొర్రలను శుభ్రంగా కడిగి అరగంట నానబెట్టాలి. అరగంట తరువాత నీటిని వంపేసి ఎండలో ఆరబోయాలి. తడిలేకుండా ఎండిన కొర్రలను బాణలిలో వేసి బ్రౌన్‌ కలర్‌లోకి మారేంత వరకు దోరగా వేయించాలి.
కొర్రలు వేగిన బాణలిలోనే పల్లీలను వేసి వేయించాలి. పల్లీలు చక్కగా వేగిన తరువాత పొట్టుతీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇదే బాణలిలో బెల్లం, రెండు టేబుల్‌ స్పూన్ల నీళ్లుపోసి సన్నని మంట మీద పెట్టాలి.
బెల్లం కరిగిన తరువాత వడగట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న కొర్రలు, పల్లీలు, యాలకులను మిక్సీజార్‌లో వేసి పొడి చేయాలి.కొర్రలు, పల్లీల పొడిని ప్లేటులో వేసుకుని, ఆ పొడిలో బెల్లం నీళ్లు వేస్తూ లడ్డులా చుట్టుకుంటే తినాయ్‌ లడ్డు రెడీ. బెల్లం ఇష్టపడని వారు తేనెతో లడ్డులూ చుట్టుకోవచ్చు. ఈ లడ్డు మూడు నాలుగురోజుల పాటు తాజాగా ఉంటుంది. 

మరిన్ని వార్తలు