తల్లి నగలు తాకట్టు పెట్టి గెర్బెరా పూలను సాగు చేశారు.. లక్షలు సంపాదిస్తున్నారు

6 Jul, 2022 09:22 IST|Sakshi
ప్రీతి భగత్, ప్రియాంక భగత్‌

కోశాక నీటి తడిలో ఉంచితే 15 రోజుల పాటు వాడవు గెర్బెరా పూలు. జార్ఖండ్‌లో ఈ పూలు కావాలంటే బెంగళూరు నుంచి తెప్పించుకోవాలి. ఇప్పుడు జెమ్‌షడ్‌పూర్‌కు చెందిన ఇద్దరు అక్కచెల్లెళ్లు ప్రియాంక, ప్రీతిలను అడిగితే చాలు వెంటనే లోడ్‌ పంపిస్తారు. లాకౌట్‌ కాలంలో తండ్రికి పనిపోవడంతో ఖాళీగా ఉన్న పొలంలో అలంకరణ పూలైన గెర్బెరాను సాగు చేశారు వీరు. ఇవాళ ఎందరో రైతులు వీరి బాటలో నడుస్తున్నారు. జార్ఖండ్‌లో వీరి పుణ్యమా అని వాడని పూలు వికసిస్తున్నాయి.

పెళ్లిళ్లు, మీటింగ్‌లు, వేడుకలు... వేదికలను అలంకరించడానికి పూలు కావాలి. ఫ్లవర్‌ బోకేలకు కూడా పూలు కావాలి. ఆ సమయంలో అందరూ కోరేది గెర్బెరా పూలు (జెర్బెరా అని కూడా అంటారు. ఆఫ్రికన్‌ డైసీ దీని మరో పేరు). కాని ఇవి చాలా తక్కువ ప్రాంతాల్లో పండిస్తారు. ఎక్కువగా బెంగళూరు నుంచి దేశంలోని మిగిలిన ప్రాంతాలకు వెళతాయి. వీటిని జార్ఖండ్‌ రాష్ట్రానికి తెచ్చిన ఘనత మాత్రం ఇద్దరు అక్కచెల్లెళ్లకు దక్కింది. వీరిని ఇప్పుడు అక్కడ ముద్దుగా ‘జెమ్‌షెడ్‌పూర్‌ సిస్టర్స్‌’ అంటున్నారు. వీరి పేర్లు ప్రియాంక భగత్, ప్రీతి భగత్‌. ప్రియాంక ఇప్పుడు డిగ్రీ ఫస్ట్‌ ఇయర్, ప్రీతి సీనియర్‌ ఇంటర్‌. జెమ్‌షెడ్‌పూర్‌ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉండే కాలాపత్థర్‌ అనే ఊళ్లో వీరు ఈ అద్భుతం సాధించారు.

లాక్‌డౌన్‌లో..
కాలాపత్థర్‌లో అందరూ రైతులు లేదా రోజు కూలీలు. భూమి ఉన్నా వ్యవసాయం చేయక కూలి పనులకు వెళుతుంటారు. లేదా పక్కనే ఉన్న జాదుగోడ అనే పట్టణంలోని ఫ్యాక్టరీలో వర్కర్లుగా వెళుతుంటారు.  ప్రియాంక, ప్రీతిల తండ్రి నవకిశోర్‌ భగర్‌ కూడా ఫ్యాక్టరీలో వర్కర్‌. కాని కోవిడ్‌ వల్ల లాక్‌డౌన్‌ రావడంతో ఫ్యాక్టరీ మూత పడింది. పని లేదు. ఆ సమయంలో పెద్ద కూతురు ఇంటర్‌లో, చిన్న కూతురు హైస్కూల్లో ఉన్నారు. పెద్ద కూతురు ప్రియాంక ‘బతకడం ఎలా?’ అని ఇంటర్‌నెట్‌లో సెర్చ్‌ చేస్తే గెర్బెరా పూలు వ్యాపార పంటగా మంచి లాభాలు ఇస్తుంది అని ఉంది. వాళ్లకు భూమి ఉంది. వ్యవసాయం చేయకపోయినా వ్యవసాయం తెలుసు. ‘మనం పండిద్దాం నాన్నా’ అన్నారు కూతుళ్లిద్దరు. జార్ఖండ్‌ మొత్తానికి మనమే సప్లై చేయవచ్చు అని కూడా అన్నారు. కాని ఈ పంటకు పెట్టుబడి జాస్తి. దాదాపు లక్ష రూపాయలు కావాలి. తల్లి తన నగలు కుదువకు ఇస్తానంది. ఆ డబ్బు తెచ్చి ఇద్దరు కూతుళ్లు వాళ్లకున్న భూమిలో గెర్బెరా పూల సాగు మొదలెట్టారు.

లాభాలు తెచ్చే పూలు..
గెర్బెరా పూలు త్వరగా వాడవు. ఒక సీసాలో నీళ్లు పోసి కాడలు వస్తే 15 రోజులు కూడా ఫ్రెష్‌గా ఉంటాయి. చెట్టుకు వదిలినా ఎక్కువ రోజులు వాడకుండా ఉంటాయి. అందువల్ల సీజన్‌లో వీటిని దూరాలకు కూడా రవాణా చేసి లాభాలు పొందవచ్చు. ‘పండగలు, వివాహాల సీజన్‌ను గమనించుకుని పూలను కోయడం ఉంచడం మేనేజ్‌ చేయాలి’ అంటారు అక్కచెల్లెళ్లు. ఇప్పుడు మార్కెట్‌లో ఒక్క పూవు 15 నుంచి 30 రూపాయలు పలుకుతుంది. ఈ పంట ఒక్కసారి వేసే మూడేళ్లు దిగుమతి ఇస్తుంది. పూలు పూస్తూనే ఉంటాయి. ‘డిమాండ్‌కు తగ్గట్లు సప్లయి చేయగలిగితే లక్షలు చూడొచ్చు’ అంటున్నారు ఈ సోదరీమణులు. వీళ్లకు వస్తున్న ఆదాయం చూసి చుట్టుపక్కల రైతులందరూ ఈ పూలసాగులోనే దిగారు. దాంతో జెమ్‌షెడ్‌పూర్‌ చుట్టుపక్కల ప్రాంతాల చేలన్నీ ఈ రంగుపూలతో కళకళలాడుతున్నాయి.

రిస్క్‌ కూడా ఉంది..
అలాగే రిస్క్‌ కూడా ఉంది. అన్‌సీజన్‌లో ఈ పూలు ఎవరూ కొనరు. దాంతో కోసి పక్కన పడేయాలి. చీడ పీడల వల్ల పూలు ఒకవైపే వికసించడం, ముడుచుకుపోవడం జరుగుతుంది. ఆ చీడలను కూడా తొలగించుకోవాలి. ‘మేము అవన్నీ జాగ్రత్తగా చేస్తున్నాం’ అంటున్నారు వీరిద్దరు. వీరి చదువు ఆటంకాలు కూడా తీరిపోయాయి. ప్రియాంక అగ్రికల్చరల్‌ బిఎస్సీ చదవాలనుకుంటోంది. చిన్నామె లా చదవాలనుకుంటోంది. తల్లిదండ్రులు దర్జాగా ఉన్నారు. వాడని పూలు వికసిస్తే ఇంత హేపీగా ఉంటుంది.

మరిన్ని వార్తలు