సోషల్‌ స్టార్‌.. చింకీ అండ్‌ మింకీ! 

4 Aug, 2021 20:13 IST|Sakshi

ఒకేరకమైన ముఖ కవళికలతో కవలలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తారు. వీళ్లు ఎక్కడ కనిపించినా కొన్ని క్షణాలు మన చూపు వాళ్లమీదే ఉంటుంది. వాళ్లల్లో పెద్ద ఎవరు.. చిన్న ఎవరబ్బా అనిపిస్తుంది. కాస్త అయోమయానికి గురైనప్పటికీ తరువాత తీక్షణంగా చూస్తేగానీ వారి గురించి అర్థం కాదు. అటువంటింది ఒకే రకమైన డ్రెస్‌లు వేసుకుని, ఏ విషయాన్ని అయినా ఇద్దరూ ఒకేసారి చెబుతూ అందర్నీ కన్‌ఫ్యూజ్‌ చేయడమేగాక, కామెడీ పంచ్‌లతో పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తున్నారు చింకీ మింకీలు. ఏకరూప కవలలు కావడం, ఒకేరకమైన అభిరుచులు, అభిప్రాయాలతో.. రకరకాల ఫన్నీ కంటెంట్‌ వీడియోలు, లిప్‌ సింక్‌ కామిక్‌ వీడియోలను రూపొందించి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తూ కోట్ల మందిని అలరిస్తున్నారు. 

ఇద్దరి డ్రెస్సింగ్‌ స్టైల్, గెటప్, హెయిర్‌ స్టైల్‌ ఒకే రకంగా ఉండడం వల్ల చింకీ ఎవరు? మింకీ ఎవరు? అని కనిపెట్టడం కూడా కష్టమే. సోషల్‌ మీడియా ట్రెండీ, సెన్సేషన్‌ చింకీ మింకీల అసలు పేర్లు సురభి మెహ్రా (చింకీ), సమృద్ది మెహ్రా (మింకీ). 1998లో నోయిడాలో పుట్టిన ఈ అక్కాచెల్లెళ్లు రూపంలో అచ్చుగుద్దినట్లు ఒక్కలాగే ఉంటారు. రూపంలోనేగాక వారి ఆలోచనలు, ఆహార్యాలు ఒకేవిధంగా ఉండడం విశేషం. నోయిడాలో పాఠశాల విద్యను పూర్తిచేసిన చింకీ మింకీలు పుణేలోని సింబయాసిస్‌ స్కిల్స్‌ అండ్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తిచేశారు. 


చిన్నప్పటినుంచి చురుకుగా ఉండే వీరు డిగ్రీ అయ్యాక ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరారు. రెండు నెలలు గడిచాక అక్కడ పని నచ్చకపోవడంతో ఉద్యోగం వదిలేసి మోడలింగ్‌ చేయాలని నిర్ణయిచుకుని ఆ దిశగా అడుగులు వేశారు. ఈ క్రమంలోనే ట్రెండ్‌కు తగ్గట్టుగా మోడ్రన్‌ డ్రెస్‌లు వేసుకుంటూ తమ ఫ్యాషన్‌ బ్లాగ్‌లో ఫోటోలు వీడియోలు అప్‌లోడ్‌ చేసేవారు. ఈ వీడియోలకు మంచి ఆదరణ లభించడంతో... 2016లో టిక్‌టాక్‌ వీడియోలు చేయడం ప్రారంభించారు. ఇండియాలో టిక్‌టాక్‌ అనుమతించినంత కాలం‘చింకీ మింకీ’ అకౌంట్‌కు ఆరున్నర కోట్ల మంది ఫాలోవర్స్‌ ఉండేవారు. ఇన్‌స్టాగ్రాంలో కూడా ఈ ట్విన్‌ సిస్టర్స్‌కు ఫాలోవర్స్‌ లక్షల్లోనే ఉండడంతో చింకీ మింకీలు బాగా పాపులర్‌ అయ్యారు.


కపిల్‌ శర్మ షో

పాపులర్‌ టిక్‌టాక్‌ స్టార్స్‌గా ఓ వెలుగు వెలుగుతున్న ట్విన్‌ సిస్టర్స్‌కు కపిల్‌ శర్మ షోలో నటించే అవకాశం దక్కింది. 2019లో జూన్‌ 9న ద కపిల్‌ శర్మ షోలో పొరిగింటి అమ్మాయిల్లా నటిస్తూ హాస్యాన్ని రసవత్తరంగా పండించి ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో చింకీ మింకీలు మరింత ఫేమస్‌ అయ్యారు. ఆ తరువాత ‘నాగిని’ సీరియల్, ‘కాలేజీ డ్రామా’ సిరీస్‌లో డబుల్‌ ట్రబుల్‌ ఎపిసోడ్‌లో రవీనా అండ్‌ కరిష్మా పాత్రలలో చక్కగా నటించారు. వీటితో పాటు టీవీ సీరీస్‌ అయిన ‘హీరో గాయబ్‌ మోడ్‌ ఆన్‌ ఎలాంగిసైడ్‌ అభిషేక్‌ నిగమ్‌’ వంటి కార్యక్రమం లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 


లిప్‌సింక్‌ కామెడీ

గ్లామర్‌గా కనిపించడంలో ఎక్కడా తగ్గని ఈ ట్విన్‌ బ్యూటీస్‌కు యూట్యూబ్‌ ఛానల్‌లో కూడా మంచి ఫాలోయింగ్‌ ఉంది. వ్యంగంతో కూడిన వీడియోలు, లిప్‌ సింక్‌ కామెడీ ప్రదర్శన, డ్యాన్సింగ్‌ వీడియోలను తమ ‘చింకీ మింకీ’ యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్టు చేసి సోషల్‌ మీడియా సెన్సెషన్‌గా మారారు. ప్రస్తుతం వీరి ఛానల్‌ను ఫాలో అయ్యే సబ్‌స్కైబర్స్‌ సంఖ్య రెండున్నర కోట్లుగా ఉంది. ఎక్కువగా మ్యాచింగ్‌ డ్రెస్‌లు, ఫోటో షూట్స్, వారు ఏంచేస్తున్నారో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తూ ఫాలోవర్స్‌ని ఆకట్టుకుంటున్నారు. తమకున్న కవలల రూపానికి కాస్త సృజనాత్మకత జోడించి సమయ స్ఫూర్తితో కామెడీ చేస్తూ ఆదాయంతోపాటు ఆదరణ పొందుతున్నారు చింకీ మింకీలు.  

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు