Mallika Srinivasan: ట్రాక్టర్‌ మహారాణి

18 Jan, 2022 02:12 IST|Sakshi

విజయానికి వయసు అడ్డు పడుతుందా?
వయసు అనేది ఒక నెంబర్‌ మాత్రమే అని చెబుతూ తమను తాము నెంబర్‌ వన్‌గా నిరూపించుకున్న మహిళలు  ఉన్నారు.
‘మహిళలకు పరిమితులు ఉన్నాయి’ అంటూ ఎక్కడైనా అడ్డుగోడలు ఎదురొచ్చాయా?

ఆ అడ్డుగోడలను బ్రేక్‌ చేసి, కొత్త మార్గం వేసి దూసుకుపోయి తమను తాము నిరూపించుకున్న మహిళలు ఉన్నారు.
తమ శక్తియుక్తులతో భవిష్యత్‌ను ప్రభావితం చేసే ఎంతోమంది మహిళలు ఉన్నారు.
ఫోర్బ్స్‌ ‘50 వోవర్‌ 50: ఆసియా 2022’లో మెరిసిన మహిళా మణులలో మన మల్లికా శ్రీనివాసన్‌ ఉన్నారు.

మల్లికా శ్రీనివాసన్‌... అనే పేరుతో పాటు కొన్ని విశేషణాలు కూడా సమాంతరంగా ధ్వనిస్తాయి. అందులో ముఖ్యమైనవి... ‘ట్రాక్టర్‌ క్వీన్‌’  ‘మోస్ట్‌ పవర్‌ఫుల్‌ సీయివో’
ట్రాక్టర్‌ ఇండస్ట్రీని మేల్‌ డామినేటెడ్‌ ఇండస్ట్రీగా చెబుతారు. అలాంటి ఇండస్ట్రీలో విజయధ్వజాన్ని ఎగరేఓఆరు. కంపెనీని ప్రపంచంలో మూడో స్థానంలో, దేశంలో రెండో స్థానంలో నిలిపారు.
‘ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది’ అంటారుగానీ అది అన్ని సమయాల్లో నిజం కాకపోవచ్చు. పెద్ద వ్యాపార కుటుంబానికి చెందిన మల్లికకు చిన్న వయసు నుంచే వ్యాపార విషయాలపై ఆసక్తి. తనకు సంగీతం అంటే కూడా చాలా ఇష్టం.

‘ఇది ఏ రాగం?’ అని కమనీయమైన రాగాల గురించి తెలుసుకోవడంలో ఎంత ఆసక్తో, జటిలమైన వ్యాపార సూత్రాల గురించి తెలుసుకోవడంపై కూడా అంతే ఆసక్తి ఉండేది. ‘యూనివర్శిటీ ఆఫ్‌ మద్రాస్‌’ నుంచి ‘ఎకనామెట్రిక్స్‌’లో గోల్డ్‌మెడల్‌ అందుకున్న మల్లిక ప్రతి విజయం వెనుక కొన్ని ‘గోల్డెన్‌ రూల్స్‌’ ఉంటాయని బలంగా నమ్ముతారు.
ఆ సూత్రాలు పుస్తకాల్లో తక్కువగా కనిపించవచ్చు.

సమాజం నుంచే ఎక్కువగా తీసుకోవాల్సి రావచ్చు.
చదువుల్లో ఎప్పుడూ ముందుండే మల్లిక పుస్తకాల్లో నుంచి ఎంత నేర్చుకున్నారో, సమాజం నుంచి అంతకంటే ఎక్కువ నేర్చుకున్నారు. వాటిని ఆచరణలో పెట్టారు.
ట్రాక్టర్స్‌ అండ్‌ ఫామ్‌ ఎక్విప్‌మెంట్‌ లిమిటెడ్‌ (టఫే–(చెన్నై) లో జనరల్‌ మేనేజర్‌గా మొదలయ్యారు మల్లిక. ఆ తరువాత చైర్‌పర్సన్‌ అయ్యారు. జనరల్‌ మేనేజర్‌ నుంచి చైర్‌పర్సన్‌ వరకు ఆమె ప్రస్థానంలో ప్రతికూల పరిస్థితులు ఎదురై ఉండవచ్చు. అయితే జటిలమైన సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు కనుక్కోవడంలో ఆమె ఎప్పుడూ చురుగ్గా ఉంటారు.

‘మీ లక్ష్యం ఏమిటి?’ అని అడిగితే ఆమె చెప్పే సమాధానం...
‘నాకో మంచి ట్రాక్టర్‌ కావాలి...అనుకునే ప్రతి రైతు మొదట మా ట్రాక్టర్‌ వైపే చూడాలి’
కేవలం వ్యాపార విషయాల గురించి మాత్రమే కాకుండా సమాజసేవపై కూడా దృష్టి పెడుతుంటారు మల్లిక. పేదలకు వైద్యం అందించే వైద్యసంస్థలు, విద్యాసంస్థలకు ఆర్థికసహాయాన్ని అందిస్తున్నారు. సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యతను నెరవేరుస్తున్నారు.
 

మరిన్ని వార్తలు