విపరీతమైన తలనొప్పి అనడంతో స్కాన్‌ చేసి చూడగా..విస్తుపోయిన వైద్యులు!

29 Nov, 2023 16:44 IST|Sakshi

కొన్ని ఘటనలు చాలా ఆశ్చర్యకరంగా అంతు చిక్కని మిస్టరీల్లా ఉంటాయి. ఏదైన వస్తువులను చిన్నపిల్లలు అయితే తెలియక మింగడం లేదా చెవుల్లోనూ, ముక్కులోనూ పెట్టుకోవడం జరుగుతుంది. అదే పెద్ద వాళ్ల శరీరాల్లో అలాంటి చిన్న వస్తువులు కనిపిస్తే ఇదేలా సాధ్యం అనిపిస్తుంది. ఇక్కడొక వ్యక్తి విషయంలో అలానే జరిగింది. స్కాన్‌ చేసి చూసిన వైద్యులు కూడా విస్తుపోయారు

వియత్నాంకు చెందిన ఓ వ్యక్తి విపరీతమైన తలనొప్పితో గత ఐదు నెలలుగా బాధపడుతున్నాడు. పలు వైద్య పరీక్షలు నిర్వహించి అతడు టెన్షన్‌కి సంబంధించిన న్యూమోసెఫాలస్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు డాక్టర్లు. ఈ అరుదైన న్యూరోలాజికల్‌ పరిస్థితి కాస్త ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు పేర్కొన్నారు. నివారించేందుకు చికిత్సలో భాగంగా రోగి శరీర స్థితి గురించి క్షుణ్ణంగా స్టడీ చేస్తున్నారు. ఆ క్రమంలోనే సిటీస్కాన్‌లు నిర్వహించగా బ్రెయిన్లో ఉన్న ఆ వస్తువుని చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు వైద్యులు.

రెండు చాప్‌స్టిక్‌లు అతని మెదడులో ఇరుక్కుని ఉన్నట్లు గుర్తించారు. అసలు అవి మెదడు వరకు ఎలా చేరాయనేది వైద్యులకు ఓ మిస్టరీలా అనిపించింది. ఆ పేషెంట్‌కి కూడా ఈ విషయం చెప్పగా.. ఐదు నెలల క్రితం జరిగిన ఘటనను గుర్తు తెచ్చుకుంటూ..ఓ రోజు రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడూ జరిగిన గొడవలో ముఖంపై ఏదో వస్తువుతో గుచ్చినట్లు గుర్తు.. కానీ అది జరిగే చాలారోజులు అయ్యిందని చెప్పాడు. ఐతే అప్పుడు తనకు ఎలాంటి సమస్య, ఇబ్బంది గానీ అనిపించలేదని చెప్పుకొచ్చాడు ఆ వ్యక్తి.

దీంతో వైద్యులు పేపెంట్‌ ముక్కుని పరిశీలించగా..చాప్‌స్టిక్‌ గుచ్చిన గుర్తులు కనిపించడంతో ముక్కు ద్వారానే ఈ చాప్‌స్టిక్‌లు మెదడులోకి వెళ్లాయని నిర్థారణకు వచ్చారు. అదృష్టవశాత్తు ఆ పేషెంట్‌కి ఎండోస్కోపిక్‌ శస్త్ర చికిత్స ద్వారా వైద్యులు ఆ చాప్‌ స్టిక్‌లను విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. దయచేసి మీపై ఏదైనా దాడి జరిగినప్పుడూ పెద్ద దెబ్బలేం తగలలేదని నిర్లక్ష్యం చెయ్యొద్దని సూచిస్తున్నారు వైద్యులు. 

(చదవండి: ఎక్స్‌ట్రీమ్‌ వెయిట్‌ లాస్‌ స్టార్‌ జస్ట్‌ 40 ఏళ్లకే నూరేళ్లు.. బరువు తగ్గడం ఇంత ప్రమాదమా?)

మరిన్ని వార్తలు