సాధారణ ఉద్యోగిగా అడుగుపెట్టి..నేడు సంపన్న మహిళగా..!

13 Oct, 2023 06:58 IST|Sakshi

రాధ వెంబు విజయాన్ని చూసిన తరువాత ‘ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది’ అనే సుపరిచిత మాటకు అదనంగా మరో మాట చేర్చవచ్చు అనిపిస్తుంది. ‘ప్రతి పరిశ్రమ విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది’ సాధారణ ఉద్యోగిగా సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ ‘జోహో కార్పోరేషన్‌’లోకి అడుగు పెట్టిన రాధ వెంబు క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసి గెలుపు పాఠాలు తయారు చేసుకుంది. ప్రతిభావంతులైన సిబ్బందికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి బలమైన సైన్యాన్ని తయారు చేసింది. మీడియాలో, సోషల్‌ మీడియాలో ఎక్కువగా కనిపించని రాధ వెంబు ‘ఇన్‌విజిబుల్‌ ఫోర్స్‌’గా పేరు తెచ్చుకుంది. తాజాగా ‘360 వన్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2023’ లో చోటు సంపాదించి, బ్యూటీ అండ్‌ లైఫ్‌ స్టైల్‌ రిటైల్‌ కంపెనీ నైకా ఫౌండర్‌ ఫల్గుణి నాయర్‌ని దాటేసి మన దేశంలోని సంపన్న మహిళగా వార్తల్లో నిలిచింది....'

‘ఎన్నో విజయాలు సాధించిన రాధ వెంబు గురించి నేనెందుకు వినలేకపోయాను అనేది ఆశ్చర్యంగా అనిపిస్తుంది’ అంటూ ఒక సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లో రాశాడు జోహో కార్పొరేషన్‌ కన్సల్టెంట్‌ ఇంగ్లాండ్‌కు చెందిన ఆడిసన్‌. ఈ కన్సల్టెంట్‌కు మాత్రమే కాదు దేశంలో చాలామందికి ఆమె విజయాల గురించి తప్ప వ్యక్తిగత వివరాల గురించి తెలియదు.

‘సెల్ఫ్‌–మేడ్‌ ఉమన్‌’ అనేది ఆమె పేరు ముందు కనిపించే విశేషణం. ‘కామ్‌ అండ్‌ టాస్క్‌–ఓరియెంటెడ్‌’ అని సన్నిహితులు రాధ గురించి చెబుతుంటారు. చెన్నైలో పుట్టి పెరిగింది రాధ. తండ్రి మద్రాస్‌ హైకోర్టులో స్టెనోగ్రాఫర్‌. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(మద్రాస్‌) లో ఇండస్ట్రియల్‌ మేనేజ్‌మెంట్‌లో పట్టా పుచ్చుకుంది రాధ. ఆమె సోదరుడు శ్రీధర్‌ వెంబు ఆమెకు స్నేహితుడు, గురువు. టెక్‌ ఇండస్ట్రీ గురించి గంటల కొద్దీ మాట్లాడుకునేవారు. మన కంపెనీలను విదేశీ కంపెనీలతో పోల్చుతూ విశ్లేషించుకునేవారు.

తన సోదరులతో కలిసి సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ ‘జోహో కార్పొరేషన్‌’ మొదలు పెట్టింది రాధ వెంబు. అంతకుముందు ఉన్న శ్రీధర్‌ వెంబు కంపెనీ ‘అడ్వెన్‌ నెట్‌’ జోహో కార్పోరేషన్‌లో విలీనమైంది. మొదట్లో ఒక సాధారణ ఉద్యోగిగా ఆ సంస్థలో చేరింది రాధ వెంబు. క్షేత్రస్థాయి పరిస్థితులను లోతుగా అధ్యయనం చేయడానికి ఇది తనకెంతో ఉపయోగపడింది. ఆ తరువాత జోహో మెయిల్‌ ప్రాడక్ట్‌ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించింది. వేగంగా ఉన్నత హోదాలోకి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ చాలా సంవత్సరాల పాటు ప్రాడక్ట్‌ మేనేజర్‌గానే పనిచేసింది. పెద్ద పెద్ద సంస్థలతో పోటీ పడుతూ తమ కంపెనీని ముందు వరుసలో నిలిచేలా చేసింది.

‘కంపెనీకి సంబంధించిన సాంకేతికతను శక్తిమంతం చేయడానికి, కస్టమర్‌లను ఆశ్చర్యానందాలకు గురి చేయడానికి సంబంధించి ఎప్పుడూ ఆలోచిస్తుంటాను’ అంటుంది రాధ. ‘పని చేసే ప్రదేశంలో పక్షపాతానికి చోటు లేదు. ఆడా మగా అనే తేడా లేదు. ప్రతిభ ఒక్కటే ప్రమాణం’ అని నమ్మడమే కాదు ఆచరణలో నిరూపించింది రాధ. జోహో వర్క్‌కల్చర్‌ బాగా పాపులర్‌ అయింది. ఒక స్థాయికి చేరిన తరువాత టెక్‌ కంపెనీల హెడ్‌క్వార్టర్స్‌ విదేశాల బాట పడితే ‘జోహో’ మాత్రం మన దేశంలోని చిన్న పట్టణాలను ఎంచుకుంది. టెక్‌ రంగంలో పురుషాధిక్యతే ఎక్కువగా కనిపించే పరిస్థితులలో రాధా వెంబు ఎన్నో మూస ఆలోచనలను బద్దలు కొట్టింది. ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది.

‘నువ్వు కనిపించడం కాదు నీ ప్రాడక్ట్‌ కనిపించాలి. నువ్వు మాట్లాడడం కాదు నీ ప్రాడక్ట్‌ మాట్లాడాలి’ అనేది రాధ వెంబు నమ్మిన సిద్ధాంతం. పబ్లిసిటీ లేకపోతే పని జరగదు అని నమ్మే ఈ కాలంలోనూ ఆమె నమ్మిన సిద్ధాంతం నిలిచి గెలిచింది. తీరిక సమయాల్లో తోటపని చేసే రాధ వెంబుకు సామాజిక సేవాకార్యక్రమాలు అంటే ఇష్టం. ‘సంపన్నురాలిగా మారాలని టెక్‌ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేదు. నాకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిని ఆచరణలోకి తీసుకువచ్చి ఆ ఫలితాలతో సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో వచ్చాను’ అంటుంది రాధ వెంబు.

(చదవండి: రుచికి చూపెందుకు? చూపులేకపోయిన వంట అదుర్స్‌)
  

మరిన్ని వార్తలు