బాపూజీ బాటలో...

30 Jan, 2022 03:12 IST|Sakshi

నేడు మహాత్మా గాంధీ వర్ధంతి

మనసు పవిత్రం అయితే మాట కూడా పవిత్రమవుతుంది. దానికి మంత్రబలం లాంటిది వస్తుంది. బాపూజీ మాట ఎందరినో తమను తాము తెలుసుకునేలా చేసింది. తమ జీవితాన్ని కాంతి మంతమైన కొత్త బాటలోకి నడిపించుకు వెళ్లేలా చేసింది. దీనికి బలమైన ఉదాహరణ ఈ ముగ్గురు మహిళలు...

మెడెలిన్‌ స్లెడ్‌ మీరాబెన్‌గా ఎలా మారింది?
‘మెడె లిన్‌ స్లెడ్‌ ఎవరు?’ అంటే టక్కున గుర్తుకురాకపోవచ్చు. అయితే ‘మీరాబెన్‌’ అంటే మాత్రం గాం«ధీజీ గుర్తుకు వస్తారు. బ్రిటిష్‌ సైనిక అధికారి సర్‌ ఎడ్మండ్‌ కుమార్తె అయిన మెడె లిన్‌కు సంగీతం వినడం, పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. ఒకానొక సందర్భంలో ఫ్రెంచ్‌ రచయిత రోమైన్‌ రోలెండ్‌ గాంధీజీ జీవితంపై రాసిన పుస్తకం చదివింది. ఈ పుస్తకం తనను ఎంత ప్రభావితం చేసిందంటే ‘సబర్మతీ ఆశ్రమానికి రావాలనుకుంటున్నాను’ అని గాంధీజీకి లేఖ రాసింది.

‘తప్పకుండా రావచ్చు’ అని ఆహ్వానిస్తూనే ఆశ్రమ క్రమశిక్షణ వాతావరణాన్ని గుర్తు చేశారు గాంధీ. 1925లో అహ్మదాబాద్‌కు వచ్చింది మెడెలిన్‌. గాంధీజీలో ఒక దివ్యకాంతిని దర్శించింది. ఆ కాంతి తనను పూర్తిగా మార్చేసింది. మద్యపానం, మాంసాహారం మానేసేలా చేసింది. ‘భగవద్గీత’ అధ్యయనం ఆమె జీవితాన్ని వెలుగుమయం చేసింది. తన పేరు ‘మీరాబెన్‌’గా మారింది. ఉద్యమాల్లో భాగంగా గాంధీజీతో పాటు జైలుకు కూడా వెళ్లింది. ‘సేవాగ్రామ్‌’ ఏర్పాటులో కీలకపాత్ర పోషించింది. రిషికేష్‌కు సమీపంలో ‘పశులోక్‌ ఆశ్రమం’ ఏర్పాటు చేసింది. బాపు తనకు రాసిన ఉత్తరాలను పుస్తకంగా ప్రచురించింది.

కోట దాటి పేదల పేటకు వచ్చిన రాజకుమారి
అమృత్‌కౌర్‌ పెరిగిన వాతావరణానికి, ఆ తరువాత ఉద్యమకారిణి గా ఆమె జీవితానికి ఎక్కడా పొంతన కనిపించదు. కోటలో రాజకుమారి పేట పేటకు తిరిగి స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడానికి స్ఫూర్తి గాంధీజీ. కపూర్థలా రాజు హరినామ్‌సింగ్‌ కుమార్తె అయిన అమృత్‌కౌర్‌ ఇంగ్లండ్‌లో చదువుకుంది. గాంధీజీకి ఆమె ఎన్నో ఉత్తరాలు రాసేది. ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు ఆమె దిశను మార్చేసాయి. 1934లో గాంధీని  కలుసుకుంది. ఆ తరువాత ఆశ్రమంలో చేరింది.

తన ఖరీదైన రాచరిక జీవనశైలికి, ఆశ్రమ వాతావరణానికి బొత్తిగా సంబంధం లేదు. చాలా కష్టం కూడా అనిపించవచ్చు. కాని ఎండకన్నెరుగని రాజకుమారి సామాన్యురాలిగా మారి ఆ ఆశ్రమంలో సేవ చేసింది. గాంధీజీ వ్యక్తిగత కార్యదర్శిగా 16 సంవత్సరాలు పనిచేసింది. ఉప్పుసత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమంలో భాగంగా జైలుకు కూడా వెళ్లింది. గాంధీజీ తనకు రాసిన ఉత్తరాలు ‘లెటర్స్‌ టు రాజకుమారి’ పేరుతో పుస్తకంగా వచ్చింది.

వైద్యం నుంచి ఉద్యమం వరకు...
కుంజా (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది) అనే చిన్న నగరం లో జన్మించింది సుశీల నయ్యర్‌. ఆమెకు ప్యారేలాల్‌ అనే అన్న ఉండేవాడు. అన్నాచెల్లెళ్లకు గాంధీజీ తత్వం అంటే బాగా ఇష్టం. ఎప్పుడూ దాని గురించి చర్చించుకునేవారు. దిల్లీలో వైద్యవిద్యను అభ్యసించింది సుశీల. 1939లో తన సోదరుడిని ‘సేవాగ్రామ్‌’లో చేర్పించడానికి వచ్చింది. అలా గాంధీజీతో పరిచయం పెరిగింది.

పేదలకు ఆమె చేసే వైద్యసహాయం గాంధీజీ ప్రశంసలు అందుకునేలా చేసింది. క్విట్‌ ఇండియా ఉద్యమంలో భాగంగా జైలుకు కూడా వెళ్లింది. ఇదంతా వారి తల్లిదండ్రులకు మొదట్లో నచ్చలేదు. అయితే ఆ తరువాత కాలంలో వారి ఆలోచన విధానంలోనూ మార్పు వచ్చింది. మహత్మాగాంధీ: ఫైనల్‌ ఫైట్‌ ఫర్‌ ఫ్రీడమ్, మహాత్మాగాంధీ: సాల్ట్‌ సత్యాగ్రహ... మొదలైన పుస్తకాలు రాసింది  డా.సుశీల నయ్యర్‌.

మరిన్ని వార్తలు