శతక నీతి – సుమతి: అద్దం... అబద్ధం

27 Jun, 2022 00:35 IST|Sakshi

‘బలవంతుడనాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా/బలవంతమైన సర్పము చలిచీమల చేతి చిక్కి చావదే సుమతీ !’ అన్న సుమతీ శతకకారుడి నీతి సూత్రాన్ని చర్చించుకుంటున్నాం... నిజానికి ఏ కాలానికి ఆ కాలంలో పెద్దలు పిల్లలను మంచి మార్గంలో పెట్టడానికి ఇటువంటి హితోక్తులు చాలా చెబుతుంటారు. వాటిని విని అనుసరించిన వారు విచక్షణతో, వివేకంతో వారి జీవితాలను సుఖమయం చేసుకుంటుంటారు.

నందుల చరిత్ర తెలిసే ఉంటుంది.  కేవలం పొగరుబోతు తనంతో, అతిశయంతో  నిష్కారణంగా వైరం పెట్టుకొని మలయకేతు, పర్వతకుడు, వైరోచకుడు..ఇలా  ఎంతో మంది రాజులను అవమానించారు. ఆ క్రమంలోనే అన్నశాలలోకి అన్నం తినడానికి కూర్చొన్న చాణక్యుడిని అవమానకరంగా మాట్లాడారు. ఆయన చాలా గొప్పవాడు, మహావిద్వాంసుడు, మహా మేధావి అంటూ అందరూ చెబుతున్నా వినకుండా జుట్టుపట్టి ఈడ్పించారు నందులు. పిలక ఊడిపోయింది.. మిమ్మల్ని పదవీచ్యుతుడిని చేసేదాకా ఈ పిలక ముడి వేయను..  అని అక్కడే శపథం చేసాడు చాణక్యుడు.

చంద్రగుప్తుణ్ణి ముందు నిలబెట్టి నందుల చేతిలో అవమానం పొందిన రాజులందరినీ ఏకం చేసిన చాణక్యుడు వ్యూహరచన చేసిన యుద్ధంలో ఇంత గొప్ప నందులు ఏమయిపోయారు. మొత్తం వంశమే మిగలకుండా పోయింది. నందుల మీద అపార ప్రేమ కలిగిన మహా మేధావి ఒకాయన ఉండేవాడు. ఆయన పేరు రాక్షసుడు. చాణక్యుడికి ప్రతిభకు లొంగిపోయి చంద్రగుప్తుడికి ప్రధానమంత్రి అయ్యాడు.

చంద్రగుప్తుడు తన అభిరుచి మేరకు ఒక రాజభవనం కట్టించుకున్నాడు. మొత్తం సిద్ధమయిన తరువాత దానిలో ఉండడానికి చాణక్యుడి అనుమతి కోరాడు. ‘వీల్లేదు’ అని శాసించాడు రాజగురువు. చంద్రగుప్తుడు చిన్నాచితకా రాజేమీ కాదు... అప్పట్లో భారత దేశంలో వైభవంగా వెలిగిన మగధ సామ్రాజ్యాధిపతి. అంత గొప్ప రాజ్యానికి తిరుగులేని మహారాజయి ఉండి తను ఇష్టపడి కట్టించుకున్న ఇంట్లోకి పోవడానికి అనుమతి అడగడం, దాన్ని చాణక్యుడు తిరస్కరించిన వెంటనే సమ్మతించడం... సాధారణ విషయమేమీ కాదు. వినయం అంటే అదీ. చెప్పినంత సులువు కాదు అలా ఉండడం. మీరెప్పుడు అనుమతిస్తే అప్పుడే గృహప్రవేశం చేస్తానన్నాడు.

చాణక్యుడు కొంతమంది సైనికులను వెంటపెట్టుకుని ఆ మహాసౌధాన్ని అణువణువూ గాలిస్తున్నాడు. ఆంతరంగిక మందిరం వంటి ఒకగది నిండా పెద్ద పెద్ద అద్దాలు బిగించి ఉండడం చూసి అనుమానించాడు. పిలిచి అడిగాడు అక్కడివారిని.. అలంకారం కోసం పెట్టామని చెప్పారు. అంతకంటే గొప్ప అలంకారం రావడానికి నేను చిట్కా చెబుతానంటూ వాటిని తొలగించి చిత్తరువులు పెట్టమన్నాడు. అద్దాలు తొలగిస్తుంటే వాటి వెనుక గదులు, వాటిలో సాయుధులైన సైనికులు కనబడ్డారు. వెంటనే తన సైనికులతో వారిని తుదముట్టించాడు. చంద్రగుప్తుడు నిర్ఘాంతపోయాడు.

అద్దాలు గదినిండా ఉన్నప్పుడు లోనికి ప్రవేశించిన వారు తమ ప్రతిబింబాన్ని భిన్నకోణాలలో చూసుకుంటూ మురిసిపోతూ ఆదమరిచి ఉంటారు. ఆ క్షణాల్లో వెనుకనుంచి చంపేయడానికి రాక్షసుడు అనే మంత్రి చేసిన కుట్ర బట్టబయలయిపోయింది. చంద్రగుప్తుడు మహారాజయినా వినయంతో ప్రవర్తించినందుకు క్షేమంగా బయటపడ్డాడు. వాళ్లెంత, వీళ్ళెంత ...అని గర్వాతిశయంతో ధిక్కరించి నడుచుకొన్నందుకు నంద రాజులలో ఒక్కడంటే ఒక్కడూ మిగలలేదు. వీటిలో నీతిని గ్రహించాలి. మనకంటే గొప్పవాళ్లుంటారనే సత్యాన్ని గ్రహించి ఒదిగి ఉండడం నేర్చుకోవాలి.
బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా ...అంటూ బద్దెన గారిస్తున్న సందేశం కూడా అదే.

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

మరిన్ని వార్తలు