Monika Shergill: క్వీన్‌ ఆఫ్‌ కంటెంట్‌

30 May, 2023 01:00 IST|Sakshi
మోనిక షేర్‌గిల్‌

విజయ పథం

స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో సక్సెస్‌ అంటే సాధారణ విషయం కాదు. ఏ నిమిషానికి ఏ ట్రెండ్‌ వస్తుందో తెలియదు. అక్కడి ట్రెండ్‌ ఇక్కడ వర్కవుట్‌ అవుతుందో లేదో తెలియదు. సక్సెస్‌కు సవాలక్ష కారణాలు ఉంటాయి. అయితే అవేమీ చీకట్లో దాక్కున్నవి కావు. వెదుక్కుంటూ వెళితే ముందుకు వచ్చి పలకరిస్తాయి. మోనిక చేసిన పని అలా వెదుక్కుంటూ వెళ్లడమే! ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌గా ప్రయాణం మొదలు పెట్టిన మోనిక షేర్‌గిల్‌ ‘వైస్‌ ప్రెసిడెంట్, కంటెంట్, నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా’ స్థాయికి చేరుకోవడం అదృష్టం కాదు...తాను పడిన కష్టం. ఆ కష్టమే మోనిక షేర్‌గిల్‌ను ‘హై అండ్‌ మైటీ–50 పవర్‌పీపుల్‌’ జాబితాలో చేర్చింది....

నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా స్పీడ్‌ అందుకొని వ్యూ అవర్స్, రెవెన్యూ పెంచుకొని ప్రపంచస్థాయిలో సక్సెస్‌ సాధించింది. ‘దీనికి కారణం?’ అనే ప్రశ్నకు ఏకైక జవాబు నలభై తొమ్మిది సంవత్సరాల మోనిక షేర్‌గిల్‌. మోనిక చొరవ వల్ల ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. ప్రపంచానికి, ప్రతిభావంతులకు మధ్య ‘నెట్‌ఫ్లిక్స్‌’ను వారధిగా మలచడంలో మోనిక ఘన విజయం సాధించింది.
నెట్‌ఫ్లిక్స్‌ కోసం కంటెంట్‌ను ఎంపిక చేసుకోవడంలో మోనిక అనుసరించే ప్రమాణాల విషయానికి వస్తే...క్రైమ్‌ షోలలోని సంచలన ధోరణి కనిపించదు.

సబ్జెక్ట్‌లో ఉండే బలమే ప్రధాన ప్రమాణం అవుతుంది. దీనికి ఉదాహరణ ఆస్కార్‌ పురస్కారం గెలుచుకున్న డాక్యుమెంటరీ ఫిల్మ్‌... ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌. ‘‘ఎంటర్‌టైన్‌మెంట్‌ బిజినెస్‌లో ఎప్పుడూ రిస్క్‌ పొంచి ఉంటుంది. ప్రేక్షకుల అభిరుచిని కచ్చితంగా పసిగట్టడం కష్టమే. కరోనా కల్లోల సమయం ప్రేక్షకుల ఆలోచనధోరణిలో మార్పు తీసుకువచ్చింది. కంటెంట్‌ విషయంలో తమ భాష, ప్రాంతానికి మాత్రమే పరిమితం కావడం లేదు.

ప్రపంచవ్యాప్తంగా వస్తున్న కంటెంట్‌పై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ‘ఏది నిజం? ఏది కల్పన?’ అనే విషయంలో వారికి స్పష్టత ఉంది. వ్యాపార విజయం అనేది వారికి సంబంధం లేని విషయం. వారి దృష్టి మొత్తం కథ పైనే ఉంటుంది’’ అంటున్న మోనిక విజయాల గురించి ఆనందించడమే కాదు నిరాశపరిచిన కంటెంట్‌ విషయంలో సమీక్ష చేసుకోవడంలో ముందుంటుంది. రొమాంటిక్‌ హిందీ–కామెడీ ఫిల్మ్‌ ‘మీనాక్షి సుందరేశ్వర్‌’ నిరాశపరిచింది. దీనికి కారణం సరిౖయెన నటీనటులను ఎంపిక చేసుకోకపోవడం.

కథ సరిగ్గా ఉండగానే సరిపోదు కాస్టింగ్‌ కూడా సరిగ్గా ఉండాలని, ఎక్కడా రాజీపడకూదనే గుణపాఠాన్ని ఆ చిత్రం నుంచి నేర్చుకుంది మోనిక. పోస్ట్‌–పాండమిక్‌ ఆడియెన్స్‌ ఇంటర్నేషనల్‌ స్టోరీలను ఇష్టపడుతున్నారు. జర్మన్‌ షో ‘డార్క్‌’ మనదేశంలో హిట్‌ కావడం దీనికి నిదర్శనం. ఆ సమయంలో... ‘వేరే దేశం కథలు మన దగ్గర విజయం సాధించినప్పుడు, మన దేశంలోని ఒక ప్రాంతానికి చెందిన కథలు మరొక ప్రాంతంలో ఎందుకు విజయం సాధించవు’ అంటూ ఆలోచన చేసింది మోనిక. తాను నమ్మింది ‘కాంతార’ హిందీ వెర్షన్‌ విజయంతో నిజం అయింది.

సక్సెస్‌ ముఖ్యమే కాని వేలం వెర్రి జోలికి వెళ్లదు మోనిక. ‘కొరియన్‌ భాషలో గ్లోబల్‌ బ్రేక్‌ఔట్‌ షోలు ఉన్నాయి. అలా మనం కూడా సాధించాలి అనుకున్నంత మాత్రాన అది సాధ్యపడదు. ఆ షోలో ఉన్న వినూత్నమైన ఐడియా, దాని చుట్టూ ముడిపడి ఉన్న ఎన్నో అంశాలు గ్లోబల్‌ బ్రేక్‌ఔట్‌కు కారణం కావచ్చు. మనదైన ఆలోచన చేసి విజయం సాధించాలిగానీ ఫలాన షోలాగా ఉండాలి అని ప్రయత్నిస్తే విజయం మాట ఎలా ఉన్నా నిరాశ మాత్రమే మిగులుతుంది. ర్యాట్‌రేస్‌ ఇష్టపడను.

ఆ రేసులో పడితే ఆయాసమే మిగులుతుంది తప్ప ఆలోచన మిగలదు’ అంటోంది  మోనిక. కొంతకాలం క్రితం ట్రెండ్స్‌కు నిర్దిష్టమైన టైమ్‌ అంటూ ఉండేది. అర్థం చేసుకోవడానికైనా, అందిపుచ్చుకోవడానికైనా అది బాగా సరిపోయేది. కాని ఇప్పటి పరిస్థితి వేరు. ట్రెండ్స్‌ వేగంగా మారుతున్నాయి. ఒక దేశంలో ట్రెండ్‌గా ఉన్నది ఇక్కడ వర్కవుట్‌ అవుతుందో లేదో తెలియదు....ఇలాంటివి ఎన్నో దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళుతుంది మోనిక షేర్‌గిల్‌.  అందుకే ఆమె పేరు ముందు ‘క్వీన్‌ ఆఫ్‌ కంటెంట్‌’ అనే విజయధ్వజం రెపరెపలాడుతోంది.

మరిన్ని వార్తలు