కలెక్టరేట్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం

Published Tue, May 30 2023 1:04 AM

-

ఏలూరు(మెట్రో): తన సమస్యకు పరిష్కారం లభించడం లేదంటూ ఓ మహిళ కలెక్టరేట్‌ ప్రాంగణంలో సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పురుగుల మందు తాగడంతో బంధువులు వెంటనే ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం వెలమపేటకు చెందిన కొప్పిశెట్టి నాగరత్నానికి ఇంటి స్థలం లేకపోవడంతో 8 ఏళ్ల క్రితం అప్పటి ప్రజా ప్రతినిధులు స్థలం కేటాయించారు. ఆ స్థలం అప్పటికే దొనేపూడి సూరిబాబు, దమయంతిలకు కేటాయించగా.. వారిద్దరూ మరణించడం, వారికి వారసులు లేకపోవడంతో ఆ స్థలం ఖాళీగా ఉండేది. దాంతో నాగరత్నానికి కేటాయించారు. ఆమె ఇల్లు నిర్మించుకునేందుకు బేస్‌మెంట్‌ వేసింది. ఏప్రిల్‌ 22న అమలాపురానికి చెందిన ఓ వ్యక్తి వచ్చి స్థలం తన అత్తదని, ఖాళీ చేయాలని బెదిరించాడు. సమస్యపై స్పందనలో నాగరత్నం ఫిర్యాదు చేసింది. ఈ లోగా సదరు వ్యక్తి జేసీబీతో నాగరత్నం వేసిన బేస్‌మెంట్‌ను, ఇల్లును తొలగించాడు. సోమవారం స్పందనలో ఫిర్యాదుచేసేందుకు వచ్చిన నాగరత్నం కలెక్టర్‌కు సమస్యను వివరించి, అనంతరం బయటకు వచ్చి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్సపొందుతున్న ఆమెను ఆర్డీవో పెంచల కిషోర్‌, తహసీల్దార్‌ స్లీవజోజి పరామర్శించారు. సమస్య పరిష్కరిస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.

ఆర్టీసీ బస్సులో బంగారం చోరీ

జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం నుంచి తెలంగాణ రాష్ట్రం భద్రాచలం వెళుతున్న భద్రాచలం డిపో బస్సులో ప్రయాణికుల నుంచి ఒక మహిళ బంగారాన్ని కాజేసింది. జంగారెడ్డిగూడెం డిపో నుంచి బస్సు బయలుదేరిన కొద్ది నిమిషాలకే బంగారం పోయిన విషయం ప్రయాణికులు గుర్తించారు. దీంతో డ్రైవర్‌ బస్సును పోలీస్‌స్టేషన్‌ వద్దకు తీసుకువచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రయాణికులను పోలీసులు తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో అంజలి ప్రసన్నకు చెందిన రెండు కాసుల బంగారు తాడు, లక్ష్మీలావణ్య నుంచి మరో రెండు కాసుల బంగారు చైన్‌ చోరీకి గురైంది. దీంతో అనుమానితులైన ఇద్దరు మహిళలను పోలీసులు తనిఖీ చేయగా, ఒక మహిళ నుంచి రెండు కాసుల బంగారు తాడు గుర్తించారు. ఆ బంగారు తాడు అంజలి ప్రసన్నదిగా గుర్తించి ఆమెకు అప్పగించారు. మిగిలిన బంగారు ఆభరణం గురించి పోలీసులు విచారిస్తున్నారు.

గోపాలరెడ్డికి మ్యాజిక్‌ మాస్టర్‌ అవార్డు

తణుకు టౌన్‌: తేతలి జెడ్పీ హైస్కూల్‌లో జీవశాస్త్ర ఉపాధ్యాయుడు, మెజీషియన్‌ బీఎం గోపాలరెడ్డికి సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ సన్‌షైన్‌ హాస్పిటల్‌, సూర్యచంద్ర ఎల్డర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో మ్యాజిక్‌ మాస్టర్‌ అవార్డు ప్రదానం చేశారు. ఈ మేరకు ఆయన వివరాలు తెలిపారు. ఈ నెల 28న సికింద్రాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో 2023 సంవత్సరానికి తనకు ఈ అవార్డు ప్రదానం చేసినట్లు తెలిపారు. అవార్డు ప్రదానోత్సవంలో ఏసీపీ రామ్‌దాస్‌ తేజ, రిటైర్డ్‌ జడ్జి బీ మధుసూదన్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌ పల్లె మోహన్‌చంద్ర, డాక్టర్‌ బీఎల్‌ఎన్‌ రాజు నుంచి అవార్డు అందుకున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement