స్వర్ణలత ఈ స్థాయికి ఎదగడం చిన్న విషయం కాదు!

3 Dec, 2021 00:18 IST|Sakshi

ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం

చెవులు వినపడవు. ‘పాపం ఈ పిల్లను ఎవరు చేసుకుంటారు?’ కళ్లు కనిపించవు. ‘అయ్యో. ఎలా బతుకుతుంది’ నడవలేదు. ‘జన్మంతా అవస్థే’ దివ్యాంగులపై జాలి, సానుభూతి రోజులు పోయాయి. వాటిని ఉచితంగా పడేస్తే అదే పదివేలు అని మహిళా దివ్యాంగులు అనుకోవడం లేదు.

మేము సాధిస్తాం.. మేము జీవిస్తాం... ఈ జగత్తు మాది కూడా అని ముందుకు సాగుతున్నారు. స్వర్ణలత ఒక ఉదాహరణ. మస్క్యులర్‌ డిజార్డర్‌ వల్ల వీల్‌చైర్‌కు పరిమితమైనా గాయనిగా, రచయితగా, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలిగా, మోటివేషనల్‌ స్పీకర్‌గా గుర్తింపు పొందింది. ఆమె స్ఫూర్తిదాయక పరిచయం ఇది.

జీవితం ఒక్కోసారి అడుగు ముందుకు పడనివ్వదు. మరోసారి శరీరం కదలిక కోల్పోయి ముందుకు అడుగు పడనివ్వదు. కాని జీవితంలో కాని, శరీరం మొరాయించినప్పుడు కాని మొండి పట్టుదలతో ముందుకు సాగితే దారి కనిపిస్తుంది. గమ్యం కనిపిస్తుంది. గమనంలో తోడు నిలిచేవాళ్లుంటారని తెలిసి వస్తుంది. అచలనంలో జీవితానికి సార్థకత లేదని చలనంలోనే పరమార్థం ఉందని అర్థమవుతుంది.

దివ్యాంగులు గతంలో న్యూనతతో ఇంటికి పరిమితమయ్యేవారు. నలుగురిలో వచ్చేవారు కాదు. ఇక ఆ దివ్యాంగులు స్త్రీలైతే మానసిక కుంగుబాటుతో ముడుచుకుపోయేవారు. కాని ఆ రోజులు పోయాయి. ‘మనల్ని మనలాగే మన శారీరక పరిమితులతోనే గౌరవించేలా ఈ సమాజంలో మార్పు తేవాలి. ఒకరిపై ఆధారపడకుండా మన జీవితాన్ని జీవించాలి. నలుగురికీ స్ఫూర్తినివ్వాలి’ అని మహిళా దివ్యాంగులు ముందుకు సాగుతున్నారు.

జాలి చూపులు, సానుభూతి మాటలు... ఇవి అక్కర్లేదు... ఈ సమాజంలో దివ్యాంగులు ఒక భాగమని గుర్తించి... ఈ జగత్తులో తమ వాటా చోటును మాకు వదిలిపెట్టి... అందరూ తిరుగాడే చోటుల్లో తాము కూడా అడుగుపెట్టేలా సౌకర్యాలు ఉంచితే చాలు అని అంటున్నారు. పెద్ద ఉద్యోగాలు, డాక్టర్‌ చదువులు, ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారు. వీల్‌చైర్‌కు పరిమితమైనా ఆలోచనలకు రెక్కలు ఇస్తున్నారు.

స్వర్ణలత– మల్టిపుల్‌ స్ల్కెర్లోసిస్‌
స్వర్ణలత వేదిక మీదకు వస్తే చాలు కరతాళధ్వనులు వినిపిస్తాయి. ఎందుకు? ఆమె మోటివేషనల్‌ స్పీకర్‌. ‘చూడండి... నేను వీల్‌చైర్‌లో ఉన్నాను. 80 శాతం నా శరీరంలో కదలిక లేదు. మీరు నూరు శాతం కదల వీలైన శరీరంతో ఆరోగ్యంగా ఉన్నారు. నేను నా పరిమిత కదలికల్లోనే సమాజం కోసం ఇంత చేస్తుంటే మీరు ఎంత చేయాలి?’ అని ఆమె ప్రశ్నిస్తే వింటున్నవారు చప్పట్లు కొడుతూ ఇన్‌స్పైర్‌ అవుతారు.

కాని స్వర్ణలత ఈ స్థాయికి ఎదగడం చిన్న విషయం కాదు. బెంగళూరులో జన్మించిన స్వర్ణలత చిన్నప్పుడు ఆరోగ్యంగా ఉండేది. బాగా చదువుకుందామనుకుంది. కాని దిగువ మధ్యతరగతి కుటుంబం ఆమెను అడుగు పడనివ్వక కంప్యూటర్స్‌లో డిప్లమా చాల్లే అని ఆపేసింది. ఆ తర్వాత ఆమె ప్రేమించిన కుర్రాణ్ణి పెళ్లి చేసుకుంటే వెలి వేసి ఇంటికి రాకుండా ఆపేసింది.

జీవితం ఇలా నిరోధిస్తుంటే పెళ్లయ్యి పాప పుట్టాక 2009లో ఆమెకు హటాత్తుగా మెడ దిగువల పక్షవాతం వచ్చింది. డాక్టర్లు పరీక్షించి దాని పేరు ‘మల్టిపుల్‌ స్ల్కెర్లోసిస్‌ అన్నారు. అంటే మెడ కింద వెన్ను ప్రాంతంలో కండరాల ఇబ్బంది వచ్చి శరీరం చచ్చుబడుతుంది. చిన్న పాప, ఏం చేయాలో తోచని భర్త. కాని స్వర్ణలత ధైర్యం చెప్పింది. ‘ఏం కాదు... పోరాడదాం’ అంది. తనకు ధైర్యం రావాలంటే తనలాంటి వారికి మేలు చేయాలని అనుకుంది.

తనలాంటి వారిని గుర్తించి
వెంటనే మల్టిపుల్‌ స్ల్కెర్లోసిస్‌ వచ్చిన తనలాంటి వారిని గుర్తించేలా ‘స్వర్గ ఫౌండేషన్‌’ స్థాపించింది స్వర్ణలత. కర్నాటక, తమిళనాడుల్లో ఈ వ్యాధితో బాధ పడేవారి గురించి పని చేయసాగింది. వారికి అందాల్సిన వైద్యం, ఉండవలసిన అవగాహన, కుటుంబ సభ్యులు ఎలా చూసుకోవాలి, వీల్‌చైర్‌లో ఉంటూనే జీవితంపై ఆశ కలిగి బతికే ఉపాధి ఎలా పొందాలి... ఇలాంటి విషయాలన్నీ ఈ స్వర్గ ఫౌండేషన్‌ చూస్తుంది.

అంతే కాదు పబ్లిక్‌ ప్లేసులలో దివ్యాంగుల రాకపోకలకు అనువుగా ఉండేలా ర్యాంప్‌ల నిర్మాణం చేపట్టేలా సమాజాన్ని, పాలనా వ్యవస్థని అని సెన్సిటైజ్‌ చేస్తుంది. ‘కోయంబత్తూరులో దాదాపుగా అన్ని పబ్లిక్‌ ప్లేసుల్లో ర్యాంప్‌లు వచ్చేలా చూశాం. బడి కాని ఆస్పత్రి కాని దివ్యాంగులు సౌకర్యంగా వెళ్లి రావచ్చు’ అంటుంది స్వర్ణలత. కాని దివ్యాంగుల పట్ల సమాజం ఎంతో మారాల్సి ఉంది. రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లు, రెస్టరెంట్లు, థియేటర్లు.. ఎన్నో వారి రాకపోకలకు వీలుగా లేవు. ఈ జగత్తు వారిది కూడా. వారు అందరిలానే అన్ని సౌకర్యాలు పొందుతూ జీవించేలా చూసే బాధ్యత మనది కూడా. ఆ విధంగా ఆలోచిద్దాం.
    

‘సారథి’లాంటి వాహనం
స్వర్ణలత తన ఫౌండేషన్‌ తరఫున చేసిన మరో మంచి పని ‘సారథి’ పేర ఒక వాహనాన్ని తయారు చేయడం. ఇందులో దివ్యాంగులు తమ వీల్‌చైర్‌తో చాలా వీలుగా ప్రవేశించవచ్చు. లోపల సోఫా, బెడ్‌ ఉంటాయి. అంతేకాదు వేడి నీళ్ల బాత్‌రూమ్, టాయిలెట్‌ ఉంటాయి. ఇబ్బంది పడకుండా ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు. ‘ఈ సారథిని ఉపయోగించుకుని ఒక దివ్యాంగుడు మూడేళ్ల తర్వాత తన తల్లిని చూడటానికి వెళ్లాడు. ఒక 90 ఏళ్ల ఆమె ఎన్నేళ్లగానో చూడాలనుకున్న పుణ్యక్షేత్రానికి వెళ్లి వచ్చింది. నిజానికి ఇలాంటి వాహనాలు ప్రతి ఊళ్లో ఉండాలి. ప్రభుత్వాలు ప్రవేశ పెట్టాలి. వీటిని ఫీజుతో, పేదలకు తక్కువ చార్జీలతో ఉపయోగించవచ్చు’ అంటుంది స్వర్ణలత.

మరిన్ని వార్తలు