ఆటలు ఆడేదెట్లా .. ! | Sakshi
Sakshi News home page

ఆటలు ఆడేదెట్లా .. !

Published Sun, Nov 5 2023 1:44 AM

కాటారం మండలం గుండ్రాత్‌పల్లిలో పిచ్చి మొక్కలమయంగా మారిన క్రీడా ప్రాంగణం - Sakshi

కాటారం: గ్రామీణ యువతలో క్రీడా నైపుణ్యతను పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటుచేసిన క్రీడా ప్రాంగణాలు అలంకారప్రాయంగా మారిపోయాయి. లక్షల రూపాయలు ఖర్చుచేసి నిర్మించగా.. బోర్డుల ఏర్పాటుతో ఆరంభశూరత్వాలుగా మిగిలిపోయాయి. క్షేత్రస్థాయిలో నిర్వహణ లోపించడంతో నిరుపయోగంగా మారిపోయాయి. క్రీడా ప్రాంగణాల స్థలాలను చదును చేయించకుండా వదిలివేయడంతో ఇటీవల కురిసిన వర్షాలకు పిచ్చిమొక్కలు విరివిగా పెరిగి మైదానాల రూపురేఖలు మారిపోయాయి. ప్రాక్టీస్‌ కాదు కదా.. కనీసం అందులో కాలుపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. క్రీడా సామగ్రి అందుబాటులో ఉన్నప్పటికీ ఆటలు ఆడలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ఉపాధిహామీ నిధులతో..

ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రభుత్వం గ్రామానికి ఒక క్రీడా ప్రాంగణం ఏర్పాటుచేసింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వ స్థలంలో ఎకరం, అరెకరం, 20 గుంటలు, 10 గుంటలను కేటాయించింది. ఆటలకు అనువుగా చదును చేసి చుట్టూ ఫెన్సింగ్‌ వేసి గేట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ సంబంధిత అధికారులు ఇవేం చేయకుండా స్థలం వద్ద కేవలం పెద్ద నేమ్‌ బోర్డులు పెట్టి వదిలేశారు. చాలా గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఊరికి దూరంగా, అడవికి సమీప ప్రాంతాల్లో ఏర్పాటుచేశారు. ప్రాక్టీస్‌కు దూరభారం కావడంతో క్రీడాకారులు ఆసక్తి కనబర్చడం లేదు. క్రీడా ప్రాంగణాలకు కేటాయించిన స్థలాల్లో గుట్టలు, రాళ్లు ఉన్నప్పటికీ అధికారులు వాటిని తొలగించకుండానే అధికారులు ఆర్చీలను పెట్టి క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు.

జిల్లాలో 312 క్రీడా ప్రాంగణాలు..

జిల్లాలోని 12 మండలాల్లో 312 క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. ఇప్పటివరకు సుమారు 250 వరకు మైదానాలను ఏర్పాటు పూర్తిచేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఏ గ్రామంలోని క్రీడా ప్రాంగణం కూడా వినియోగంలో ఉన్న దాఖలాలు లేవు. కాటారం మండలం గుండ్రాత్‌పల్లిలో ఏర్పాటుచేసిన క్రీడా ప్రాంగణం పిచ్చిమొక్కలమయంగా మారిపోయింది. విలాసాగర్‌ ప్రభుత్వ పాఠశాలను ఆనుకొని ఇరుకు ప్రదేశంలో ఏర్పాటుచేసిన క్రీడా మైదానం నిరుపయోగంగా ఉంది. మల్హర్‌ మండలం కొండంపేట క్రీడా ప్రాంగణం చెరువును ఆనుకొని ఏర్పాటు చేశారు. టేకుమట్ల మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడంతో ఇబ్బందిగా మారింది. చిట్యాల మండలంలో ఏలేటి రామయ్యపల్లి గ్రామంలో చెరువు కట్టపై క్రీడాప్రాంగణం ఏర్పాటు చేయడంతో ఆటలు ఆడేలా లేదు. మహాముత్తారం మండలం వజినపల్లె, యామన్‌పల్లిలో చెరువు సమీపంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడంతో నిరుపయోగంగా మారింది. ఇలా పలు మండలాల్లో శ్మశానవాటికలకు సమీపంలో, చెరువు కట్టలపైన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి అధికారులు మమా అనిపించారు.

క్రీడా కిట్లు పంపిణీ..

తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటులో భాగంగా ప్రతి గ్రామానికి క్రీడా కిట్లు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఇటీవల ప్రభుత్వం జిల్లాకు క్రీడా కిట్లను సరఫరా చేసింది. ఇందులో క్రికెట్‌ కిట్‌, బ్యాట్లు, గ్లౌజెస్‌, ప్యాడ్స్‌, వాలీబాల్‌, కొలతల టేపులు, మూడు జతల డంబుల్స్‌, డిస్కస్‌ త్రో, నాలుగు స్కిపింగ్‌ రోప్స్‌, విజిల్స్‌, వాచ్‌లు, టీషర్టులు ఉంటాయి. జిల్లాకు 354 క్రీడా కిట్లు రాగా పలు మండలాలకు పంపిణీ చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో కొన్నిచోట్ల కిట్ల పంపిణీ నిలిపివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. క్రీడా మైదానాలే సరిగా లేకపోవడంతో కిట్లతో ఏం లాభం అని పక్కన పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.

అలంకారప్రాయంగా క్రీడాప్రాంగణాలు

పిచ్చిమొక్కలతో నిండిపోయిన ఆటస్థలాలు

లక్షలాది రూపాయలు వృథా..

Advertisement
Advertisement