మొలల నివారణా అదే... ప్రాథమిక చికిత్సా అదే!!

10 Jul, 2022 08:20 IST|Sakshi

తాజా ఆకుకూరలతో పాటు ఆహార ధాన్యాల్లో పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకుంటే అవే మొలలకు నివారణగానూ, తొలి (ప్రాథమిక) చికిత్సగానూ ఉపయోగపడతాయని వైద్యులు, ఆహారనిపుణులు పేర్కొంటున్నారు. మలద్వారం వద్ద రక్తనాళాలు బుడిపెల్లాగా ఉబ్బి, అక్కడేదో ఉన్నట్లుగానూ, ఒక్కోసారి స్పర్శకు తెలుస్తుండటాన్ని మొలలుగా చెబుతారు. ఈ సమస్యను మూలశంక అని కూడా అంటుంటారు. ఒక్కసారిగా ఒరుసుకుపోవడంతో కొందరిలో రక్తస్రావం కావడం, బట్టలకు అంటుకుని నలుగురిలో ఇబ్బందిగా అనిపించడం జరుగుతుంది. మరికొందరిలో మలద్వారం వద్ద దురద, నొప్పితో బాధిస్తుంటాయి. 

మూలశంక సమస్య తొలిదశల్లోనే ఉన్నవారు...  ముదురాకుపచ్చగా ఉండే అన్ని ఆకుకూరలు, ఆయా సీజన్లలో దొరికే తాజాపండ్లు, పీచుపదార్థాలు పుష్కలంగా ఉండే ధాన్యాలతో చేసిన ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. పాలిష్‌ చేయని ధాన్యాలు, చిరుధాన్యాలతో వండిన పదార్థాల్లో పీచు పుష్కలంగా ఉంటుంది. మంచినీళ్లు ఎక్కువగా తాగటం, ద్రవాహారాలు తీసుకోవడం చేయాలి. దీనికి తోడు దేహ కదలికలకు తోడ్పడే వ్యాయామాలూ చేయాలి.

చదవండి: (Knee pain: మోకాళ్ల నొప్పులకు చెక్‌ పెట్టండిలా..)

ఈ అంశాలన్నీ కలగలసి మలాన్ని సాఫ్ట్‌గా చేస్తాయి. దాంతో మలద్వారం వద్ద ఎలాంటి ఆటంకమూ లేకుండా మృదువుగా విసర్జితమవుతుంది. ఈ అంశమే మొలలు రానివారికి ఓ నివారణగానూ, అప్పటికే మొలలు ఉన్నవారికి ప్రాథమిక చికిత్స (ఫస్ట్‌ లైన్‌ ట్రీట్‌మెంట్‌)లాగా చేస్తుంది. మొలల్లో  గ్రేడ్‌లు ఉంటాయి. వాటి తీవ్రత ఉన్నప్పుడు డాక్టర్ల సలహా మేరకు కొన్ని అడ్వాన్స్‌డ్‌ చికిత్సలతో పాటు, శస్త్రచికిత్స వరకూ అవసరం పడవచ్చు. పరిస్థితి అంతవరకూ వెళ్లకుండా ఉండాలంటే... మొలల సమస్యను కేవలం కేవలం డయటరీ ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఆహారం, వ్యాయామాలతోనే నివారించవచ్చు.  

మరిన్ని వార్తలు