పింక్‌బెల్ట్‌ మిషన్‌ ఏం చేస్తుందో తెలుసా?

20 Mar, 2021 19:28 IST|Sakshi

రెండేళ్లుగా మహిళలపై జరిగే దాడులను, ఎంతో మంది మహిళా బాధితులు మృత్యువాత పడటానికి గల కారణాలను ముంబయ్‌లోని పింక్‌బెల్ట్‌ మిషన్‌ గుర్తించడంతో పాటు తగిన రక్షణ చర్యలను తీసుకుంటోంది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు ఈ మిషన్‌ చేపట్టే కార్యక్రమాలు చేరుతున్నాయి. లాభాపేక్ష లేని ఈ స్వచ్ఛంద సంస్థ ఇప్పుడు మహిళల భద్రతకు సంబంధించిన సురక్షా పరికరాన్ని అమలులోకి తీసుకువచ్చేలా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తోంది.

పింక్‌ బెల్ట్‌ మిషన్‌ మహిళల భద్రత కోసం ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. మహిళల భద్రతకు ఉద్ధేశించిన ఓ సేఫ్టీ డివైజ్‌ను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ విషయంలో తమకు మద్దతుగా నిలవాలని సంతకాల సేకరణ కార్యక్రమం కూడా చేపట్టింది. ది పింక్‌ బెల్ట్‌ పేరుతో అందుబాటులోకి  తెచ్చే ఈ అసాల్ట్‌ అలర్ట్‌ బ్యాండ్‌ దాడులను అప్రమత్తం చేసే బ్యాండ్‌గా ఉండాలని విజ్ఞప్తి చేస్తోంది. దీనిలో జిపిఎస్‌ ట్రాకింగ్‌ ఉంటుందని, ఇది దాడి జరిగిన సమయంలో కేవలం ఒక బటన్‌  నొక్కడం ద్వారా సమీపంలో ఉన్న అధికారులను, వైద్య కేంద్రాలను, కుటుంబ సభ్యులను కూడా అప్రమత్తం చేస్తుందని తద్వారా ప్రమాదంలో ఉన్న మహిళకు వెనువెంటనే అవసరమైన సహకారం అందుతుందని ఈ మిషన్‌  ప్రతినిధులు వివరిస్తున్నారు.

వేగవంతమైన సాయానికి..: 2019లో దేశంలో ప్రతి 13  నిమిషాలకూ ఒక లైంగిక దాడి, 1000కుపైగా యాసిడ్‌ దాడులు జరిగాయని నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో నివేదికలు వెల్లడిస్తున్న నేపధ్యంలో ఈ పింక్‌ బెల్ట్‌ మిషన్‌ కు మద్ధతుగా నిలవాలని, తమ ఆన్‌ లైన్‌ పిటిషన్‌లో సంతకం చేయాలని కోరుతున్నారు. ఈ అంశాలపై తన ఆలోచనలను పింక్‌బెల్ట్‌ మిషన్‌ ఫౌండర్‌ అపర్ణ రజావత్‌ వెల్లడిస్తూ ‘అత్యాచారాల కారణంగా ఎన్నో మరణాలను మనం చూస్తున్నాం. ఎంతోమంది యాసిడ్‌ దాడి బాధితులు కంటి చూపు కోల్పోవడంతో పాటుగా ఆ భయంతోనే జీవితాంతమూ గడుపుతున్నారు. పింక్‌ బెల్ట్‌ మిషన్‌  ఈ తరహా సంఘటలను దాటి ముందుకు వస్తున్నప్పటికీ, అత్యంత సమస్యాత్మకంగా ప్రమాద ఘంటికలను మోగిస్తోన్న అంశమేమిటంటే సమయానికి తగిన సహాయం పొందలేకపోతుండటం. అది నేరాన్ని నిరోధించడంలో కావొచ్చు లేదా వేగవంతంగా వైద్య సహాయం అందించడంలో జాప్యమైనా కావొచ్చు. ఈ పింక్‌ బెల్ట్‌ మిషన్‌  ద్వారా మేం ప్రభుత్వ సహాయం తీసుకుని ఈ అసాల్ట్‌ అలర్ట్‌ నేపథ్యాన్ని బయటకు తీసుకురావడంతో పాటుగా ఆపదలో ఉన్న వారికి తగిన సహాయం అందించేలా కృషి చేస్తున్నాం. ప్రభుత్వ సహాయంతో పింక్‌ బెల్ట్‌ ఇప్పుడు సుదూరతీరాలకు వెళ్లడంతో పాటు జీవితాలనూ కాపాడుతుంది. అంతేకాదు, దీంతో ప్రతి రోజూ మన దేశ మహిళను సురక్షితంగా నిలుపడంలోనూ తోడ్పడుతుంది’ అన్నారు. సంతకం చేయాల్సిన పిటిషన్‌ లింక్‌..https://pinkbeltmission.org/iwantmypinkbelt/  

మరిన్ని వార్తలు