హ్యాట్రిక్‌ వాకిట్లో కేసీఆర్‌..?

29 Nov, 2023 08:35 IST|Sakshi

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: వరుసగా మూడు ఎన్నికల్లో గెలిచి ఒక ముఖ్యమంత్రి హ్యాట్రిక్‌ సాధించడం ఒక అరుదైన రికార్డు. దక్షిణ భారతదేశంలో గతంలో ఒక్క ఎంజీఆర్‌ మాత్రమే వరుసగా మూడు ఎన్నికల్లో పార్టీని విజయపథంలోకి నడిపించారు. అయితే ఆయన పదేళ్లు మాత్రమే అధికారంలో ఉన్నారు. 1977లో ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న ఆయన ప్రభుత్వాన్ని 1980లో గవర్నర్‌ బర్తరఫ్‌ చేశారు.

గవర్నర్‌ పాలన అనంతరం 1980 ఎన్నికల్లో ఆయన పార్టీ మళ్లీ విజయం సాధించింది. 1984లో ఆయన మరోసారి గెలిచారు. 1987లోనే ఆయన చనిపోయారు. శిఖరప్రాయులైన తమిళ నాయకుడు సి. రాజగోపాలాచారి రెండేళ్లు, కామరాజ్‌ నాడార్‌ తొమ్మిదేళ్లు, అన్నాదొరై రెండేళ్లు మాత్రమే ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కరుణానిధి సుదీర్ఘకాలం 17 సంవత్సరాల పాటు సీఎంగా చేసినప్పటికీ ఆయన నాయకత్వంలో వరుసగా రెండుసార్లు పార్టీ విజయం సాధించలేదు.

కర్ణాటకలో దిగ్గజ నాయకులైన నిజలింగప్ప, వీరేంద్రపాటిల్, దేవరాజ్‌ అర్స్, రామకృష్ణ హెగ్డేలకు ఎవరికీ ఈ ఘనత దక్కలేదు. కేరళలో ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకొని తదుపరి ఎన్నికల్లో మళ్లీ గెలిచిన ఘనత ప్రస్తుత సీఎం పినరయి విజయన్‌కే దక్కింది. ఈకే నయనార్, కరుణాకరన్‌లు పదేళ్లు అధికారంలో ఉన్నా వరుసగా లేరు. వివిధ సందర్భాల్లో మూడు విడతలుగా పనిచేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం కోసం నాటి హైదరాబాద్‌ స్టేట్‌ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు తన పదవిని త్యాగం చేశారు. అప్పటినుంచి తెలుగుదేశం పార్టీ పుట్టేవరకూ రాష్ట్రం కాంగ్రెస్‌ ఏలుబడిలోనే ఉన్నది. సంజీవరెడ్డి దగ్గర్నుంచీ విజయభాస్కరరెడ్డి దాకా ఏ ముఖ్యమంత్రి కూడా ఐదేళ్ల కాలం పని చేయలేదు. కాసు బ్రహ్మానందరెడ్డి ఏడేళ్ల కాలం పని చేసినా ఒక ఎన్నిక దగ్గర్నుంచి మళ్లీ ఎన్నికల వరకు ఆయన పదవిలో లేరు. ఎన్టీఆర్‌ కూడా అంతే. వరుసగా ఐదేళ్లు లేరు. 1989లో ముందస్తుకు వెళ్లి ఓడిపోయారు. చంద్రబాబు నాయకత్వంలో తొలిసారి వాజ్‌పేయి అండతో గెలిచారు. ఆ తర్వాత ముందస్తుకు వెళ్లి ఓడిపోయారు.

రాష్ట్ర విభజన తర్వాత మాత్రమే ఆయన ఐదేళ్లు పూర్తి చేసుకున్నారు. కానీ, ఆ తదుపరి ఎన్నికల్లో ఓడిపోయారు. ఒక్క వైఎస్‌.రాజశేఖరరెడ్డికి మాత్రమే రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఎన్నికల నుంచి ఎన్నికల దాకా ఐదేళ్లు పూర్తి చేసుకొని తదుపరి ఎన్నికల్లో పార్టీని గెలిపించిన ఘనత దక్కింది. దురదృష్టవశాత్తు ఆయన కొద్ది రోజులకే చనిపోయారు. లేకపోతే పదేళ్ల కిందనే తెలుగునాట హ్యాట్రిక్‌ అంచనాలు వెలువడేవి. ఇన్నాళ్లకు కేసీఆర్‌కు అటువంటి అవకాశం ఎదురైంది. హ్యాట్రిక్‌ కొట్టగలమనే నమ్మకాన్ని బీఆర్‌ఎస్‌ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు కారణంగా పదేళ్ల తమ పరిపాలనా ఘనతలను వారు ఏకరువు పెడుతున్నారు.

హైదరాబాద్‌ నగరాభివృద్ధిని ప్రముఖంగా పేర్కొంటున్నారు. ఈ అభివృద్ధి కారణంగా తలసరి ఆదాయంలో రాష్ట్రం అగ్రస్థానాన్ని సాధించిన వైనాన్ని బీఆర్‌ఎస్‌ ప్రచారం చేసుకుంటున్నది. 24 గంటల వ్యవసాయ విద్యుత్, ఇబ్బడిముబ్బడిగా పెరిగిన వ్యవసాయ ఉత్పత్తుల గణాంకాలను ఆ పార్టీ ఎన్నికల ప్రచారంలో ప్రముఖంగా ప్రస్తావించింది. నీటిపారుదల సౌకర్యం, వైద్య కళాశాలల ఏర్పాటులో రికార్డు సృష్టించామని బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధారాలతో సహా ప్రముఖంగా ప్రకటనలిస్తున్నది.

మరిన్ని వార్తలు