ఫస్ట్‌ టైమ్‌ పర్వతాలు పరవశించి... ఆశీర్వదించాయి!

8 May, 2022 00:26 IST|Sakshi
ఆత్మవిశ్వాసమే అద్భుత విజయ మంత్రం: ప్రియాంక మోహితే

‘మనుషులు పర్వతాలతో కలిసి కరచాలనం చేసినప్పుడు గొప్ప అద్భుతాలు సంభవిస్తాయి’
అలాంటి అద్భుతాలను అయిదుసార్లు చవిచూసి మాటలకు అందని మహా అనుభూతిని సొంతం చేసుకుంది ప్రియాంక మోహితే.

తాజాగా ప్రపంచంలోనే మూడో ఎల్తైన శిఖరం కాంచన్‌జంగా(8,586 మీటర్లు)ను అధిరోహించి జేజేలు అందుకుంటోంది మహారాష్ట్రలోని సతారాకు చెందిన ప్రియాంక మోహితే. ఈ విజయం ద్వారా ప్రపంచంలోని ఎనిమిదివేల మీటర్లకు పైగా ఎత్తు ఉన్న అయిదు పర్వతశిఖరాలను అధిరోహించిన తొలి భారతీయ మహిళగా రికార్డ్‌ సృష్టించింది.

చిన్నప్పటి నుంచి పర్వతారోహణ గురించిన విషయాలు తెలుసుకోవడం, పర్వతారోహకులతో మాట్లాడడం అంటే ప్రియాంకకు చాలా ఇష్టం. ఆ ఇష్టమే తనను ప్రపంచం మెచ్చిన పర్వతారోహకురాలిగా మలిచింది. టీనేజ్‌లో తొలిసారిగా ఉత్తరాఖండ్‌లోని బందర్‌పంచ్‌ పర్వతశ్రేణిని అధిరోహించింది ప్రియాంక.
 
ఇక ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు.
2013లో మౌంట్‌ ఎవరెస్ట్‌(8,849 మీ), 2016లో మౌంట్‌ మకలు(8,485 మీ), మౌంట్‌ కిలిమంజారో(5,895 మీ), 2018లో మౌంట్‌ లోట్సే (8,516 మీ), గత సంవత్సరం మౌంట్‌ అన్నపూర్ణ (8,091 మీ) పర్వతాలను అధిరోహించింది.

గత సంవత్సరం మౌంట్‌ అన్నపూర్ణ అధిరోహించడానికి బయలుదేరేముందు కోవిడ్‌ భయాలు సద్దుమణగలేదు. రకరకాల ప్రత్యేక  జాగ్రత్తలు తీసుకోకతప్పలేదు. కొత్త విజయాన్ని నా ఖాతాలో వేసుకోబోతున్నాను...అంటూ ఒక వైపు అంతులేని ఆత్మవిశ్వాసం, మరోవైపు అక్కడి ప్రతికూల వాతావరణ పరిస్థితుల గురించి విన్న భయంగొలిపే విషయాలు తన మనసులో కాసేపు సుడులు తిరిగాయి. అయితే చివరికి మాత్రం ప్రతికూల ఆలోచనలపై ఆత్మవిశ్వాసమే అద్భుత విజయాన్ని సాధించింది.
స్ట్రెంత్‌ ట్రైనింగ్‌ నుంచి క్రాస్‌ ఫిట్‌ వరకు ప్రత్యేక దృష్టి పెట్టింది.

సాహసయాత్రకు బయలుదేరేముందు–
‘ప్రతి విజయం తరువాత సోషల్‌ మీడియాలో నా ఫాలోవర్స్‌ సంఖ్య పెరుగుతున్నారు. ఈసారి కూడా అలాగే జరగాలని ఆశిస్తున్నాను’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసింది ప్రియాంక.
మౌంట్‌ అన్నపూర్ణను విజయవంతంగా అధిరోహించిన తరువాత సోషల్‌మీడియాలో ఆమె ఫాలోవర్స్‌ ఇబ్బడిముబ్బడిగా పెరిగారు.
నాట్యం చేసిన పాదాలు పర్వతాలను ముద్డాడాయి (ప్రియాంకకు భరతనాట్యంలో మంచి ప్రావీణ్యం ఉంది)...అని కవిత్వం చెప్పినవారు కొందరైతే– ‘మీ విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని ఎంత పెంచిందో మాటల్లో చెప్పలేను’ అన్నవారు కొందరు.

ప్రతి విజయ యాత్రకు ముందు–
‘నా కల నెరవేర్చుకోవడానికి బయలుదేరుతున్నాను’ అని పోస్ట్‌ పెడుతుంది ప్రియాంక.
ఆ వాక్యానికి ఎన్నెన్ని ఆశీర్వాద బలాలు తోడవుతాయోగానీ ఆమె అద్భుత విజయాలను సాధిస్తుంటుంది.
ముంబై యూనివర్శిటీలో బయోటెక్నాలజీలో పీజీ చేసిన ప్రియాంకకు పర్వతారోహణ అంటే టీనేజ్‌లో ఎంత ఉత్సాహంగా ఉండేదో, ఇప్పుడూ అంతే ఉత్సాహంగా ఉంది. ఆ ఉత్సాహమే  30 సంవత్సరాల ప్రియాంక బలం, మహా బలం!

మరిన్ని వార్తలు