కొబ్బరి తోటలో అంతల పంటల సాగుతో అదనపు ఆదాయం

5 Sep, 2023 11:23 IST|Sakshi

ఉద్యాన తోటల్లో సైతం ఏదో ఒకే పంటపై ఆధారపడకుండా.. అంతర పంటల సాగు చేస్తేనే రైతులకు వ్యవసాయం గిట్టుబాటవుతుంది. కొబ్బరి రైతుల ΄ాలిట అంతరపంటల సేద్యం కల్పతరువుగా మారింది. దక్షిణ కోస్తా ఆంధ్రా జిల్లాల్లో వాతావరణం కొబ్బరి సాగుకు అనుకూలం. అందువల్లనే ఏపీ కొబ్బరి తోటల విస్తీర్ణంలో 50 శాతానికిపైగా పాత ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉంది. కొబ్బరి తోటల్లో ఉండే పాక్షిక నీడ వల్ల చల్లని వాతావరణం ఏర్పడుతుంది.

ఆ వాతావరణం సుగంధ ద్రవ్య పంటల (స్పైసెస్‌)కు ఎంతో అనువైనది. ముదురు కొబ్బరి తోటల్లో అనేక సుగంధ ద్రవ్య పంటలను అంతర పంటలుగా సాగు చేస్తూ, నేరుగా మార్కెటింగ్‌ చేసుకుంటున్న రైతుల విజయగాథలెన్నో. విశేష ప్రగతి సాధిస్తున్న అటువంటి ఇద్దరు ప్రకృతి వ్యవసాయదారులు ఉప్పలపాటి చక్రపాణి, సుసంపన్న అనుభవాలను తెలుసుకుందాం..

గత ఐదారేళ్లుగా కొబ్బరిలో అంతర పంటలు సాగు చేస్తూ.. వీటి ద్వారా ప్రధాన పంటకు తగ్గకుండా అదనపు ఆదాయం పొందవచ్చని రైతు శాస్త్రవేత్త ఉప్పలపాటి చక్రపాణి రుజువు చేస్తున్నారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్క్ష్మీపురం గ్రామానికి చెందిన చక్రపాణి గత 13 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కొబ్బరి తోటలో వక్క, మిరియాలు, పసుపు అల్లం పండిస్తూ సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తున్నారు. కొబ్బరి తోటలో ఆరేళ్ల క్రితం నాటిన 2,500 వక్క చెట్లు చక్కని ఫలసాయాన్నిస్తున్నాయి. ఈ ఏడాది 700 వక్క చెట్లకు కాపు వచ్చింది. 2 టన్నుల ఎండు వక్కకాయల దిగుబడి ద్వారా రూ. 3 లక్షల 80 వేలు ఆదాయం వచ్చిందని చక్రపాణి వివరించారు. 300 కొబ్బరి చెట్లకు ఐదారేళ్ల క్రితం మిరియాల తీగలను పాకించారు. వీటిద్వారా 500 కిలోల ఎండు మిరియాల దిగుబడి వచ్చింది. కేజీ రూ.600 చొప్పున రిటైల్‌గా అమ్ముతున్నారు.


గానుగ నూనెతో ఆరోగ్యం
కొబ్బరి చెట్ల మధ్య వక్క చెట్లు పెంచి.. కొబ్బరి చెట్లకు అనేక ఏళ్ల క్రితమే మిరియం మొక్కల్ని పాకించడంతో చక్రపాణి కొబ్బరి తోట వర్టికల్‌ గ్రీన్‌ హెవెన్‌గా మారిపోయింది. కొబ్బరి చెట్లకు మిరియం మొక్కలు చుట్టుకొని ఉంటాయి కాబట్టి, మనుషులను ఎక్కించి కొబ్బరి కాయలు దింపే పద్ధతికి స్వస్తి చెప్పారు. కాయల్లో నీరు ఇంకిన తర్వాత వాటికవే రాలుతున్నాయి. రాలిన కాయలను అమ్మకుండా.. సోలార్‌ డ్రయ్యర్‌లో పూర్తిగా ఎండబెట్టి కురిడీలు తీస్తున్నారు. కురిడీలతో గానుగల ద్వారా సేంద్రియ కొబ్బరి నూనె తీసి నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు.

రెండేళ్లుగా తాము ఇంట్లో వంటలకు తమ సేంద్రియ కొబ్బరి నూనెనే వాడుతున్నామని, చాలా ఆరోగ్య సమస్యలు తీరటం గమనించామని చక్రపాణి సంతోషంగా చెప్పారు. పసుపు ఫ్లేక్స్‌ కొబ్బరి తోటలో వక్క, మిరియాలతో పాటు రెండేళ్లుగా అటవీ రకం పసుపును కూడా సాగు చేస్తున్నారు చక్రపాణి. ఈ రకం పసుపు వాసన, రంగు చాలా బాగుంది. పచ్చి పసుపు కొమ్ములను పల్చటి ముక్కలు చేసి, సోలార్‌ డ్రయ్యర్‌ లో ఎండబెట్టి, ఆ ఫ్లేక్స్‌ను అమ్ముతున్నారు. వాటి వాసన, రంగు, రుచి అద్భుతంగా ఉన్నాయని వాడిన వారు చెబుతున్నారన్నారు.

సిలోన్‌ దాల్చిన చెక్క బెటర్‌
కొబ్బరిలో వక్క వేయడంతో పైకి తోట వత్తుగా కనిపించినా నేలపైన అక్కడక్కడా ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీల్లో గత ఏడాది నుంచి అటవీ పసుపుతో పాటు అల్లం, సిలోన్‌ దాల్చిన చెక్క, నట్‌మగ్‌లను సాగు చేస్తున్నామని చక్రపాణి తెలిపారు. సాధారణంగా మనం ఇళ్లలో వాడే దాల్చిన చెక్క విదేశాల నుంచి దిగుమతయ్యే సాధారణ రకం.

సిలోన్‌ దాల్చిన చక్క రకం దీనికన్నా మెరుగైనది. ఇది పల్చగా ఉన్నప్పటికీ, ఆరోగ్యకరమైనదని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా కోస్తా ఆంధ్రలో బాగా పండుతోందని చక్రపాణి వివ రించారు. కొబ్బరి, ΄ామాయిల్‌ తోటల్లో అంతర పంటల సాగు ద్వారా అధికాదాయం పొందేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నట్లు పెదవేగి మండల ఉద్యాన అధికారి ఎం. రత్నమాల తెలి΄ారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. 
– కొత్తపల్లి వినోద్‌కుమార్, 
సాక్షి, పెదవేగి, ఏలూరు జిల్లా 

కేరళ మాదిరిగా ఇక్కడా పండిస్తున్నా!
రైతులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లోనే పంటలు పండించటం నేర్చుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లాలో అప్‌లాండ్‌ ఏరియాలో ఉద్యాన తోటలకు అనువైన వాతావరణం ఉంది. ఇవి సారవంతమైన భూములు. ఇక్కడి నీరు కూడా మంచిది. నాలుగైదేళ్లుగా భూగర్భజలాలు పెరగడంతో నీటి సమస్య లేదు. కొబ్బరిలో అంతర పంటలకు అనుకూలంగా ఉండేలా ముందే తగినంత దూరంలో మొక్కలు నాటుకొని సాగు చేసుకోవచ్చు.

 అంతర పంటలద్వారా సూక్ష్మ వాతావరణం సృష్టించుకొని కేరళలో మాదిరిగా సుగంధ ద్రవ్య పంటలు సాగు చేసుకోవచ్చు. కేరళలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే మన దగ్గర 45 డిగ్రీల వరకు వస్తుంది. కొబ్బరిలో అంతర పంటల వల్ల బయటతో పోల్చితే పది డిగ్రీల వరకు ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఎండ, గాలిలో తేమ సమపాళ్లలో చెట్లకు అందుతున్నందున కేరళలో మాదిరిగా మిరియాలు, దాల్చిన చెక్క ఇక్కడ మా తోటలోనూ పండుతున్నాయి. 


– ఉప్పలపాటి చక్రపాణి (94401 88336), 
లక్ష్మీపురం, పెదవేగి మండలం,
       ఏలూరు జిల్లా  
 

మరిన్ని వార్తలు