‘ది రిగ్‌’ థీమ్‌ పార్క్‌.. 2030 వరకు వేచి చూడాల్సిందే!!

7 Nov, 2021 11:03 IST|Sakshi

Saudi Arabia's The Rig Theme Park: విద్యార్థులకు బోరింగ్‌గా అనిపించే విజ్ఞాన యాత్రను వినోదభరితంగా మార్చింది సౌదీ అరేబియా ప్రభుత్వం. ఇకపై పరిశ్రమలోని చాంబర్లను, పెద్ద మెషిన్లను చూడటానికి నడుచుకుంటూ కాదు, రోలర్‌ కోస్టర్‌ రైడ్‌ చేస్తూ చూడొచ్చు. ఆశ్చర్యపోతున్నారా! ఫొటోలో కనిపిస్తున్నట్లు చమురు పరిశ్రమను తలపించే ఈ నిర్మాణం, నిజానికి ఓ థీమ్‌ పార్క్‌.. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షించే ప్రతిష్ఠాత్మక ప్రయత్నాలలో భాగంగా, ఈ థీమ్‌ పార్కును నిర్మించనుంది.  

పేరు ‘ది రిగ్‌’.. సుమారు 16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కులో వినోదాన్ని అందించే ఎన్నో రైడ్లు ఉన్నాయి. పార్క్‌ చుట్టూ నీరు ఉండటంతో వాటర్‌ రైడ్స్‌కు కొరత లేదు. అండర్‌ వాటర్‌ రైడ్స్, బంగీ జంపింగ్, స్కై డైవింగ్‌ వంటి వినోదాలు కూడా ఉన్నాయి. ఇక బస చేయడానికి వీలుగా మూడు హోటళ్లు, 11 రెస్టారెంట్లను ఏర్పాటు చేశారు. పార్క్‌లోనే కాదు.. థీమ్‌ పార్క్‌కు వెళ్లే మార్గం కూడా ఉత్సాహాన్ని నింపేలా నిర్మించారు. హెలికాప్టర్‌ రైడ్, బోట్‌ రైడ్‌ ద్వారా అక్కడికి చేరుకోవచ్చు. బాగుంది కదూ! మీరు కూడా అక్కడికి వెళ్లాలనుకుంటే కాస్త వేచి చూడక తప్పదు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ థీమ్‌ పార్కును 2030లో ప్రారంభించనున్నట్లు సమాచారం. 

చదవండి: 1.5 లీటర్ల కోల్డ్‌ డ్రింక్‌ పది నిముషాల్లో తాగేశాడు.. 18 గంటల్లోనే..
  

మరిన్ని వార్తలు