నాగుల పంచమి నాడు నాగుపామునే ఇంటికి తీసుకొచ్చి పూజలు

22 Aug, 2023 12:48 IST|Sakshi

శ్రావణమాసానికి ఎంతో విశిష్టత ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ మాసంలో ప్రతి రోజుకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. శ్రావణమాసం ప్రారంభం కాగానే నోములు, వ్రతాలతో పాటు పెద్ద ఎత్తున శుభకార్యాలు జరుగుతాయి. ఇక నిన్న శ్రావణ సోమవారంతో పాటు నాగపంచమి కూడా కావడంతో దేశంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

 నాగపంచమి అంటే పుట్టలో పాలుపోసి భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు. కానీ పామునే ఇంటికి తీసుకొచ్చి పూజలు చేసే వ్యక్తులు ఉంటారన్న విషయం మీకు తెలుసా? ఇది ఏంటో తెలియాలంటే స్టోరీ చదివేయండి.


నాగ పంచమి రోజున నాగపామునే నట్టింట్లోకి తీసుకొచ్చి పూజ చేసింది ఓ కుటుంబం. చక్కగా పూలు, పాలతో పూజ చేసి నైవేద్యాన్ని సమర్పించి ఆశీస్సులు తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకకు చెందిన ప్రశాంత్‌ హులేకర్‌ అనే వ్యక్తికి పాములు అంటే చాలా ఇష్టమట. అందుకే ప్రతి ఏటా నాగులపంచమికి కుటుంబంతో కలిసి పాములకు ప్రత్యేకంగా పూజలు చేస్తారట. అది కూడా ఇంటికి తీసుకొచ్చి మరీ.

ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా నాగుల పంచమి సందర్భంగా ఓ పామును తీసుకొచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం ఆ పామును అడవిలో వదిలిపెట్టారు. తనకు పాములంటే ఇష్టమని పాముల సంరక్షణ కోసం కృషి చేస్తుంటానని ప్రశాంత్‌ తెలిపాడు. అతని తండ్రి సురేష్‌ కూడా పాముల సంరక్షణ కోసం చాలా చేశాడట.

ఇక ప్రతీ ఏడాది నాగుల పంచమి నాడు ఇలా పాముని ఇంటికి తీసుకొచ్చి ఆ తర్వాత జాగ్రత్తగా దాన్ని అడవిలో వదిలివేయడం చేస్తామని పేర్కొన్నారు. తన తండ్రి నుంచి వారసత్వంగా ఇలా చేయడం ప్రతి ఏడాది ఆనవాయితీగా వస్తుందని, ఇప్పటివరకు దీని వల్ల కుటుంబంలో ఎవరికి హానీ జరగలేదని తెలిపాడు. పాముల పట్ల తమకు ప్రత్యేక భక్తి ఉందని, అందుకే ఇలా చేస్తానని వెల్లడించాడు.


 

మరిన్ని వార్తలు