నిలువెత్తు గెలుపు సంతకం

13 Sep, 2022 03:36 IST|Sakshi

‘మర్యాద, సభ్యత, క్రమశిక్షణ అనేవి మనిషిని తీర్చిదిద్ది ఉత్తములుగా తయారుచేస్తాయి’ అనేది మంచిమాట. ఈ మాటకు తన వంతుగా మరో మాట చేర్చాడు ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌ లారీ బేకర్‌... ‘మర్యాద, సభ్యత, క్రమశిక్షణ అనేవి అత్యుత్తమ నిర్మాణాలకు కారణం అవుతాయి’ ఆర్కిటెక్ట్‌గా దేశవిదేశాల్లో రాణిస్తున్న శ్వేతా దేశ్‌ముఖ్‌ లారీ బేకర్‌ చెప్పిన ప్రతి మాటను అక్షరాలా ఆచరించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ది ఇండియన్‌ అలర్ట్‌ ‘టాప్‌ టెన్‌ ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌–2022’ జాబితాలో చోటు సంపాదించిన శ్వేతాదేశ్‌ముఖ్‌ గురించి...

ముంబైకి చెందిన శ్వేతాదేశ్‌ముఖ్‌కు చిన్నప్పటి నుంచి స్కెచ్చింగ్, పెయింటింగ్‌ అంటే ఇష్టం. ఆ ఇష్టమే తనను ఆర్కిటెక్చర్‌ వైపు తీసుకువచ్చింది. నాగ్‌పుర్‌లో బీ.ఆర్క్, పుణెలో కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ పూర్తి చేసింది. ఆ తరువాత సొంతంగా ప్రాక్టీస్‌ మొదలు పెట్టింది. ఉద్యోగంలో చేరితే ఎలా ఉండేదో తెలియదుగానీ, సొంతంగా ప్రాక్టిస్‌ చేయడం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది. వివాహం తరువాత ముంబైలోని ఒక కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో సీనియర్‌ ఆర్కిటెక్ట్‌గా పనిచేసిన శ్వేత ఆ తరువాత ‘డిజైన్‌బాక్స్‌’ పేరుతో ఆర్కిటెక్చర్, ఇంటీరియర్‌ డిజైన్‌ కంపెనీ మొదలుపెట్టింది.‘డబ్బులు ఎక్కువ వచ్చినా సరే, తక్కువ క్రియేటివిటీ ఉండే ప్రాజెక్ట్‌లకు దూరంగా ఉండాలి’ అనే నిబంధన విధించుకుంది.

క్లయింట్స్‌ నుంచి సైట్‌ ఫోటోలు, వీడియోలు, డ్రాయింగ్స్‌ తీసుకోవడమే కాదు డిజైన్‌ ప్రాసెస్‌లో కూడా వారిని భాగం చేస్తుంది. కలర్‌ కన్సల్టింగ్, ఫర్నిచర్‌ డిజైనింగ్, వాల్‌ డెకర్, లైటింగ్‌ ఐడియాస్‌... ఇలా ఎన్నో విషయాలలో ఎంతోమంది క్లయింట్స్‌కు సేవలు అందించిన ‘డిజైన్‌బాక్స్‌’ మోస్ట్‌ ఇన్నోవేటివ్‌ ఫర్మ్‌ అవార్డ్‌ గెలుచుకుంది.
తన ఫేవరెట్‌ ప్రాజెక్ట్‌ల విషయానికి వస్తే ఇరవై అయిదు ఎకరాల పరిధిలోని భీమాశంకర్‌ హిల్స్‌(కర్జత్, మహారాష్ట్ర), పుదుచ్చేరిలోని మలీప్లె్లక్స్,గ్రీన్‌హౌజ్, చెంబూర్‌లోని ఏడు ఎకరాల కమర్షియల్‌ ఇంటీరియర్‌... ఇలా ఎన్నో ఉన్నాయి.

‘నాకంటూ ప్రత్యేకమైన స్టైల్‌ లేదు. క్లయింట్స్‌ అభిరుచి, అవసరాలను దృష్టిలో పెట్టుకొని డిజైన్‌ చేస్తాను’ అంటున్న శ్వేత నిర్మాణ ప్రక్రియలో పర్యావరణ కోణానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఉదా: స్క్రాప్‌ మెటీరియల్‌ను రీసైకిలింగ్‌ కంపెనీలకు తరలించడం, వర్షపునీటి నిల్వ, స్థానిక వనరులను సమర్థవంతంగా వాడుకోవడం... మొదలైనవి.
‘నా డిజైనింగ్‌కు ప్రకృతే స్ఫూర్తి ఇస్తుంది’ అని చెబుతున్న శ్వేత బాగా అభిమానించే ఆర్కిటెక్ట్‌ లారీ బేకర్‌. బ్రిటన్‌లో పుట్టిన బేకర్‌ ఇండియాకు వచ్చి నిర్మాణరంగం లో అనేక ప్రయోగాలు చేసి ‘లెజెండ్‌’ అనిపించుకున్నాడు. సామాన్యుల ఆర్కిటెక్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు. ‘ఇతర ఆర్కిటెక్ట్‌ల నుంచి స్ఫూర్తి పొందడం కంటే సామాన్యులు సృష్టించిన వాటిలో నుంచే ఎక్కువగా స్ఫూర్తి పొందుతాను’ అనే లారీ బేకర్‌ మాట తనకు ఇష్టమైనది. ఆయన చెప్పిన ‘లోకల్‌ విజ్‌డమ్‌’ను అనుసరిస్తుంది. ‘ఒక డిజైన్‌ చేసే ముందు ఆ పరిసరాలకు సంబంధించిన విషయాలపై అవగాహన పెంచుకోవాలి’ అని లారీ చెప్పిన మాటను ఆచరణలో చూపుతుంది శ్వేత.

గౌతమ్‌ భాటియా రాసిన ‘లారీ బేకర్‌: లైఫ్, వర్క్‌ అండ్‌ రైటింగ్‌’ పుస్తకం అంటే ఇష్టం. ‘ప్రతి వృత్తిలో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. అయితే ప్రతి సవాలు మన విజయానికి ఒక మెట్టులా ఉపయోగపడుతుంది. మొదట్లో మాకు కూడా రకరకాల సందేహాలు, సవాళ్లు ఎదురయ్యాయి. ఇలా స్టార్ట్‌ చేశాం. ఇలాగే ఉంటాం... అన్నట్లు కాకుండా ఎప్పటికప్పుడు మా ప్రణాళికలో మార్పు చేసుకుంటూ వచ్చాం’ అంటుంది శ్వేతాదేశ్‌ముఖ్‌. చదువుకునే రోజుల్లో, వృత్తిలోకి వచ్చిన తొలిరోజుల్లో మూర్ఛవ్యాధి సమస్యతో సతమతమయ్యేది శ్వేత. అలా అని ఎప్పుడూ ఆగిపోలేదు. ఇంటికి పరిమితం కాలేదు. పనిలో దొరికే ఉత్సాహన్నే ఔషధంగా చేసుకొని ముందుకు కదులుతుంది.

మరిన్ని వార్తలు