సంపాదనలో బౌండరీలు దాటి సిక్సర్‌లకు..

13 Feb, 2021 00:12 IST|Sakshi
స్మృతి మంధాన

మం‘ధన’ బిజినెస్‌ బౌండరీ

స్మృతి మంధాన క్రికెటర్‌గా ఎదిగారు. బిజినెస్‌ ఉమన్‌గా తారస్థాయికి చేరుకున్నారు. తాజాగా నైకీ ఒప్పందంతో మరింత పైకి చేరుకున్నారు. ఇప్పుడామె ప్లేయర్‌ మాత్రమే కాదు. ధనలక్ష్మి కూడా. సంపాదనలో స్మృతి బౌండరీలు దాటి సిక్సర్‌లకు చేరుకోబోతున్నట్లే ఉంది ఆమె ‘డీల్స్‌’ చూస్తుంటే!

స్మృతితో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్న నైకీ ఆమెకు ఎంత ముట్టచెబుతానని మాట ఇచ్చిందో అంతగా ప్రాధాన్యం లేని సంగతి. నైకీ అంతటి సంస్థే స్మృతి దగ్గరికి రావడం.. అదీ గొప్ప. సాధారణంగా స్మృతి ఏ బ్రాండ్‌కు ప్రచారం ఇవ్వాలన్నా ఏడాదికి కనీసం 50 లక్షల రూపాయల వరకు తీసుకుంటారని వినికిడి. ఆ లెక్కన నైకీ ఆమెకు రెట్టింపే ఇవ్వొచ్చు. స్టార్‌డమ్‌ నెట్‌వర్త్‌ డాట్‌ కామ్‌ అంచనా ప్రకారం చిన్న వయసులోనే అమిత సంపన్నురాలైన మహిళా క్రికెట్‌ ప్లేయర్‌ 24 ఏళ్ల స్మృతీ మంధాన. స్మృతి ప్రస్తుత ఆస్తుల విలువ 22 కోట్ల రూపాయలని ఆ సంస్థ ఇటీవల వెల్లడించింది.

ప్లేయర్‌గా ఆమెకు వచ్చే జీతం కూడా కలుపుకుని ఆ విలువ. అది కాక, భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు బీసీసీఐ నుంచి జీతంగా ఏడాదికి 50 లక్షల రూపాయలు అందుతాయి. ‘ఉమెన్స్‌ బిగ్‌ బాష్‌ లీగ్‌’లో కనిపించినందుకు మరికొంత మొత్తం లభిస్తుంది. క్రికెటర్‌గా వచ్చే ఈ రాబడి కాకుండా.. మహారాష్ట్రలోని ఆమె స్వస్థలం సంగ్లీలో ‘ఎస్‌.ఎం.18’ అని ఆమె ఒక కేఫ్‌ నడుపుతున్నారు. స్మృతి తలపైకి లాభాల గంపను ఎత్తుతున్న ఆమె తొలి వెంచర్‌ అది! ఎయిర్‌ ఆప్టిక్స్, హైడ్రా గ్లైడ్, బాటా, రెడ్‌ బుల్, హీరో మోటార్స్‌.. వీటినుంచి వచ్చే ప్రచార ధనం ఎటూ ఉంది.

స్మృతి మంధాన ఎందుకింత పాపులర్‌ అయ్యారు? మొదటిది ఆమె ఆట. రెండోది సోషల్‌ మీడియాలో ఆమె ఫాలోవర్స్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో 30 లక్షల 70 వేల మంది స్మృతిని ఫాలో అవుతున్నారు. ఇక క్రికెట్‌లో ఆమె విశ్వరూపం తెలియనిదెవరికి?! టీమ్‌ ఇండియా తరఫున 51 వన్డేలు ఆడారు. 2025 పరుగులు చేశారు. నాలుగు సెంచరీలు, 17 హాఫ్‌ సెంచరీలు చేశారు. 71 టి20 ఇంటర్నేషనల్స్‌ ఆడి 1716 పరుగులు తీశారు. అందులో 15 హాఫ్‌ సెంచరీలు. ఆడిన టెస్ట్‌ మ్యాచ్‌లు రెండే కానీ అసాధారణమైన ప్రతిభ కనబరిచి తొలి టెస్ట్‌లోనే హాఫ్‌ సెంచరీ చేశారు. స్మృతి మంధాన ఆట, సంపాదన ఒకటిని మించి ఒకటి పైపైకి ఎదుగుతున్నాయి. ఈ తరం అమ్మాయిలకు స్ఫూర్తి.. స్మృతి. 

మరిన్ని వార్తలు