పట్టు దొరకడానికే పద్యం

4 Sep, 2020 00:00 IST|Sakshi

కాలము– విలువ

అబ్దుల్‌ కలాంగారు విద్యార్థులతో మాట్లాడుతూ –‘‘నువ్వు ఒక కళాకారుడివి కావాలా, శాస్త్రవేత్తవి కావాలా, ఆధ్యాత్మికవేత్తవి కావాలా, ఆదర్శ రైతువి కావాలా... నీ ఇష్టం... నువ్వే నిర్ణయించుకో’–అంటారు.
విద్యార్థులు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఈ దేశ చరిత్రలో మీ పేరుమీద ఒక పేజీ చేరాలంటే.. మీకు జీవితం, కాలం విలువ తెలిసి ఉండాలి. చాలా మంది ఏదో ఒక బలహీనతకు ఆకర్షితులై వశపడిపోతారు. దాన్ని తట్టుకుని నిలబడి నిగ్రహంతో చదువుకోవడం విద్యార్థి దశలోనే ఎక్కువ సాధ్యపడుతుంది. ఆ తరువాత కాలంలో చదువుకుందామన్నా ఆ అవకాశం ఇంత సులభసాధ్యంగా మాత్రం ఉండదు. అన్నివేళలా కనిపెట్టుకుని ఉండే తల్లి, నీ అవసరాలు తీర్చే తండ్రి, ఇంటిపట్టున నీ చదువు సాఫీగా సాగేలా ఎన్నో సర్దుబాట్లు, నీ అభ్యున్నతిని కోరి నీకు నిత్యం అందుబాటులో ఉండే నీ గురువులు...ఇంత అనుకూలమైన స్థితి జీవితంలో మళ్ళీ రాదు.

దీన్ని ఎవడు బాగా సద్వినియోగం చేసుకుంటాడో వాడు బాగా వృద్ధిలోకి వస్తాడు. అందుకే వాంఙ్మయాన్ని ఛందోబద్ధం చేసారు. దేనిని ఎక్కువకాలం జ్ఞాపకం ఉంచుకోనవసరం లేదో దానిని వచనంగా చెబుతారు. ఏది జీవితాంతం  జ్ఞాపకంలో ఉండాలో దానిని ఛందస్సులో రాస్తారు. మత్తేభం, శార్దూలం, కందం, సీసం... ఇలా రాసిన పద్యాలు ధారణాయోగ్యాలయి ఉంటాయి.  అవి చదివితే అలా గుర్తుండిపోతాయి. అందుకూ ఛందస్సున్నది. నీకు జీవితంలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఆ విద్య నీకు అక్కరకు వస్తుంది... అంతేతప్ప పుస్తకం గూట్లో ఉండి బుర్రలో లేకపోతే సమస్యలను తట్టుకోగలిగిన నైతిక మార్గదర్శనం, శక్తి నీకు ఉండదు. అందుకే అంది వచ్చిన కాలాన్ని వదులుకోకూడదు.

దక్షిణ భారత దేశంలో ప్రఖ్యాతి వహించిన అరబిందో ఒకానొకనాడు అండమాన్‌ కారాగారంలో ఉన్నారు. శరీరాన్ని పూర్తిగా చాపుకుని పడుకోవడానికి కూడా చాలని గది. మంచినీళ్లు కావాలంటే... చువ్వల్లోంచి చేతులు పూర్తిగా చాపితే అందీ అందని చోట ఒక కుండ, ఒక గ్లాస్‌...పొరబాటున చేతినుంచి గ్లాస్‌ జారి పడిపోతే..ఇక ఆరోజుకు అంతే..కారాగారాన్ని శుభ్రపరిచే వ్యక్తి రోజుకు ఒకసారి అటువైపు వస్తాడు. కుండతో నీళ్ళు పెట్టి, అన్నం కంచం లోనికి తోసేసి వెళ్ళిపోతాడు. చాలామంది ఆ పరిస్థితులను తట్టుకోలేక మరణించేవారు. అలా పోయినవారి శరీరాల్ని పట్టుకు వెళ్ళి పక్కనే ఉన్న సముద్రంలోకి విసిరేసేవారు.... అరబిందో అన్నీ చూస్తుండేవారు. కానీ ఆయన మాత్రం...కాలం ప్రశాంతంగా లభించిందని, ఆ నరకకూపంలో కూర్చునే భగవద్గీత అంతా చదివి–వ్యాఖ్యానాలు తయారు చేసి... విడుదలయిన  తరువాత తన సిద్ధాంతాలతో ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందారు.

జవహర్‌ లాల్‌ నెహ్రూ గారిని కారాగారంలో ఉంచితే ...కాలాన్ని వృథా చేసుకోకూడదని అద్భుతమైన గ్రంథాలు రాసారు. అప్పటివరకు సామాన్యులుగా ఉన్నవారు, మన కళ్ళెదుటే మహాత్ములుగా మారడాన్ని చూస్తుంటాం. వారు చెప్పేదీ వింటూంటాం. మనసుకు ఎక్కనప్పుడు, ఎక్కించుకోనప్పుడు విని ఏం ప్రయోజనం !!! ఇన్ని గంటలకు లేస్తాను, రేపు ఈ పని చేస్తాను..అనుకుంటావు...కానీ లేవవు, చేయవు. నీవు చేయవలసిన పని గురించి నీకే ప్రణాళిక లేకపోతే రేపు ఏ ఉన్నత ఉద్యోగం పొందగలవు, దేశానికి లేదా నీవు పనిచేసే సంస్థకు ఏ ప్రణాళికలు రచించగలవు ??? మహాత్ముల జీవితాలగురించి ఎంత చదివారని కాదు, ఎంత విన్నారని కాదు, ఎంతగా ప్రేరణ పొందారు, దాన్ని సఫలీకృతం చేసుకోవడానికి కాలాన్ని ఎంతగా సద్వినియోగం చేసుకున్నారన్న దాని మీదే మీ విద్యార్థుల బంగారు భవిత ఆధారపడి ఉంది. 

మరిన్ని వార్తలు