స్వామివారు స్వయంభువుగా వెలసిన శేషాచలం కొండల మహాత్మ్యం అదే

16 Oct, 2023 10:37 IST|Sakshi

ఓ విదేశీయుడు భారతదేశంలోని దేవాలయాల ప్రాశస్త్యాన్ని కంప్యూటర్‌ ద్వారా తెలుసుకున్నాడు. శేషాచలం కొండల్లో నెలవై ఉన్న వేంకటేశ్వరస్వామి అతడిని ఆకర్షించాడు. వెంటనే స్వామిని దర్శించుకోవాలనిపించింది. అనుకున్నదే తడవుగా చెన్నై విమానమెక్కాడు. పక్కన కూర్చున్న ప్రయాణికుడి సలహా మేరకు విమానాశ్రయం నుంచి కాలి నడకన తిరుమలకి వెళ్ళదలిచాడు. సంప్రదాయ దుస్తులు ధరించి, భుజానికి సంచీ తగిలించుకుని బయలుదేరాడు. ఎప్పుడూ చెప్పులు లేకుండా నడవని అతడు, ఎర్రటి ఎండకి కాళ్ళు కాలుతున్నా లెక్కచేయలేదు. స్వామి రూపాన్నే తలుచుకుంటూ ముందుకు నడిచాడు. దారిలో కొండకి నడిచి వెళ్ళే బృందాలు కొన్ని కనిపించాయి. వారితో కలిసి నడవటం కొనసాగించాడు.

అలా మైళ్ళ కొద్దీ ప్రయాణం చేశాక, తిరుచానూరు చేరాడు. తల్లి పద్మావతి అమ్మవారి దర్శనం పూర్తయ్యింది. అమ్మవారి ప్రసాదం తింటూ తలెత్తి చూశాడు. వెండిరంగు లో మిలమిలా మెరుస్తున్న శేషాచలం కొండ చాలా దగ్గరగా అనిపించింది. చిన్న పిల్లవాడిలాగా ఎగిరి గంతులేశాడు. చకచకా నడుచుకుంటూ తిరుపతి పట్టణంలోని గోవింద రాజస్వామి గుడికి వెళ్ళి దండం పెట్టాడు. అక్కడే నాలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు కొని చదువుతూ మళ్ళీ శేషాచలం కొండల వైపు చూశాడు. ఆశ్చర్యం... కొండలు దూరంగా ఉన్నట్లు కనిపించాయి. ఉండబట్టలేక అతడు, తనతో పాటు నడుస్తూ ఉన్న మరో భక్తుడితో ‘‘అదేమిటండీ...? శేషాచలం కొండలకు దూరంగా ఉంటే, అవి చాలా దగ్గరగా ఉన్నట్లు, దగ్గరికి వెళితే ఎక్కడో...  దూరంలో ఉన్నట్లు కనబడుతున్నాయి’’ అని ఆసక్తిగా అడిగాడు.

ఆ భక్తుడు చిన్న నవ్వు నవ్వి ‘‘అదే నాయనా శేషాచలం కొండల మహాత్మ్యం. అవి స్వామివారు స్వయంభువుగా వెలసిన పవిత్రమైన  కొండలు కదా! మనం పనుల్లో పడి స్వామిని మరిస్తే ‘నీకు దగ్గరే ఉన్నాను, వచ్చిపోరాదా!’ అని పిలిచినట్లు అనిపిస్తుంది. దగ్గరికి  వెళ్తే ‘వచ్చావు కదా, నీ కష్టాలు తీరుతాయిలే...’  అని చెప్పి దూరమైనట్లవుతుంది. అయినా... అది చెబితే అర్థమయ్యేది కాదు. అనుభూతి చెందాల్సిందే. అందుకే ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి భక్తులు స్వామి దర్శనానికి పరుగులు తీస్తారు’’ అని వివరించాడు.భక్తిభావంతో ఆ విదేశీయుడి కళ్ళు తడి అయ్యాయి. గట్టిగా గోవిందనామ స్మరణలు చేస్తూ బృందాలతో కలిసి అలిపిరి చేరి మెట్ల మార్గంలో తిరుమలకు చేరాడు.                                      
– ఆర్‌.సి. కృష్ణస్వామి రాజు

మరిన్ని వార్తలు