మానసిక ఒత్తిడిని ఇలా అధిగమిద్దాం...

15 Oct, 2021 10:50 IST|Sakshi

ఇటీవలి కాలంలో చిన్నవారి నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరినీ పీడిస్తున్న సమస్య మానసిక ఒత్తిడి. మన శక్తి సామర్థ్యాల గురించి మనం ఉన్నదానికన్నా బాగా ఎక్కువగా లేదా బాగా తక్కువగా ఊహించుకోవడం...  ఫలితంగా నిరాశకు గురికావడం, మన గురించి మనం ఆలోచించడం కన్నా ఇతరులలో తప్పులు ఎన్నడం, సమయానికి తిండి, నిద్ర లేకపోవడం, ఎక్కువగా పని చేస్తూ తీవ్రమైన అలసటకు గురికావడం ఒత్తిడికి గురి చేస్తుంది.

ఒత్తిడి వల్ల మన నాడీవ్యవస్థలోనూ, నరాల్లోనూ రసాయనాల మార్పులు జరుగుతాయి. ఆ మార్పుల వల్ల రక్తపోటు, రక్తంలో కొలెస్ట్రాల్‌తో పాటు చక్కెర పాళ్లు పెరుగుతాయి. ఇది ఎక్కువయితే కుంగుబాటు లేదా డిప్రెషన్‌ వస్తుంది. డిప్రెషన్‌ వల్ల అనేక దుష్పరిణామాలు కలుగుతాయి. కనుక ఒత్తిడికి గురికాకుండా ముందే జాగ్రత్త పడటం, ఒత్తిడి ఎక్కువయినప్పుడు వాటినుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవడం అవసరం. 

చదవండి: Helath Tips: కాఫీ తాగే అలవాటుందా? నిద్రలేమి, యాంగ్జైటీ, చిరాకు..

ఇలా అధిగమిద్దాం..
►ఒక విషయం గురించి ఎంత ఆలోచించాలి అనేది నిర్ణయించుకుని అంతే ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. అవతలి వారు చెప్పేదానిని వినడం, తక్కువ మాట్లాడటం మంచిది.  
►విషయాలను మన కోణం నుంచి మాత్రమే కాకుండా ఎదుటి వారి కోణం నుంచి కూడా చూసి ఆలోచించడం అలవాటు చేసుకోవాలి.
►మన భావోద్వేగాలను బలవంతంగా అణిచేసుకోకుండా సన్నిహితులతో పంచుకోవడం వల్ల ఒత్తిడిని దూరం పెట్టవచ్చు. 
►దేనికి ఒత్తిడికి గురి అవుతున్నామో గమనించుకుని రెండోసారి దానికే మళ్ళీ గురి కాకుండా ఉండేలా చూసుకోవాలి.
►సానుకూల దృక్పథంతో ఉండటం, మనసుకు సంతోషాన్నిచ్చే పనులు చేయడం వల్ల ప్రశాంతత కలుగుతుంది.
►మన ప్రవర్తనను ప్రభావితం చేసే ధూమపానానికీ, మద్యానికి, మాదక ద్రవ్యాలకీ దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలి.
►సంపాదనలో కనీసం పది శాతం మంచి పనులకు ఖర్చు చెయ్యడం వల్ల కలిగే మానసిక తృప్తి ఒత్తిడికి గురి కాకుండా చేస్తుంది. 
►నాకు వద్దు, నాకు రాదు, నాకు చేతకాదు అనే మాటలను చెప్పడం మానుకోవాలి. 
►ఎప్పుడూ ఇంట్లోనే లేదా ఒక గదిలోనే కూర్చుండి పోవడం కన్నా బయటకు వెళ్లడం, స్నేహితులతో, బంధువులతో గడపడం, విహార యాత్రలకు వెళ్ళడం, సత్సంగం చేయడం ఒత్తిడిని తగ్గిస్తుంది. 

చదవండి: World Sight Day: ఆరెంజ్‌, క్యారెట్‌, రాగులు, ఉసిరి.. తిన్నారంటే.. మీ కంటి చూపు..

మంచి మ్యూజిక్‌ వినడం, యోగా, ఇంకా..
►ఇష్టమైన సంగీతం వినడం, పాటలు వింటూ కూనిరాగాలు తీయడం కూడా ఒత్తిడి తగ్గిస్తుంది.
►వారానికి ఒకసారి ఉపవాసం చేయడం, ఉదయం సూర్యోదయంలోని లేత కిరణాలు ఒంటికి తగిలేలా కూర్చోవడం; సాయంత్రం సూర్యాస్తమయాన్ని చూడడం మంచిది. 
►మన ఆందోళన వలన సమస్యలు తొందరగా గానీ, సజావుగా కానీ పూర్తి కావని గుర్తించటం, నవ్వుతూ ఉండటం, ఈ ప్రపంచం అనే అందమైన ప్రకృతిలో మనమూ ఒక భాగమేనని గుర్తించటం, యోగ, ప్రాణాయామం చేయడం ఒత్తిడిని దూరంగా ఉంచుతాయి.
►గాఢంగా ఊపిరి పీల్చి వదలడం వంటి బ్రీతింగ్‌ వ్యాయామాలు చేయడం...
►ప్రతి రోజు ఒక గంట ఏరోబిక్స్‌ లేదా టి.విలో చూస్తూ డాన్స్‌ చేయడం, వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్‌ వంటి వాటిలో ఏదో ఒకటి క్రమం తప్పకుండా చేయడం వల్ల గుండె , ఊపిరితిత్తులు, రక్తనాళాలు ఆరోగ్యకరంగా పనిచేస్తాయి. కండరాలు, కీళ్ళు గట్టిపడతాయి. శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది. వ్యాయామంలో స్ట్రెస్‌ని కలిగించే హార్మోన్లు నశించి, మంచి హార్మోన్లు, ఎండార్ఫిన్స్‌  విడుదలవుతాయి. అవి ఒత్తిడిని దూరం చేస్తాయి.
►టెన్నిస్, ఫుట్‌బాల్, బాస్కెట్‌ బాల్, హాకీ లేదా క్రికెట్‌ వంటి ఆటలు ఆడుతుండాలి. 
►ఉద్యోగంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమందితో కలిసి వర్క్‌ చేస్తున్నప్పుడు ఒత్తిడి తగ్గుతుంది, ఆరోగ్యకరమైన పోటీ పెరుగుతుంది. నాయకత్వపు లక్షణాలు అలవడతాయి.
►ఏదైనా అంశం తీవ్రంగా బాధపెడుతుండటం లేదా పదే పదే గుర్తుకొస్తూ పశ్చాత్తాపానికి గురిచేస్తుంటే మరింకేదైనా వ్యాపకంలో పడుతూ దాన్ని మరచిపోవడం ఒత్తిడి నుంచి బయట పడేందుకు దోహదం చేస్తుంది. 


చివరగా ఒక్క విషయం... 
ఒత్తిడికి గురయ్యే క్షణాల్లో చిక్కుకున్నప్పుడు అది తప్పని పరిస్థితి అని, దాని కారణంగా ఒత్తిడికి గురవుతూ అంతర్మధనానికి లోనుకోవడం కంటే... అది తప్పించుకోలేని పరిస్థితి కాబట్టి, ఆ స్థితిని యథాతథంగా స్వీకరించడం మంచిదని మనం సర్దిచెప్పుకోవడం, పరిస్థితులను సానుకూల దృక్పథంతో చూడటం, సమస్యలను అధిగమించాల్సిన కోణంలో పరిశీలించడం వంటి కొన్ని మార్గాల ద్వారా ఒత్తిడిని సులువుగా అధిగమించవచ్చు. 

చదవండి: టీనేజర్స్‌ మానసిక ఆరోగ్యంపై సోషల్‌ మీడియా బ్యాడ్‌ ఎఫెక్ట్‌..!

మరిన్ని వార్తలు