అర్చకత్వంలోనూ సగం..

19 Aug, 2021 00:16 IST|Sakshi
సుహంజన గోపీనాథ్‌ వడియార్‌

దేవాలయాల్లో అర్చకులుగా ఎక్కువగా పురుషులే కనిపిస్తుంటారు. ఇప్పుడా స్థానాల్లోకి సైతం మహిళలు అడుగుపెట్టేస్తూ ఔరా అనిపిస్తున్నారు. తమిళనాడుకు చెందిన 28 ఏళ్ల సుహంజన గోపీనాథ్‌ వడియార్‌ (పూజారి) బుధవారం బాధ్యతలు చేపట్టి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. అర్చకత్వం చేస్తూ మరెంతోమంది మహిళలకు ప్రేరణగా నిలవనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్‌ సుహంజనను పూజారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం తో తమిళనాడులో రెండో మహిళా పూజారిగా నిలిచింది సుహంజన. 208 మంది అర్చకులను నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వగా.. దీనిలో మహిళా పూజారిగా సుహంజన, ఇతర కులాల నుంచి శిక్షణ పొందిన అర్చకులు 24 మంది ఉన్నారు.

మాడంబాకమ్‌లోని ధేనుపురీశ్వరర్‌ ఆలయంలో సుహంజన వడియార్‌గా సేవలందించనుంది. సుహంజనను అర్చకత్వం చేయడానికి ఆమె భర్త, మామగారు ముందుండి ప్రోత్సహించడం విశేషం.

 తమిళనాడులో మహిళ అర్చకత్వం చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. తండ్రి మరణించడంతో అతడు చేసే అర్చకత్వాన్ని వారసురాలిగా అతని కుమార్తె చేయవచ్చని మద్రాస్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పిన్నియక్కళ్‌ తమిళనాడులోనే తొలి మహిళా పూజారిగా బాధ్యతలు చేపట్టింది. పిన్నియక్కాళ్‌ తండ్రి పిన్న తేవార్‌ మధురైలోని అరుల్మిగు దురై్గ అమ్మన్‌ కోవెలలో పూజారిగా పనిచేసేవారు. ఆయనకు ఆరోగ్యం బాగోకపోవడంతో ఆలయంలో ఆయన చేయాల్సిన పనులను పిన్నియక్కాళ్‌ చేసేది. కొంత కాలం గడిచాక ఆరోగ్యం క్షీణించి పిన్నతేవార్‌ 2006లో మరణించాడు. దీంతో ఆయన స్థానంలో పిన్నియక్కాళ్‌కు ఆ బాధ్యతలు ఇవ్వడానికి గ్రామస్థులు ఒప్పుకోలేదు. ఆమె హైకోర్టును ఆశ్రయించడం తో పిన్నియక్కాళ్‌ అర్చకత్వం నిర్వహించవచ్చని కోర్టు తీర్పు చెప్పింది. దాంతో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి 2007లో పిన్నియక్కాళ్‌ను పూజారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేగాక ఆయన రాష్ట్ర అసెంబ్లీలో ఇదే విషయాన్ని వక్కాణించి చెప్పడం విశేషం.

‘‘నేను కరూర్‌ సామినాథన్‌లో మూడేళ్లు అర్చకత్వాన్ని చదివాను. ఇది ఒక ఉద్యోగ అవకాశంగా నేను చూడడం లేదు. నిర్మాణాత్మకమైన సాంప్రదాయం ఇది. అర్చకత్వాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ  మహిళలు కూడా ఇది చేయగలరని సందేశాన్ని సమాజానికి ఇవ్వాలనుకుంటున్నాను’’అని సుహంజన చెప్పింది.

మరిన్ని వార్తలు