బంగారం లోంచి సువాసనలు..!

15 May, 2023 00:42 IST|Sakshi

గురువాణి

కొంతమంది యోగ్యత కలిగినవారు ఉన్నత పదవులలోకి వెళ్ళిన కారణం చేత ఆ పదవి శోభిస్తుంది. వాళ్ళకీ కీర్తి వస్తుంది. పదవి, వ్యక్తి గుణాలు రెండూ సమున్నతంగా ఉంటే... బంగారానికి తావి అబ్బినట్లుంటుంది. ఎలా అంటే... అమెరికా సంయుక్త రాష్ట్రాలకు అధ్యక్షుడిగా చేసిన హెర్బర్ట్‌ హూవర్‌ బాగా పేదరికం అనుభవించాడు. తల్లీతండ్రీ లేరు. మేనమామ చదివిస్తున్నాడు. 18వ ఏట స్టాన్ ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఉండగా..కళాశాల ఫీజు కట్టేంత డబ్బుసమకూరక చిక్కుల్లోపడ్డాడు. దీనినుంచి బయటపడడానికి ... స్నేహితుడితో కలిసి ఒక ఆలోచన చేసాడు.

అప్పట్లో పోలండ్‌లో పియానో విద్వాంసుడిగా ఖ్యాతి వహించిన ఈగ్నాసీ యాన్‌ పద్రెస్కీ కచేరీ పెట్టి వచ్చిన వసూళ్ళలో ఖర్చులు పోగా మిగిలిన డబ్బును ఫీజుల కింద చెల్లించాలనుకున్నారు. ఆయనను సంప్రదించి రెండువేల డాలర్లకు ఒప్పందం చేసుకున్నారు. కానీ వసూళ్లు కేవలం 1600 డాలర్లే వచ్చాయి. పైగా కచేరీ నిర్వహణ ఖర్చులు కూడా చెల్లించాలి. ఏం చేయాలో తోచక నేరుగా పద్రెస్కీనే కలిసి వచ్చిన మొత్తం డబ్బు ఆయన చేతిలో పెట్టి మిగిలిన దానికి చెక్‌ ఇచ్చారు... మీరు కాలేజీ ఫీజులకోసం ఇది చేస్తున్నామని ముందుగా ఎందుకు చెప్పలేదంటూ పద్రెస్కీ ఆ చెక్‌ చించేసి డబ్బు తిరిగి వారి చేతులో పెట్టి... మీ ఫీజు, కచేరీ నిర్వహణ ఖర్చులు పోగా మిగిలితే ఇవ్వండి, లేకపోయినా ఫరవాలేదన్నారు.

పద్రెస్కీ తదనంతర కాలంలో పోలండ్‌కు ప్రధానమంత్రి అయ్యారు. అది మొదటి ప్రపంచ యుద్ధకాలం. పోలండ్‌లో కరువు పరిస్థితి. తినడానికి కొన్ని లక్షలమందికి అన్నంలేని స్థితి. ప్రధానమంత్రిగా ఆయన అమెరికాలోఉన్న అంతర్జాతీయ ఆహార, సహాయ సంస్థకు ఒక విజ్ఞాపన పంపారు. ఆ సంస్థకు అధ్యక్షుడు హెర్బర్ట్‌ హోవర్‌. ఆ ఉత్తరాన్ని పరిశీలించి టన్నులకొద్దీ బట్టలు, ప్రతిరోజూ 2 లక్షలమందికి భోజనానికి సరిపడా సామాగ్రి పంపారు.

ఈ ఉపకారానికి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెప్పుకోవడానికి పద్రెస్కీ అమెరికా వెళ్ళి హోవర్‌ను కలిసాడు. ‘‘మీరు కాదు కృతజ్ఞత లు.. నేను చెప్పాలి’’ అన్నాడు హోవర్‌. అదేమిటి అని పద్రెస్కీ ఆశ్చర్యపోతుండగా... గతంలో ఫీజుకట్టలేక మీ కచేరీ పెట్టి మిమ్మల్ని ఇద్దరు విద్యార్థులు కలిసారు, గుర్తుందా... అని అడిగాడు హోవర్‌. ఎప్పుడో జరిగిన వృత్తాంతం. అప్పటికి కొన్ని దశాబ్దాలు గడిచాయి. మీరు తీసుకోకుండా ఇచ్చిన డబ్బుతో కాలేజి ఫీజు చెల్లించి చదువు పూర్తి చేసుకోవడానికి మీరు సహకరించింది నాకే. మీరు చేసిన సాయంతోనే నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను... అన్నాడు.

ఆ తరువాత కాలంలో...అంటే అమెరికా అధ్యక్షపదవి స్వీకరించడానికి ముందు కూడా హోవర్‌ పోలండ్‌ వెళ్లాడు. మళ్ళీ అక్కడ పేద పిల్లల స్థితిగతులను చూసి చలించిపోయి భారీ ఎత్తున సహాయం పంపే ఏర్పాట్లు చేసాడు... మంచి గుణగణాలు.. వారికే కాదు, వారి పదవులకు కూడా గౌరవం తెచ్చిపెడతాయి.
 

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

మరిన్ని వార్తలు