Paroma Chatterjee: బిజినెస్‌ లీడర్‌ లాభాల చెయ్యి

25 Apr, 2021 00:34 IST|Sakshi
పరోమా చటర్జీ

ఆర్ధిక లావాదేవీలను, వ్యవహారాలను టెక్నాలజీతో నడిపించే రంగాన్ని ‘ఫైనాన్స్‌ టెక్నాలజీ’ (ఫిన్‌టెక్‌) అంటారు. టెక్నాలజీ ఒక్కటే తెలిస్తే కాదు, ఫైనాన్స్‌ కూడా తెలిసుండాలి. కొంచెం కష్టమైన, ప్రావీణ్యం అవసరమైన పరిజ్ఞానాలివి. అయితే పరోమా చటర్జీకి ఇవి తప్ప వేరే ఏవీ ఆసక్తికరమైనవి కావని అనిపిస్తుంది. గత పదిహేనేళ్లుగా లెండింగ్‌ కార్ట్, ఫ్లిప్‌కార్ట్, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వంటి పెద్ద సంస్థల ‘ఫిన్‌టెక్‌’ విభాగాలలో అసమాన వృత్తి నైపుణ్యం కనబరుస్తూ వచ్చారు. ఇప్పుడిక ‘రివల్యూట్‌’ అనే 400 కోట్ల పౌండ్ల బ్రిటన్‌ కంపెనీ.. భారత్‌లో అదే పేరుతో తను ప్రారంభించబోతున్న కంపెనీకి వెళుతున్నారు! పరోమాను భారత్‌లోని తమ కంపెనీకి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా నియమించినట్లు ‘రివల్యూట్‌’ సంస్థ గురువారం ప్రకటించింది.

మహిళలకు డబ్బు వ్యవహారాలు తెలియవని, టెక్నాలజీ పరిజ్ఞానం అంతంత మాత్రమేనని కింది స్థాయిలో ఎవరెంత అనుకున్నా, పెద్ద పెద్ద మల్టీనేషనల్‌ కంపెనీలలో ఆ రెండు విభాగాలను నడిపిస్తున్నది దాదాపుగా మహిళలే. రివల్యూట్‌ను ఇప్పుడు పరోమా చటర్జీ నడిపించబోతున్నారు. ఆ కంపెనీ మనీ ట్రాన్స్‌ఫర్, ఎక్ఛేంజి, స్టాక్‌ ట్రేడింగ్, లోన్‌లు, వెల్త్‌ ట్రేడింగ్‌ సేవలను అందిస్తుంటుంది. అందుకు అవసరమైన టెక్నాలజీని వృద్ధి చేస్తుంటుంది. వచ్చే పద్దెనిమిది నెలల్లో తమ కంపెనీని భారత్‌లో విస్తృత పరిచేందుకు రివల్యూట్‌ ఏరికోరి పరోమాను ఎంపిక చేసుకుంది.

అంటే గూగుల్‌ పే, పేటీఎం, ఫోన్‌పే వంటి వాటిని పరోమా పక్కకు తోసేయాలి. ఛాలెంజింగ్‌ జాబ్‌! పరోమా లక్నోలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో చదివొచ్చారు. ఆ తర్వాత ఆమె తక్కువస్థాయి ఉద్యోగాలేమీ చేయలేదు. ఐసీఐసీఐ, భారతీ ఎయిర్‌టెల్‌లో కూడా చేశారు. రివల్యూట్‌ ఆఫర్‌ రావడానికి ముందు వరకు ఆమె లెండింగ్‌ కార్ట్‌లో చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌. దేశంలోని వ్యాపారవేత్తలకు వర్కింగ్‌ క్యాపిటల్‌ను సమకూర్చే విభాగానికి అధికారి ఆమె. తర్వాత వయా.కామ్‌ అనే ‘బిజినెస్‌ టు బిజినెస్‌ టు కన్యూమర్‌’ (బి2బి2సి) ఇంటర్నెట్‌ ట్రావెల్‌ కంపెనీలో ప్రపంచ వ్యాప్తంగా పదిదేశాలలోని లక్షకు పైగా గల ఏజెంట్‌ల వ్యవస్థను నిర్వహించారు. ఫ్లిప్‌ కార్ట్‌లో అమ్మకాల విభాగానికి ఇన్‌చార్జిగా చేశారు.
∙∙
పరోమా చటర్జీ ఇప్పుడు సీఈవోగా వెళ్తున్న రివల్యూట్‌ ఆరేళ్ల వయసు గల అంకుర సంస్థ. సిలికాన్‌ వ్యాలీలోని వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థలు టీవీసి, డీఎస్‌టీ గ్లోబర్, రిబిట్‌ క్యాపిటల్, లేక్‌స్టార్, జీపీ బుల్‌హౌండ్‌ల పెట్టుబడులు రివల్యూట్‌లో ఉన్నాయి. వాళ్లకు అసలుతో పాటు లాభాలూ అందించడం ఇప్పుడు రివల్యూట్‌ ఇండియా సీఈవో గా పరోమా బాధ్యత కూడా! ఇండియాలో తన విస్తరణకు సుమారు 200 కోట్ల రూపాయలను రివల్యూట్‌ వెచ్చించబోతోంది. వచ్చే ఏడాది ఇక్కడ ప్రారంభించబోతున్న కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా బెంగళూరును ఎంపిక చేసుకోవచ్చని ఆ రంగంలో ఉన్న ఇక్కడివారి అంచనా. పరోమా ఇంతవరకు పని చేసిన కంపెనీలనీ ప్రధానంగా బెంగళూరులోనివే. ఆమె చదువు కూడా ఒక నగరానికే పరిమితం అవలేదు. స్కూలు విద్య బెంగళూరులో; ఇంటర్, డిగ్రీ కోల్‌కతాలో, పీజీ ఐ.ఐ.ఎం. లక్నోలో.

మరిన్ని వార్తలు