కోవిడ్‌ వచ్చి తగ్గింది.. ప్రెగ్నెంట్‌ అయ్యాను.. వ్యాక్సిన్‌ తీసుకోవచ్చా?!

13 Sep, 2021 16:50 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నా వయసు 23 ఏళ్లు. నాలుగు నెలల కిందట నాకు ‘కరోనా’ వచ్చి, చికిత్స తర్వాత తగ్గింది. ఇటీవలే ప్రెగ్నెంట్‌ అయ్యాను. ఇప్పుడు నేను ‘కరోనా’ వ్యాక్సిన్‌ తీసుకోవచ్చా? ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఈ వ్యాక్సిన్‌ తీసుకుంటే ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా? – రాణి, చోడవరం

భారతదేశంలో మూడు నెలల కిందటే గర్భవతులు ఎప్పుడైనా కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు అనే మార్గదర్శకాలను భారత ఆరోగ్యశాఖ విడుదల చేసింది. ప్రెగ్నెన్సీలో కరోనా రావడం వల్ల వచ్చే దుష్ప్రభావాలతో పోల్చుకుంటే, కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల వచ్చే చిన్న ఇబ్బందుల కంటే ఉపయోగాలే ఎక్కువ కాబట్టి గర్భిణులు వ్యాక్సిన్‌ తీసుకోవడమే మంచిది. అందరిలోలాగానే వ్యాక్సిన్‌ తీసుకున్నప్పుడు ఒకరోజు జ్వరం, ఒళ్లునొప్పులు, ఇంజెక్షన్‌ ఇచ్చిన చోట నొప్పి, వాపు కొందరిలో ఉండవచ్చు.

దీనికి పారాసెటిమాల్‌ మాత్ర అవసరాన్ని బట్టి రోజుకు ఒకటి రెండు రోజులు రోజుకు రెండు లేదా మూడుసార్లు తీసుకోవచ్చు. గర్భవతులు వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత రక్తంలో ఏర్పడే యాంటీబాడీస్‌ మాయ ద్వారా బిడ్డకు చేరి, పుట్టిన తర్వాత బిడ్డకు కరోనా రాకుండా ఉండేలా చేస్తాయి. కరోనా వచ్చిన తర్వాత శరీరంలో ఏర్పడే యాంటీబాడీస్‌ శరీరంలో ఎక్కువకాలం ఉండకపోవచ్చు. కాని వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల తయారయ్యే యాంటీబాడీస్‌ ఎక్కువకాలం శరీరంలో ఉండి కరోనా రాకుండా కాపాడతాయి. ఒకవేళ వచ్చినా, ఎక్కువ కాంప్లికేషన్స్‌ రాకుండా రక్షిస్తాయి.

నా వయసు 49 ఏళ్లు. ఇటీవల పరీక్షలు చేయించుకుంటే, యుటెరిన్‌ ఫైబ్రాయిడ్స్‌ ఉన్నట్లు తేలింది. వీలైనంత త్వరగా గర్భసంచి తొలగించుకోవడమే మంచిదని డాక్టర్‌ చెప్పారు. నాకు సర్జరీ అంటే చాలా భయం. దీనికి మరే పరిష్కారమార్గం లేదా? – వనజ, శృంగవరపుకోట

గర్భాశయంలో ఎక్కడైనా ఫైబ్రస్‌ కణజాలం అధికంగా పెరిగి గడ్డలా ఏర్పడుతుంది. దీనినే ఫైబ్రాయిడ్‌ అంటారు. జన్యుకారణాలు, హార్మోన్ల ప్రభావం వంటి అనేక కారణాల వల్ల ఫైబ్రాయిడ్స్‌ ఏర్పడతాయి. ఇవి కొందరిలో ఒకటే ఏర్పడవచ్చు, కొందరిలో రెండు, మూడు ఇంకా అనేకం 0.5 సెం.మీ నుంచి 10 సెం.మీ. పైన అనేక పరిమాణాలలో పెరిగి ఏర్పడవచ్చు. దీనినే మల్టిపుల్‌ ఫైబ్రాయిడ్‌ అంటారు. ఇవి గర్భాశయంపైన ఏర్పడితే సబ్‌సిరీస్‌ ఫైబ్రాయిడ్స్‌ అని, మొత్తం లోపలి ఎండోమెట్రియం పొరలో ఏర్పడితే సబ్‌మ్యూకస్‌ ఫైబ్రాయిడ్‌ అని అంటారు.

ఫైబ్రాయిడ్స్‌ ఎక్కడ, ఎన్ని, ఎంత పరిమాణంలో ఉన్నాయనే దాన్ని బట్టి లక్షణాలు ఉంటాయి. అధిక బ్లీడింగ్, కడుపునొప్పి వంటివి ఇంట్రామ్యూరల్, సబ్‌మ్యూకస్‌ ఫైబ్రాయిడ్స్‌లో ఉంటాయి. ఇంట్రామ్యూరల్‌ ఫైబ్రాయిడ్స్‌ చిన్నగా ఉంటే పెద్ద లక్షణాలు ఉండవు. సబ్‌మ్యూకస్‌ ఫైబ్రాయిడ్స్‌ చిన్నగా ఉన్నా సరే కొందరిలో బ్లీడింగ్‌ ఎక్కువగా ఉండవచ్చు. సబ్‌సిరీస్‌ ఫైబ్రాయిడ్స్‌ వల్ల చాలావరకు సమస్యలు ఉండవు. కాని వాటి పరిమాణం పెరిగి, చుట్టుపక్కల అవయవాలపై ఒత్తిడి పడుతుంటే, మల మూత్ర విసర్జనకు ఇబ్బంది కలిగిస్తుంటే, అప్పుడు వాటిని తొలగించాల్సి ఉంటుంది.

మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే, మీకు ఫైబ్రాయిడ్స్‌ వల్ల ఇబ్బంది ఉన్నట్లు లేదా మామూలుగా స్కానింగ్‌ చేయించుకుంటే ఫైబ్రాయిడ్స్‌ ఉన్నట్లు నిర్ధారణ జరిగినట్లు అనిపిస్తుంది. అవి ఎంత సైజు, ఎక్కడ ఉన్నాయి అనేది వివరించి ఉంటే బాగుండేది. మీకు ఇప్పుడు 49 సంవత్సరాలు. వాటి వల్ల లక్షణాలు ఏమీ లేకుండా, వాటి పరిమాణం పెద్దగా లేకుండా ఉన్నట్లయితే కొంతకాలం ఆగి చూడవచ్చు. కొందరిలో పీరియడ్స్‌ ఆగిపోయి, మెనోపాజ్‌ దశకు చేరుకుంటే, ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ తగ్గిపోయి, దాని ప్రభావం లేకపోవడం వల్ల అవి ఇంకా పెరగకుండా ఉండి, మెల్లగా పరిమాణం తగ్గే అవకాశాలు ఉంటాయి.

క్రమంగా ఆరు నెలలకు ఒకసారి స్కానింగ్‌ చేయించుకుంటూ కొంతకాలం ఆపరేషన్‌ లేకుండా ఆగవచ్చు. లేదా మీకు అధిక బ్లీడింగ్, పొత్తికడుపు నొప్పి, విపరీతమైన నడుము నొప్పి, వాటి ఒత్తిడి వల్ల మలమూత్ర విసర్జనలో సమస్యలు అధికంగా ఉంటే అప్పుడు ఆపరేషన్‌ గురించి ఆలోచించవచ్చు. లేదంటే, పీరియడ్స్‌ ఆగిపోయే వయసు దగ్గరపడుతోంది కాబట్టి లక్షణాల తీవ్రత లేకపోతే కొంతకాలం గైనకాలజిస్టు పర్యవేక్షణలో ఫైబ్రాయిడ్స్‌ పెరుగుదల ఆపడానికి మందులు వాడవచ్చు. ఇవి వాడినన్ని రోజులు బ్లీడింగ్‌ తగ్గి, ఫైబ్రాయిడ్స్‌ పరిమాణం కొన్ని మిల్లీమీటర్లు తగ్గవచ్చు. కాబట్టి మీరు భయపడకుండా గైనకాలజిస్టును మళ్లీ ఒకసారి సంప్రదించి, సరైన నిర్ణయం తీసుకోవచ్చు.

ఆపరేషన్‌ అవసరమా లేదా అనేది లక్షణాల తీవ్రత, ఫైబ్రాయిడ్స్‌ పరిమాణం, అవి ఉండే ప్రదేశం, ఏ రకానికి చెందినవి అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఫైబ్రాయిడ్స్‌ పెరగకుండా, వాటికి రక్తప్రసరణను ఆపడానికి యుటెరైన్‌ ఆర్టరీ ఎంబోలైజేషన్‌ పద్ధతి, లేదా ఫైబ్రాయిడ్స్‌ చాలా వరకు కరగడానికి ఎంఆర్‌ఐ ద్వారా హైఫ్రీక్వెన్సీ అల్ట్రాసౌండ్‌ తరంగాలను పంపించడం జరుగుతుంది. ‘ఎంఆర్‌జీఎఫ్‌యూఎస్‌’ వంటి పద్ధతులు కూడా కొన్నిచోట్ల అందుబాటులో ఉన్నాయి. ఆపరేషన్‌ వద్దనుకుంటే, డాక్టర్‌ను సంప్రదించి, వాటి మంచిచెడులను బేరీజు వేసుకుని, వాటిని కూడా ప్రయత్నించవచ్చు. 

-డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్‌. హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు