Organ Donation: మృతి చెందాక కూడా 8 మందికి జీవితం ఇవ్వొచ్చు!

13 Sep, 2021 01:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

దానాలన్నిటిలో అవయవదానం గొప్పది అంటారు పెద్దలు. ఒక్క మాటలో చెప్పాలంటే మరణం తర్వాత కూడా మనం జీవించి ఉండగలిగే మహద్భాగ్యం అని చెప్పొచ్చు. ఒక మరణించిన వ్యక్తి అవయవాలను ఇతరులకు దానం చేయడం ద్వారా ఒకరి జీవితం ముగిసినప్పటికీ మరొకరి జీవితం రూపంలో మరో ప్రయాణాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. మరణానంతరం ఎంతో విలువైన అవయవాలను మట్టిపాలు చేయటం కంటే మన అవయవాలను దానం చేయడం ద్వారా మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపిన వారవుతాం. ఒక మనిషి అవయవాలను దానం చేయడం వలన వాటి అవసరం ఉన్న వారి ప్రాణాలు నిలబెట్టొచ్చంటున్నారు వైద్యులు.

ఒక వ్యక్తి అవయవ దానం చేయడం ద్వారా దాదాపు 50 మంది నిరుపేదలకు సహాయం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక అధికారిక సమాచారం ప్రకారం భారతదేశంలో ప్రతి ఏటా దాదాపు 5 లక్షల మంది ప్రజలు అవయవ దాతలు లేక మరణిస్తున్నారు. ఇక అవయవ దానం విషయానికి వస్తే.. దేశంలో ఒక మిలియన్ మందికి గానూ 0.26 శాతం మంది మాత్రమే చేస్తున్నట్టు సమాచారం.

శరీరంలోని ఏ అవయవాలను దానం చేయవచ్చు..
సాధారణంగా అవయవ దానం రెండు రకాలు కాగా మరణం తర్వాత చేసే అవయవ దానం మోదటిది అయితే సజీవ అవయవ దానం రెండవది. ఒక వ్యక్తి అవసరమైన వారికి సహాయం చేయడానికి తన శరీరంలోని మూత్రపిండాలు, క్లోమం కొంత భాగాన్ని దానం చేయవచ్చు. అలాగే మరణించిన వ్యక్తి యొక్క గుండె, కాలేయం, కిడ్నీలు, పేగులు, ఊపిరితిత్తులు, పాంక్రియాస్‌ దానం చేయొచ్చు. కార్నియా, గుండె కవాటాలు, చర్మం, ఎముకలు తదితర అవయవాలను సహజ మరణం పొందిన వారి నుంచే స్వీకరిస్తారు.

అలాగే బ్రెయిన్ డెత్ అయిన వ్యక్తి శరీర అవయవాలతో 8 మందికి ప్రాణం పోయొచ్చు. గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, పాంక్రియాస్, చిన్న పేగును మార్పిడి చేయవచ్చు. వీటితో పాటు చర్మం, కార్నియా, ఎముక కణజాలం, గుండె కవాటాలు, రక్త నాళాలను అవసరమైన రోగులకు దానం చేయవచ్చు.

ఏదైనా ప్రమాదం కారణంగా లేదా ఇన్ఫెక్షన్ కారణంగా కంటి చూపు కోల్పోయిన వారికి కార్నియాను రీప్లేస్ చేయడం ద్వారా తిరిగి చూపు ప్రసాదించవచ్చు. కాలిన గాయాల బాధితులకు చర్మం మార్పిడి చేస్తారు. గుండె బైపాస్ సర్జరీ చేయించుకునే వారికి దాతల నరాలను ఉపయోగిస్తారు.

అవయవాలను ఎవరు దానం చేయగలరు..
ఏ వ్యక్తి అయినా అవయవ దానం చేయవచ్చు. దీనికి సంబంధించి వయస్సుపై ఎలాంటి నిర్బంధమూ లేదు. నవజాత శిశువుల నుండి 90 ఏళ్ల వృద్ధులకు వరకు అవయవ దానాలు విజయవంతమయ్యాయి. అయితే 18 ఏళ్లలోపు వ్యక్తి మాత్రం తన అవయవాలను దానం చేయాలనుకుంటే, వారి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి.

ఏ అవయవ మార్పిడికి ఎంత సమయం..
అవయవ దాత శరీరం నుంచి గుండెను తీసిన తర్వాత దాన్ని 4 గంటల్లోగా అవసరమైన వారికి అమర్చాలి. ఊపిరితిత్తులు కూడా అంతే. మూత్రపిండాలను శరీరం నుంచి వేరు చేసిన 30 గంటల్లోగా మార్పిడి చేయొచ్చు. కాలేయం, పాంక్రియాస్‌ 12 గంటల్లోగా మార్పిడి చేయాలి.

అయితే వ్యక్తుల శరీర స్వభావాలను బట్టి కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్ కూడా ఏర్పడతాయి. అమర్చిన శరీర భాగాన్ని స్వీకర్త శరీరం అంగీకరించక తన రోగ నిరోధక వ్యవస్థ దాన్ని తిరస్కరించి దాడి చేస్తుంది. ఇక దీన్ని నివారించడానికి వైద్యులు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఇందుకోసం కొన్నిసార్లు జీవిత కాలంపాటు స్వీకర్త ఔషధాలు వాడాల్సి వస్తుంది.

నియమ నిబంధనలు..
అవయవ దానం చేసేవారి కోసం భారత ప్రభుత్వం కొన్ని రూల్స్‌ను రూపొందించింది. వాటిని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. లేదంటే చట్ట పరమైన చర్యలు తీసుకుంటారు. ఎవరైనా అవయవ దానం చేయాలనుకుంటే దాని కోసం వారు ప్రతిజ్ఞ ఫారమ్‌ను పూరించాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు