ఈ వారం కథ - ‘కంటి నిండా కునుకు’

24 Dec, 2023 11:57 IST|Sakshi

ఈమధ్య రాత్రయితే సరిగా నిద్ర పట్టడంలేదు దుర్గారావుకి. పక్కమీద యిటు దొర్లా, అటు దొర్లా. కునుకు పట్టినట్టే పట్టి, మళ్లీ యెవరో లేపినట్టు ఉలిక్కిపడి లేచిపోతాడు. పిసరు కునుకు కోసం, చీకట్లో మూతపడని కళ్ళతో యెదురుచూపులు... మంచానికి ఆవైపు భార్య జయమ్మ ఒళ్లెరుగని నిద్ర. ఇల్లాలు ఇంటిపనంతా చేసుకుని, మామయ్యగారి గదిలో పక్కసర్ది , పెద్దాయనకి దుప్పటి కప్పి, మంచం పక్క నీళ్ల చెంబు వుందో లేదో చూసుకుని, ఏమైనా కావాలంటే పిలవండి మామయ్యా అని నిష్క్రమిస్తుంది.

దుర్గారావు సంగతికొస్తే, ధనార్జనకి యెన్ని అడ్డతోవలు వున్నాయో అతనికి తెలిసినట్టు ఎవరికీ తెలీదు మరి. కాకుల్ని కొట్టి గద్దలకి వెయ్యడం దుర్గారావుకి వెన్నతో పెట్టిన విద్య. అన్నట్టు, కథలోంచి పిట్టకథకి వెళ్లడం యెందుకూ..! దుర్గారావుకి నిద్రయితే పట్టలేదు కానీ బుర్రనిండా ఆలోచనలే. రేపు తెల్లారితే యెన్ని పనులు! తను కబ్జా చేసిన రైతుల భూముల కేసు కోర్టులో హియరింగు. పనికిమాలిన లాయరు మూడేళ్లుగా లాగిస్తున్నాడు తెమల్చకుండా.

లాభం లేదు... పెద్దరైతుని లేపేస్తే సరి. అప్పటికీ ఓ పదో పరకో పడేస్తాను, పట్టుకుపోయి బాగుపడండ్రా అంటే వినరుకదా! విత్తనాలకి డబ్బుండదు... పైర్లకు మందులు కొట్టించలేరు, నాట్లకీ.. కోతలకీ కూలీలు దొరకరు. వాళ్ళ కష్టాలకి జాలిపడి, భూములు కబ్జాచేసి, తలాకొంచెం పట్టుకుపోదాం రండిరా అంటే, వింటేగా! పెద్దరైతుని లేపెయ్యడమే బెస్టు.

అలాగే కష్టపడి చెరువులు పూడిపించి ఫ్లాట్లు కట్టిస్తే, ఏడాదిలో బిల్డింగు కుంగిపోడం యేమిటో.. కొన్నవాళ్ళ ఖర్మ కాదూ. బిల్డింగు కూల్చేదానికి నోటీసు యిప్పించేసి, అది కూల్చే కాంట్రాక్టు కూడా తనే సంపాదించడం యెంత కష్టం. జనాలకి విశ్వాసం లేదు. అంతెందుకు.. కన్న కొడుక్కి వుందా విశ్వాసం! లక్షలు తగలేసి ఇంజనీరింగు చదివిస్తే, యాభై లక్షల కట్నంతో వస్తున్న ఎమ్మెల్యే గారి మెల్లకన్ను కూతుర్ని చేసుకోడానికి వీడికి యేమాయ రోగం? ఎవరినో లవ్వు చేశాట్ట.

ఆ పిల్లను తీసుకుని సీమకెళ్లి చచ్చాడు. పైగా ‘నాయనా, నీ పాపపు ఆస్తి నాకొద్దు, ఎవడికి రాస్తావో రాసుకో’ అని నీతులు కూడాను. కునుకుపట్టే వేళకి వీథి తలుపు చప్పుడు, టక టకా, టక టకా... ఈ వేళప్పుడు యెవరా అనుకుంటూ, దుర్గారావు తలుపు తీశాడు. తనంటే కిట్టనివాళ్లు యెవరైనా వచ్చి రెండు పోట్లు పొడుస్తారన్న భయం కూడా లేదు.
చీకట్లో కలిసిపోయేలా నల్లటి ఆకారం.. బలిష్టంగా, కళ్ళలో యేదో మెరుపు. ‘మీరు..’ అంతకన్నా మాటపెగల్లేదు దుర్గారావుకి.

‘ష్‌.. గట్టిగా మాట్లాడకు, మీ ఆవిడ, పక్కగదిలో నాన్న.. లేచిపోతారు’ అగంతకుడి గొంతు చిత్రంగా వుంది. ‘ఎవరు నువ్వు? నీకు మా వాళ్ళు యెలా తెలుసు?’ అని అడగాలనుకున్నా అడగలేకపోయాడు దుర్గారావు. నల్లటి ఆకారం పరిచయం వున్నట్టు డ్రాయింగ్‌ రూమ్‌లోకి నడిచింది. మంత్ర ముగ్ధుడిలా వెనక దుర్గారావు! లైటు వెయ్యబోతున్న దుర్గారావుని వద్దంటూ సైగ చేసింది ఆకారం. గది కిటికీలోంచి మసక వెలుతురు.

‘అలా కూర్చో’ అది తిరుగులేని ఆజ్ఞలా అనిపించింది దుర్గారావుకి. నెమ్మదిగా, ధైర్యం కూడగట్టుకున్నాడు దుర్గారావు. ‘యెవరు నువ్వు? యీ వేళకి యెందుకొచ్చావు?’ నీరసంగా మాట పైకి వచ్చింది. అప్పుడు నవ్వింది ఆకారం. ‘మృత్యువు పేరు విన్నావా? వినుండవేమో కదూ, నేనే ఆ మృత్యువుని. నాకు వేళాపాళా వుండదు. వెళ్లాలనుకున్న చోటికి వెళ్లడమే నాపని.’ దుర్గారావు వులిక్కిపడ్డాడు. నమ్మలేడు, నమ్మి తీరాలి.. అదీ పరిస్థితి.

‘మనం కాసేపు మాట్లాడుకుందాం.. సరేనా?’ దుర్గారావు జవాబుని యెదురు చూడలేదు మృత్యువు. దుర్గారావు చేసిన వొక్కో అకృత్యాన్ని చూసినట్టుగా చెప్పుకొచ్చింది మృత్యువు. ఇది యెలా సాధ్యం! ‘నిన్ను తీసుకెళ్లాలి, కానైతే నీతోవున్న యింత పెద్ద పాపపు భారాన్ని మోసుకెళ్లడం కుదరదు. నీ ప్రయాణంలో లగేజ్‌ అనుమతించ బడదు. యెలాగా అని ఆలోచిస్తున్నా’ మృత్యువు ముఖంలో చిరునవ్వు.

సరే మరో నాల్గయిదు రోజుల్లో వస్తా... సిద్ధంగావుండు...’ ఆకారం లేచి నిల్చుంది. ‘నువ్వు... నువ్వు యెవరు? కరోనావా?’ దుర్గారావు నీరసంగా అడిగాడు ధైర్యం కూడగట్టుకుని.
‘చెప్పాను కదా... నేను మృత్యువుని... యింతకీ నువ్వనే కరోనా యెవరో నాకు తెలీదు. త్వరలో కలుద్దాం!’ చీకట్లో వచ్చిన ఆకారం గాల్లో తేలిపోతున్నట్టు నెమ్మది నెమ్మదిగా కనుమరుగైపోయింది. దుర్గారావుకి అంతా అగమ్యగోచరంగా వుంది. మృత్యువు ఎందుకొచ్చినట్టు, యిప్పుడెక్కడికెళ్ళినట్టు!

దుర్గారావు భయమంటే ఎరగడు. అలాంటిది రాత్రి జరిగిన సంఘటన పదే పదే మెదులుతూ వెన్నులోంచి వణుకు పుట్టిస్తున్నది. తనని చూసి జనాలు భయపడుతుంటే.. దాన్ని గౌరవం అని భావించడం ఒక పొరపాటు. తను ఏం చేశాడని కొడుకు విశ్వాసం చుపించాలి? కూడపెట్టిన సంపద ఇప్పుడు ఎవరికి యివ్వాలి? ‘సరే తరవాత ఆలోచిద్దాం’ అనుకున్నాడు దుర్గారావు. కోర్టుకి టైమవుతున్నదని పూనకం వచ్చిన వాడిలా బయలుదేరాడు.

దుర్గారావు కోర్టు ఆవరణలోకి ప్రవేశిస్తుండగా జరిగిపోయింది ఆ సంఘటన. కోర్టు నుండి బయటకి వెడుతున్న కారు విసురుగా దుర్గారావుని ఢీ కొట్టడం, దుర్గారావుకి స్పృహ తప్పడం! కోర్టు జనాలు అతడివైపు పరుగెత్తుకుంటూ రావడం కూడా అతనికి తెలీలేదు. దుర్గారావు కష్టం మీద కళ్లు తెరిచాడు. చేతికి, తలకి, కట్లు. గదిలో నర్సుల హడావిడి.
అప్పుడు గమనించాడు దుర్గారావు.

తనకి రక్తం ఎక్కిస్తున్నారు... మర్నాడు పోలీసులు... ఎంక్వైరీ... యథావిధి. వకీలు ఎంతచెప్పినా దుర్గారావు వినిపించుకోలేదు. ‘ఈ సంఘటన యథాలాపంగా నా పరధ్యాన్నం వల్లే జరిగింది. ఇందులో కారు నడిపేవాడి తప్పులేదు. కోర్టుకి హాజరయే హడావిడిలో నేనే చూస్కోకుండా బండికి అడ్డం పడ్డాను’ దుర్గారావు స్టేట్మెంట్‌ యిస్తుంటే, నల్లకోటు తలపట్టుకుని కూర్చుంది. డ్యూటీ డాక్టర్లు, నర్సుల వల్ల అర్థమైందేవిటంటే.. కోర్టు ఆవరణలో అపస్మారకస్థితిలో ఉన్న తనని ఓ నలుగురు తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించారు.

డిపాజిట్‌ అదీ వాళ్ళే కట్టి ట్రీట్మెంట్‌ వెంటనే జరిగేలా చూశారు. నాలుగు యూనిట్ల రక్తం కూడా వాళ్ళే దానం చేశారు. తన వకీలుకూ కబురుపెట్టి రప్పించారు. ‘ఇంతసాయం చేశారు కదా మీకు ఈయన యెలా తెలుసు?’ అని డాక్టర్లు అడిగితే, ‘యెలా ఏవిటండీ ఆరి భూవులు దున్నుకుని బతికేటోళ్ళం... ఆరికి మేం మాకున్నంతలో కూసింత రగతం యిచ్చాము... అంతేకదా సారూ’ అన్నారట. మరి తన వకీలుగారు యిదంతా యెందుకు చెప్పలేదో.

రేపో మాపో డిశ్చార్జ్‌ చేస్తారనగా దుర్గారావు వకీలుకి కబురు పెట్టాడు.. ‘వీలునామా రాయాలి’ అని. ‘ఇప్పుడేం తొందర? మీరు హాయిగా యింటికెళ్లి కోలుకున్నాక రాయచ్చు లెండి’ అంటున్న వకీలు మాటలకి దుర్గారావు అడ్డుపడ్డాడు. ‘అన్నట్టు వకీలు గారూ... రేపు వచ్చేప్పుడు మన కక్షిదారు పెద్దరైతుని కూడా రమ్మనండి!’ దుర్గారావు మొహంలో వకీలుకి యే భావమూ కనిపించలేదు.

‘ఇది నేను పూర్తి ఆరోగ్యంతో వుండగా, యెవరి ప్రమేయం లేకుండా తీసుకున్న నిర్ణయం...’ అంటూ వకీలు రాసింది చదివాక దుర్గారావు సంతకం పెట్టాడు.  కాగితం మీద పెద్దరైతు, మరో ముగ్గురు వేలిముద్రలు వేశారు. దుర్గారావు కోరికమీద ఒక డాక్టరు, నర్సు సాక్షి సంతకాలు కూడా పెట్టేశారు. మనం కూడా ఆ రాసిందంతా యెందుకు చదవడం... రెండు మెతుకులు ముట్టుకు చూస్తేసరి.. అన్నం వుడికిందో లేదో...! ‘కోర్టు పరిధిలో వున్న కేసులన్నీ వాపసు తీకుంటున్నాను... భూములు.. పంటపొలాలు సర్వే ప్రకారం కౌలుదార్లకీ, పెద్దరైతుకీ చెందుతాయి.  మా వకీలు ఆ మేరకి కావలసిన పత్రాలు సిద్ధం చేస్తాడు. తనవల్ల నష్టపోయిన ఫ్లాట్‌ వోనర్లందరికీ నష్టపరిహారం...!

తేలికపడిన మనసుతో దుర్గారావు యిల్లు చేరాడు. వకీలు తదుపరి కార్యక్రమంలో మునిగిపోయాడు. రోజులు వారాలయిపోయాయి. కాలెండర్‌లో నెలలు తిరిగాయి... దుర్గారావుకి పడుకోగానే కంటినిండా  కునుకు పడుతున్నది. యే అర్ధరాత్రో తలుపు చప్పుడు విందామన్నా నిద్రలో వినపడదు కదా! - వల్లూరి విజయకుమార్‌ 

>
మరిన్ని వార్తలు