ఆ ఊరిలో మహిళలు పిల్లల్ని కనడానికే భయపడుతున్నారు!పుట్టిన మూడు నెలలకే..

24 Aug, 2023 17:37 IST|Sakshi

ఆ ఊరిలోని కుటుంబాలు పిల్లల్ని కనడానికే భయపడతున్నారు. అక్కడ శిశువులంతా కేవలం పుట్టిన మూడు నెలలకే చనిపోవడం. చనిపోయిన శిశువులంతా సడెన్‌గా కాళ్లు చేతులు వెనక్కి వాలేసి.. గుక్కపెట్టి ఏడ్చి చనిపోతున్నారు. శిశువుల మరణాలన్నీ ఒకే తీరు. పోనీ ధైర్యం చేసి వేరే ఊరు వెళ్లి పురుడు పోసుకుని వచ్చినా.. అదే పరిస్థితి. అక్కడ ప్రజలకు బిడ్డలను కనే యోగం లేదో మరేదైనా కారణం ఉందా!.. అనేది వైద్యులకు సైతం అంతుపట్టకపోవడం ఆశ్చర్యాన్ని రేకెత్తించే అంశం. 

అసలేం జరిగిందంటే..రెండేళ్ల కిందట 2021 ఆగస్ట్ నెలలో అశోక్, మత్స్యమ్మ దంపతులకు పుట్టిన మొదటి బిడ్డకు రెండు నిండి, మూడో నెల నడుస్తున్న సమయంలో...ఒక రోజు తల్లి మత్స్యమ్మ పాలు ఇచ్చిన కాసేపటికే పిడికిలి బిగిపెట్టి ఏడుస్తూ ప్రాణాలు వదిలేసింది ఆ శిశువు. పిల్లలకు ఏ పేర్లు పెట్టాలా అని అశోక్, మత్స్యమ్మల కుటుంబాల్లో చర్చలు జరుగుతున్న సమయానికే పిల్లల ప్రాణాలు పోయాయి. మత్స్యమ్మ, అశోక్ ఇంట్లో జరిగినట్లుగానే ఆ రూఢకోట గ్రామంలోని అన్ని కుటుంబాల్లోనూ ఇలాంటి విషాదాలే చోటు చేసుకున్నాయి. గత మూడేళ్లలో 20 మంది శిశువులు మరణించారు. వారి మరణాలకు కారణమేంటో తెలుసుకునేందుకు వైద్య బృందాలు పరిశోధనలు చేసినా నిర్దిష్టమైన కారణం ఇంతవరకు తెలియలేదు.

చనిపోయిన చిన్నారులంతా మూడు నుంచి ఆరు నెలల లోపు వయసు వారే. మా చేతుల్లో చనిపోడానికే అయితే పిల్లల్ని కనడం ఎందుకు? మాకు పిల్లలు వద్దు, ఊరులో పరిస్థితులు బాగుపడితేనే పిల్లల్ని కంటాం. లేదంటే పిల్లలు వద్దు అని మూడు నెలల వయసున్న ఇద్దరు శిశువుల్ని పొగొట్టుకున్న బాలు, సంధ్యారాణి దంపతులు ఆవేదనగా చెబుతున్నారు. అశోక్, మత్స్యమ్మ దంపతులు కూడా ఇలాగే వాపోయారు. ఇప్పటికే ఇద్దరు పిల్లల్ని పోగొట్టుకున్నాను. కారణాలేంటో తెలియడం లేదు.

చనిపోయే క్షణం వరకు పిల్లలు ఆరోగ్యంగానే ఉంటున్నారు. మాతో చక్కగా ఆడుకున్నారు. కానీ ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఒక్కసారిగా పిడికిలి బిగబట్టి, తల వాల్చేసి క్షణాల్లో చనిపోతున్నారు. పీహెచ్ సీ కూడా పక్కనే ఉంది. కానీ అక్కడకు తీసుకెళ్లేంత సమయం కూడా దొరకడం లేదు. ఇంకేం చేయాలి?” అని సంధ్యారాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి గర్భం దాల్చినా కూడా ఈ గ్రామంలో ఉండను. వేరే గ్రామానికి వెళ్లిపోయి, అక్కడే శిశువుకి జన్మనిచ్చి, కొంచెం పెద్దయ్యాకే గ్రామంలోకి అడుగు పెడదామనుకుంటున్నాను అని చెప్పారామె.

పోనీ వేరే చోట పురుడు పోసుకున్నా..
రూఢకోటకు కోడలిగా వచ్చిన ఓ మహిళ గర్భం దాల్చగానే తన పుట్టినిల్లయిన హుకుంపేటకు వెళ్లిపోయారు. అక్కడే బిడ్డకు జన్మనిచ్చారు. అయితే, ఆ బిడ్డ కూడా మూడు నెలలకే ఈ ఏడాది మేలో మరణించాడు. ఈ విషయాన్ని రూఢకోట పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ నిర్థారించారు. రూఢకోటకు హుకుంపేటకు మధ్య దూరం 35 కిలోమీటర్లు.

ఆరు నెలలు ఊరిలో ఎవరు గర్భం దాల్చలేదు!
2019 నుంచి 2022 మే వరకు 17 మంది శిశువులు మరణించారు. ఆ తర్వాత ఆరు నెలలు ఏ విధమైన మరణాలు సంభవించలేదు. మళ్లీ ఈ ఏడాది జనవరి, మే, ఆగస్ట్ నెలల్లో ముగ్గురు శిశువులు మరణించారు. ఇప్పటి వరకు 20 మంది శిశువులు రూఢకోట గ్రామంలో మరణించారని రూఢకోట పీహెచ్ సీ మెడికల్ ఆఫీసర్ సత్యారావు  చెప్పారు. రూఢకోటలో గర్భం దాల్చిన మహిళలు గ్రామంలో ఉన్నా, బయటకు వెళ్లినా, ఇంటి దగ్గరే ప్రసవమైనా లేదా ఆసుపత్రిలో ప్రసవమైన వారిలోని కొందరు శిశువులు మరణిస్తున్నారు.

కారణాలపై మాత్రం స్పష్టత రాలేదని డాక్టర్ సత్యారావు చెప్పారు. వరుసగా శిశువులు మరణిస్తుండటంతో ఆ ఊర్లో మహిళలు పిల్లలను కనేందుకు భయపడుతున్నారు. అందుకనే 2022 మే, జూన్ తర్వాత ఊరిలో ఎవరు గర్భం దాల్చలేదు. ఆరు నెలలు పాటు ఊరిలో ఎటువంటి మరణాలు సంభవించకపోవడంతో సంతోషపడ్డాం. కానీ మళ్లీ 2023 జనవరిలో ఒక శిశువు మరణిచడంతో మళ్లీ పిల్లల మరణాలు మొదలయ్యాయి. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని రూఢకోట ప్రజలు ఆవేదనగా చెబుతున్నారు. 
వైద్య బృందాలు అధ్యయనం చేయగా..
వైద్య బృందాలు అధ్యయనం చేసినప్పుడు.. ప్రసవాలన్నీ ఆసుపత్రుల్లోనే జరిగాయని గుర్తించారు. శిశువుల బరువు సాధారణ స్థాయిలో ఉంది. తల్లుల ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులూ లేవు. వీరిలో ఒక మహిళ డిప్లొమా వరకు చదివింది. ఈ గ్రామంలో 138 గృహాలు ఉండగా 247 మంది పురుషులు, 244 మంది మహిళలు. ఇక్కడ ఉన్నవారంతా చదువుకున్నవారే.

గుర్తించిన అంశాలు..
శిశువుల మరణాలు అత్యధికంగా అర్ధరాత్రి పూట సంభవించాయి. తీవ్రస్థాయిలో ఏడుస్తూ.. వాంతులు చేసుకుంటూ 6 నుంచి 12 గంటల వ్యవధిలోనే ప్రాణాలు విడిచారు. శ్వాస పీల్చుకోవడంలో శిశువులు బాగా ఇబ్బందులు పడ్డారు. ఒక శిశువులో ఫిట్స్‌ లక్షణాలు కనిపించాయి. స్థానికులు తాగే మంచినీటి నాణ్యత కూడా బాగానే ఉంది. ఎందువల్ల శిశువులు చనిపోతున్నారనేది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరిలా మిగిలిపోయింది.

(చదవండి: అత్యంత అరుదైన పాము! వీడియో వైరల్‌)

మరిన్ని వార్తలు