లోపలి అరలు, పొరలు, వాటికి అడ్డంగా తెరలు

30 Oct, 2023 00:11 IST|Sakshi

వాగ్గేయకార వైభవం

భక్తి ఎప్పుడూ ఆధిపత్య ధోరణిని, అహంభావాన్ని ప్రదర్శించదు. నేను గొప్ప, నాకిది వచ్చు. నాకన్నా వాళ్లెంత...అన్న వైఖరిని చూపదు. విద్య...విత్‌ అంటే తెలుసుకొనుట. ఏది తెలుసుకోవాలో అది తెలుసుకుంటే అది వినయం. ‘‘విద్యాదదాతి వినయం వినయాద్యాతిపాత్రతాం పాత్రత్వాత్‌ ధనమాప్నోతి ధనాద్ధర్మంతత సుఖం’’ వైరాగ్య సుఖం, మోక్ష సుఖం వరకు అంతే. అందుకే త్యాగరాజ స్వామి వారిని... మీరంతవారు, మీరింత వారని అంటూంటే... ఆయన పొంగిపోలేదు.

పైగా ఆయనేమన్నారు.. అంటే... ఎందరో మహానుభావులు ...అందరికీ వందనములు... అన్నారు. బ్రహ్మాన్ని తెలుసుకున్నవారు, రమించినవారు, పాడినవారు, అర్చించినవారు, అనుభవించినవారు ఎంతో మంది ఉండగా వారి ముందు నేనెంత, వారికి నేనేం చేయగలను, నమస్కారం చేస్తా...’’ అని వారందరినీ ఆదరపూర్వకంగా స్మరించుకున్నారు. వినయం అంటే అదీ.

ఆదిశంకరులు అంతటి వారు ‘‘పశుం మాం సర్వజ్ఞ ప్రథితకృపయాపాలయవిభో’’...‘శివా! నేను పశువును. నీవు పశుపతివి. ఇదే మనిద్దరి మధ్య బంధం’ అన్నారు. అది వినయం. అది విద్యకు పరమార్థం.అది దేనిచేత ప్రకాశిస్తుంది... అంటే ఉపాసనా దేవత అనుగ్రహానికి పాత్రమయితే అప్పుడు వినయం వస్తుంది. ఆ  వినయం మనకు వాగ్గేయకారులందరిలో కనబడుతుంది. అందుకే వారు ఏది చెప్పినా ఏది చేసినా మనకు సందేశం ఇస్తున్నట్లో, సలహా ఇస్తున్నట్లో ఉండదు. వారికి వారు చెప్పుకున్నట్లు ఉంటుంది.

భిన్న కథనాలు ఉన్నప్పటికీ, త్యాగరాజ స్వామివారు ఒకసారి వేంకటాచలం వెళ్ళారు, స్వామి వారి దర్శనం కోసం కూచున్నారు. తెర అడ్డంగా ఉంది. దిగంతాలకు వ్యాపించిన కీర్తిమంతుడిని, సాక్షాత్‌ ఉపనిషద్బ్రహ్మేంద్రులంతటి వారు నన్నుపిలిచి కీర్తనలు పాడించుకుంటారే, నేనొస్తే తెర వేస్తారా...  అని ఆయన కోపగించుకోలేదు.
ఈ తెర కాసేపయితే తీస్తారు.. ఇవ్వాళ కాకపోతే రేపయినా తీస్తారు. కానీ లోపల ఇంకొక తెర ఉంది... అనే అర్థంలో ఆయన అన్న మాటేమిటంటే...‘‘తెర తీయగ రాదా, నాలోని తిరుపతి వేంకటరమణా! మదమత్సరమను తెరదీయగరాదా, పరమ పురుషా!’’ అని పిలిచారు.

నిజానికి భగవంతుడు ఎక్కడ దర్శనం కావాలి? మన లోపల.. ‘అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా... లోపల అక్కడ కనబడాలి. పరమ యోగీంద్రులకు భావగోచరమైన పాదాబ్జములు నాకు దర్శనమయితే నేను యోగిని. .. అన్నారు
తెర వేసినందుకుగానీ, తెర తొలగించనందుకు గానీ ఆయన ఎవరినీ నింద చేయలేదు. నా అంతటివాడొస్తే.. అని అహంకరించలేదు. ఎప్పుడు తీస్తారని అడగలేదు. ఇక్కడ ఉన్న తెర ఎవరయినా, ఎప్పుడయినా తీస్తారు. ‘లోపల నాకు అడ్డొస్తోన్న తెరవల్ల నీవు నాకు ఎప్పటికీ కనబడడం లేదు. అది నీవే తీయాలి. నేను తీసుకోలేను. ఇంకొకరు తీయలేరు. అది తీయవయ్యా నాలోని వేంకటరమణా!’– అని వేడుకున్నారు.

నిన్ను పొందడానికి నాకు అడ్డొస్తున్నదేమిటంటే మత్సరం... అన్నారు. ఎంతగొప్పమాట! మత్సరం అంటే అన్య సుఖ ద్వేషి. ఇంకొకరికిఏదయినా మంచి జరిగితే మనం చాలా బాధపడి
పోతుంటాం. అన్నపానీయాలు ఎక్కవు. నిద్రాసుఖం ఉండదు. వాడికి శుభం జరగడమా, నాకన్నావాడేం గొప్ప. వాడికేం తెలుసని. వాడికి కీర్తి రావడమేమిటి, వాడికి శుభాలు జరగడమేమిటి ... ఇలా ఇతరులను తక్కువచేసి తన గొప్పదనం స్మరించుకోవడం... అది మత్సరానికి ప్రారంభ స్థానం. అది అడ్డొస్తున్నదన్నారు.
                                                    

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

మరిన్ని వార్తలు