దేశదేశాల దీపావళి

23 Oct, 2022 12:48 IST|Sakshi
మారిషస్‌లో దీపావళి సంబరాలు

దీపావళి పండుగను భారతదేశంలోనే కాకుండా దేశదేశాల్లోని హిందువులంతా ఘనంగా జరుపుకొంటారు. భారత్‌కు ఇరుగు పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయాన్మార్, శ్రీలంకలతో పాటు భారతీయుల జనాభా గణనీయంగా ఉండే అమెరికా, బ్రిటన్, కెనడా, మారిషస్, సింగపూర్, మలేసియా, ఇండోనేసియా, సురినేమ్, థాయ్‌లాండ్, ఫిజీ, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో దీపావళి వేడుకలు ఏటా బాణసంచా కాల్పులతో, దీపాల వెలుగులతో దేదీప్యమానంగా జరుగుతాయి. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోను, కెనడా ప్రధాని కార్యాలయంలోను దీపావళి వేడుకలను దాదాపు పాతికేళ్లుగా అధికారికంగా నిర్వహిస్తూ వస్తున్నారు.


వైట్‌హౌస్‌లో దీపాలు వెలిగిస్తున్న జో బైడెన్‌ దంపతులు

వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు 2003లో తొలిసారిగా అప్పటి అధ్యక్షుడు జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ హయాంలో ప్రారంభమయ్యాయి. ఈసారి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆధ్వర్యంలో వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కెనడా ప్రధాని కార్యాలయంలో దీపావళి వేడుకలు 1998 నుంచి జరుగుతూ వస్తున్నాయి. కెనడా ప్రధాని కార్యాలయంలో తొలిసారిగా నాటి ఎంపీ దీపక్‌ ఓబెరాయ్‌ దీపావళి వేడుకలను ప్రారంభించారు. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో కొన్నేళ్లుగా స్వయంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. భారత్‌ వెలుపల పలు దేశాల్లో అక్కడి అధికార వర్గాలు కూడా దీపావళి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటుండటం విశేషం.


ఫిజీలో దీపాలు వెలిగిస్తున్న పోలీసు అధికారి

దీపావళి మూలాలు ప్రాచీన భారతదేశంలో ఉన్నాయి. ఇక్కడి నుంచే ఈ పండుగ వివిధ ప్రాంతాలకు విస్తరించింది. క్రీస్తుశకం ఒకటో శతాబ్దికి చెందిన పద్మపురాణం, స్కందపురాణాల్లో దీపావళి ప్రసావన కనిపిస్తుంది. క్రీస్తుశకం ఏడో శతాబ్దికి చెందిన పాలకుడు హర్షుడు రాసిన ‘నాగానందం’ కావ్యంలో దీపావళి వర్ణన ఉంది. మొఘల్‌ హయాం నాటికి దీపావళి వేడుకల్లో భాగంగా బాణసంచా కాల్చడం మొదలైంది. దీపావళి హిందువులకు మాత్రమే పరిమితమైన పండుగ కాదు. ఈ పండుగను సిక్కులు, జైనులు, బౌద్ధులు కూడా సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. 


దీపావళి వేడుకలు ప్రారంభిస్తున్న కెనడా ప్రధాని


లండన్‌లో...


మలేసియాలో...

మరిన్ని వార్తలు